దళితులకు భూపంపిణీలో పరిమితులు!

25 Jun, 2016 03:04 IST|Sakshi

వార్షికాదాయం రూ.1.5 లక్షలలోపు ఉన్నవారికే పథకం వర్తింపు
18-60 ఏళ్ల మధ్య ఉన్నవారే అర్హులు
మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని యోచిస్తున్న సర్కారు
సీఎం ఆమోదముద్ర పడగానే అమల్లోకి..

 
సాక్షి, హైదరాబాద్: దళితులకు భూపంపిణీ పథకం మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటివరకు ఈ పథకం కింద లబ్ధి పొందేవారికి ఎలాంటి ఆదాయ, వయోపరిమితి లేదు. కానీ ఇకపై వార్షికాదాయం రూ.1.5 లక్షలలోపు ఉన్నవారికే పథకాన్ని వర్తింపచేయాలని యోచిస్తోంది. అలాగే 18-60 ఏళ్ల మధ్య ఉన్న వారినే లబ్ధిదారులుగా గుర్తించాలన్న ఆలోచనలు చేస్తోంది. ఈ మేరకు అధికారులు మార్గదర్శకాల్లో మార్పులు చేస్తున్నారు.
 
సీఎం ఆమోదముద్ర పడగానే ఇవి అమల్లోకి రానున్నాయి. మరోవైపు లబ్ధిదారులకు పంపిణీ చేసిన భూమి డాక్యుమెంట్లు ఎస్సీ కార్పొరేషన్ అధీనంలో 15 ఏళ్లపాటు ఉండేలా నిబంధనల్లో మార్పులు చేస్తున్నారు. కెనాల్ ఏరియాలో,     సారవంతమైన భూమి, భూగర్భ జలాలు బాగా చోట ఉన్న భూముల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
 
జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రక్రియ
గతంలో జిల్లా, మండల స్థాయి కమిటీల ఆధ్వర్యంలో భూమి గుర్తింపు, కొనుగోలు ప్రక్రియ సాగేది. దాన్ని జిల్లా కమిటీకే పరిమితం చేశారు. జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కన్వీనర్‌గా, ఆర్డీవో/ఎమ్మార్వోలు సభ్యులుగా జిల్లా కమిటీని ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయయోగ్యమైన భూమి గుర్తింపు, లబ్ధిదారుల ఎంపిక, ఇతర ప్రక్రియల బాధ్యతను ఎమ్మార్వోలకు అప్పగించనున్నారు. భూమి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టి, ఏడాదిపాటు పంట వేసుకునేందుకు అన్ని వసతులను కల్పిస్తారు. ఈ మేరకు అధికారులు మార్గదర్శకాల్లో మార్పులు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు