‘స్నేక్ గ్యాంగ్’కు యావజ్జీవం

12 May, 2016 03:16 IST|Sakshi
‘స్నేక్ గ్యాంగ్’కు యావజ్జీవం

శిక్షలు ఖరారు చేసిన రెండో స్పెషల్ సెషన్స్ కోర్టు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ కేసులో దోషులుగా తేలిన ఎనిమిది మందికి రంగారెడ్డి జిల్లా రెండో స్పెషల్ సెషన్స్ కోర్టు బుధవారం శిక్షలు ఖరారు చేసింది. స్నేక్ గ్యాంగ్ ముఠాకు చెందిన ఏడుగురు దోషులకు జీవితఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.20 వేల జరిమానా విధిం చింది. ఎనిమిదో దోషికి 20 నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ మేరకు 2వ స్పెషల్ సెషన్స్ కోర్టు ఇన్‌చార్జ్ జడ్జిగా ఉన్న 14వ అదనపు డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి వరప్రసాద్ తీర్పు వెలువరించారు.

ఏడుగురు దోషులైన ఫైసల్ దయానీ, ఖాదర్ బర్కబా, తయాబ్ బస్లామా, మహ్మద్ పర్వేజ్, సయ్యద్ అన్వర్, ఖాజా అహ్మద్, మహ్మద్ ఇబ్రహీంలకు భారత శిక్షా స్మృతి(ఐపీసీ)లోని సెక్షన్ 452 (దౌర్జన్యం, చొరబాటు) కింద ఏడేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.5 వేల జరిమానా, సెక్షన్ 395(దోపిడీ) ప్రకారం జీవితఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.5 వేల జరిమానా, సెక్షన 506(కొట్టడం) కింద ఏడేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.5 వేల జరిమానా, సెక్షన్ 354బి(మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తించడం) ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.5 వేల జరిమానా, సెక్షన్ 323(దాడి) ప్రకారం ఒక ఏడాది జైలు శిక్ష విధించారు. ఎనిమిదో దోషి అలీ బారక్‌కు ఐపీసీ సెక్షన్ 411 ప్రకారం 20 నెలల జైలుశిక్ష విధించారు.

తీర్పు వెలువరించే సమయంలో న్యాయమూర్తి నిందితులను శిక్షపై వివరణ కోరగా వారు తమ కుటుంబ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయమూర్తిని వేడుకున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా వాటిని పరిగణనలోకి తీసుకోలేమని న్యాయమూర్తి వారికి తేల్చిచెప్పారు. 2014 జూలై 31న పహడీషరీఫ్ ఠాణా పరిధిలోని ఓ ఫాంహౌస్‌లో ఓ ప్రేమజంటపై స్నేక్‌గ్యాంగ్ అరాచకంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కీలక ఆధారాలైన సెల్‌ఫోన్లను రికవరీ చేయడంతో పాటు వాటిల్లో రికార్డైన వీడియోలను సాంకేతికంగా సంగ్రహించారు. ఈ ఆధారాలతో పాటు 38 డాక్యుమెంట్స్ సేకరించి మొత్తం 21 మందిని సాక్షులుగా పేర్కొం టూ అభియోగాలు మోపారు. అయితే ఒక నిందితునిపై నేరం రుజువు కాకపోవడంతో న్యాయస్థానం మంగళవారం నిర్దోషిగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

 ఆఖరి వరకు ‘నిలబడ్డారు’!
 ఆ ప్రేమజంట పెళ్లికి పెద్దలూ అంగీకరించారు.. నిశ్చితార్థం సైతం జరిగింది.. ఈలోపు స్నేక్‌గ్యాంగ్ వారిపై కాటేసింది.. ఈ ముఠా అరాచకాలు అప్పటికే కొనసాగుతున్నాయి.. ఎందరో బాధితులుగా మారినా కేసు పెట్టేందుకు ముందుకు రాలేదు.. తమ లా మరొకరు బలికాకూడదని భావించిన ఆ జంట ధైర్యంగా ముందకు వచ్చి పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుదారులు, ప్రధాన సాక్షిగా ఉన్న ప్రేమజంట కు భరోసా ఇచ్చి భవిష్యత్తులో స్నేక్ గ్యాంగ్, వారి సంబంధీకుల నుంచి ఇబ్బందులు రాకుండా చూస్తామంటూ కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో వారు న్యాయస్థానంలోనూ ధైర్యంగా సాక్ష్యమిచ్చారు. దీని ఫలితంగానే స్నేక్ గ్యాంగ్‌కు శిక్ష పడింది.
 
 ‘గ్యాంగ్ రేప్’ అప్పీల్‌పై న్యాయ సలహా తీసుకుంటాం
 ‘స్నేక్‌గ్యాంగ్‌పై న్యాయస్థానం ఇచ్చిన తీర్పు పోలీసు, న్యాయ వ్యవస్థల విజయం. రాజధానిలో భూకబ్జాలు, మహిళలపై నేరాలు చేస్తున్న వారికి ఇది భయం పుట్టించే తీర్పు. ఈ తీర్పు మహిళల భద్రతకు భరోసా ఇస్తుంది. బాధితుల మౌనం కారణంగా ఈ కేసులో గ్యాంగ్ రేప్ ఆరోపణలు రుజువు కాలేదు. దీనిపై అప్పీల్ చేయాలా? లేదా? అనే అంశంపై న్యాయ నిపుణుల సలహా మేరకు నిర్ణయం తీసుకుంటాం.’
 - సీవీ ఆనంద్, సైబరాబాద్ కమిషనర్

మరిన్ని వార్తలు