హాయ్ డార్లింగ్ అంటూ...

24 May, 2016 08:03 IST|Sakshi
హాయ్ డార్లింగ్ అంటూ...

హాయ్ డార్లింగ్ అంటూ  సింహాలను పలకరిస్తున్నాడు
ముఖేష్‌ను కాపాడేందుకు అరగంట శ్రమించా
విలేకరులతో జూపార్క్ అనిమల్ కీపర్ పాపయ్య

బహదూర్‌పురా: ‘హాయ్ డార్లింగ్.. అంటూ ముఖేష్ సింహాలను పలకరిస్తూ వాటివద్దకు వెళుతున్నాడు..  సింహాల దృష్టిని మళ్లించేం దుకు సింహాలకు సైగలు చేస్తూ పక్కకు వెళ్లాలంటూ సూచించా.. అప్పుడు  వెనక్కి వెళ్లాయి’ అని వివరించాడు జూపార్క్‌లోని అనిమల్ కీపర్ పాపయ్య. మద్యం మత్తులో నెహ్రూ జూలాజికల్ పార్కులోని సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకిన ముఖేశ్‌ను ప్రాణాలతో రక్షిం చేందుకు అర గంట పాటు తీవ్రంగా శ్రమించామని  పాపయ్య విలేకరులకు వివరించాడు.

4.50గంటలకు  సింహాల ఎన్‌క్లోజర్‌లోకి ముఖేశ్ దిగాడు. అదే సమయంలో ఆఫ్రికా సింహాల ఎన్‌క్లోజర్ పక్కనే ఉన్న ఏషియాటిక్ సింహాలకు ఆహరం అందించి ఎన్‌క్లోజర్‌లోకి పంపించి బయటికి వస్తున్నా..  ఎన్‌క్లోజర్‌లోకి ఓ వ్యక్తి దిగాడంటూ సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు. ఆఫ్రికన్ సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దిగిన ముఖేశ్‌ను అక్కడికి వెళ్లవద్దంటూ వారించా.. అయినా వినకుండా నీటిలో ఈదుకుంటూ సింహాలు ఉన్న వైపు వెళ్లాడు. ఆ సమయంలో రెండు సింహాలు  అతనికి నాలుగైదు అడుగుల దగ్గర వరకు వచ్చాయి. సింహాలను హాయ్ డార్లింగ్ అంటూ ముఖేశ్ పలకరిస్తున్నాడు. సింహాల దృష్టిని ముఖేశ్ వైపు నుంచి మళ్లించేందుకు సింహాలకు రాధ, కృష్ణ అంటూ సైగలు చేస్తూ పక్కకు వెళ్లాలని సూచించా.. అవి 20 అడుగుల వెనక్కి వెళ్లాయి. అయినా ముఖేశ్ సింహాల నీటి మోడ్‌లో నుంచి బయటికి వచ్చేందుకు ఇష్టపడలేదు.

అతన్ని బయటికి రప్పించేందుకు ఓ దొడ్డు కర్రను లోనికి విసిరారు. వెనుకకు వెళ్లిన రెండు సింహాలు తిరిగి ముఖేశ్‌కు 3 అడుగుల దగ్గరికి వచ్చాయి. మళ్లీ గట్టిగా అరుస్తూ సింహాలను వెనక్కి వెళ్లాలంటూ సైగలు చేస్తూ కట్టెలతో దృష్టి మరలించి ఎన్‌క్లోజర్ వైపు వెళ్లే విధంగా చేశాను. తరువాత అవి ఎన్‌క్లోజర్‌లో ఉంచిన ఆహారాన్ని చూసి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాయి. దీంతో చిర్రెత్తిన ముఖేశ్ అవేమీ చేయవంటూ నేను విసిరిన కర్రను తిరిగి నాపైనే విసిరాడు. తరువాత పొడవాటి దొడ్డు కర్రను సింహాల మోడ్‌లో పెట్టి దాన్ని పట్టుకోవాలని ఐదు నిమిషాల పాటు అభ్యర్థించారు. ఎట్టకేలకు దానిని పట్టుకోవడంతో  నెమ్మదిగా  బయటికి లాగి ముఖేశ్‌ను ప్రాణాలతో బయటికి తీసుకొచ్చా అని వివరించాడు పాపయ్య.

 
పన్నెండేళ్లుగా సేవలు..

పాపయ్య 12 సంవత్సరాలుగా ఈ సింహాల ఎన్‌క్లోజర్ వద్ద సేవలను అందిస్తున్నాడు. ఆరు సంవత్సరాల క్రితం జూపార్కుకు ఆ జత ఆఫ్రికా సింహాలను సౌదీ అరేబియా మహారాజు బహుమతిగా అందజేశారు. జూకు వచ్చినప్పుడు ఈ సింహాల వయస్సు మూడున్నర సంవత్సరాలే. ప్రస్తుతం ఈ సింహాలు దాదాపు 10 సంవత్సరాల వయస్సు గలవి. ఇదిలా ఉండగా  పార్కులోని సింహాల ఎన్‌క్లోజర్‌లోకి దూకి న ముఖేశ్ అనిమల్ కీపర్ పాపయ్య చొరవతో బతికి బయట పడటం జూ చరిత్రలోనే మొదటిసారి.

2009లో జూపార్కులో ఓ పులికి బన్ను తినిపించేందుకు ఓ వ్యక్తి ఇనుప జాలీల్లో నుంచి చేయి లోపలికి పెట్టాడు. దీంతో పులి బన్ను నాకుతున్నట్లు నటించి ఒక్కసారిగా చేయి మో చేతిని కొరికి వేసింది. ఈ సంఘటనలో చేయి కోల్పోయిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొన్ని రోజుల్లోనే మృతి చెందాడు. నెహ్రూ జూలాజికల్ పార్కులో తగినంత సిబ్బంది లేకపోవడం, అనిమల్ కీపర్లకు జూ ఉన్నతాధికారులు సమన్వయ లోపం కారణంగా అనేక విషయాలు బయటికి రాకుండా ఉండిపోతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

 
ముఖేశ్‌కు రిమాండ్

బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులోని సింహాల ఎన్‌క్లోజర్‌లోని దూకి హల్‌చల్ సృష్టించిన రాజస్థాన్‌కు చెందిన ముఖేశ్‌పై ఐపీసీ 448, వైల్డ్ లైఫ్ యాక్ట్ 38 సెక్షన్ల కింద బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. ముఖేశ్‌పై సికింద్రాబాద్ రైల్వే జడ్జి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. న్యాయమూర్తి సైతం ముఖేశ్‌ను మందలించారని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు