‘పాలమూరు’ పల్టీలు!

29 Aug, 2016 02:37 IST|Sakshi
‘పాలమూరు’ పల్టీలు!

- ఎత్తిపోతల పథకం భూసేకరణలో తీవ్ర జాప్యం
- 26,582 ఎకరాలకు సేకరించింది 12,350 ఎకరాలే
 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథక ం పనులకు భూసేకరణ సమస్య బ్రేక్ వేస్తోంది! పనులు ఆరంభించి నాలుగు నెలలు కావొస్తున్నా భూసేకరణ అంశం కొలిక్కి రాకపోవడంతో పనులు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. సేకరణ పూర్తయిన కొన్నిచోట్ల పనులు కొనసాగుతున్నా.. మిగతా చోట్ల కాంట్రాక్టు సంస్థలు తమ యంత్రాలను ఖాళీగా ఉంచుతున్నాయి. రెవెన్యూ అధికారుల నుంచి సరైన సహకారం లేదని, అందుకే పనులు నెమ్మదిస్తున్నాయని నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు.

 సగం కూడా కాని భూసేకరణ
 మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో 12.32 లక్షల ఎకరాలకు సాగునీరందించేందుకు పాలమూరు ప్రాజెక్టును చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టులో భాగంగా నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్ధండాపూర్, కేపీ లక్ష్మీదేవునిపల్లి రిజర్వాయర్లు నిర్మించాలని ప్రతిపాదించారు. కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ఐదు రిజర్వాయర్ల పరిధిలో పంప్‌హౌస్‌లు, కాల్వలు, టన్నెళ్ల నిర్మాణానికి 26,582.28 ఎకరాలు కావాల్సి ఉంటుందని గుర్తించారు. ఇందులో ప్రభుత్వ భూమి 4,075.33 ఎకరాలు కాగా, పట్టాభూమి 22,506.35 ఎకరాలు ఉంది. ఇందు లో ఇప్పటివరకు 13,081.13 ఎకరాల భూమిని ఇచ్చేందుకు 5,256 మంది రైతులు ముందుకు వచ్చారు.

మొత్తంగా రెవెన్యూ అధికారులు 12,350.12 ఎకరాలు సేకరిం చగా.. అందులో పట్టాభూమి 8,371.38 ఎకరాలు, ప్రభుత్వ భూమి 3,978.14 ఎకరాలు ఉంది. అంటే ఇప్పటివరకు మొత్తం సేకరిం చాల్సిన భూమిలో సగం కూడా పూర్తికాలేదు. నాలుగు నెలల కింద ప్రాజెక్టు పనులు ఆరంభం అయ్యేనాటికే 9,300 ఎకరాలకుపైగా భూమిని సేకరించారు. అయితే ఆ తర్వాత ఇప్పటివరకు సేకరించింది 3 వేల ఎకరాలు మాత్రమే కావడం గమనార్హం. భూసేకరణ సమస్య కారణంగా ప్రధాన ప్యాకేజీల పనులు నిలిచిపోయాయి. మరి కొన్ని చోట్ల నెమ్మదించాయి. ప్రస్తుతం వర్షాకాలం నేపథ్యంలో పనులు నెమ్మదించినా.. అక్టోబర్ నుంచి వేగవంతం చేయాలని ఏజెన్సీలను ప్రభుత్వం ఆదేశించింది.

>
మరిన్ని వార్తలు