ప్రాణాల మీదకు తెస్తున్న బరువు

7 Jun, 2015 03:28 IST|Sakshi
ప్రాణాల మీదకు తెస్తున్న బరువు

వెయిట్ తగ్గడం, కొవ్వులు కరిగించుకోవడం కోసం క్యూ
బేరియాట్రిక్, ప్లాస్టిక్ సర్జన్లను ఆశ్రయిస్తున్న వారు ఎక్కువే
సినిమా, రాజకీయ రంగాల వారే అధికం
శస్త్రచికిత్సల ఖరీదు ఏటా వెయ్యికోట్ల పైనే!
సాక్షి, హైదరాబాద్:
మొన్న ఆర్టీఏ అధికారి రాజేంద్ర... నేడు నటి ఆర్తి అగర్వాల్..

ఇద్దరూ బరువు తగ్గించుకోవడానికి డాక్టర్లను ఆశ్రయించి మృతి చెందిన వారే! ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలే కావచ్చు గానీ.. నయా ఫ్యాషన్ ట్రెండ్‌లో యువతీయువకులు తమ శరీర ఆకృతిని ఆకర్షణీయంగా మార్చుకునేందుకు పడేపాట్లు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్న 8 మంది హీరోలు లైపోసక్షన్ చేయించుకున్న వారే. గత నాలుగేళ్లలో రాజకీయ, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సుమారు 60 మంది బరువు తగ్గడానికి లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో నెలకు 150 బేరియాట్రిక్ సర్జరీలు జరుగుతుండగా, లైపోసక్షన్ సర్జరీలు 1,500 నుంచి 2 వేల వరకూ జరగుతున్నట్టు సమాచారం.

ఇలా అధిక బరువును తగ్గించుకునేందుకు జరుగుతున్న శస్త్రచికిత్సల వ్యాపారం తెలుగు రాష్ట్రాల్లో వెయ్యి కోట్ల వరకూ ఉంటుందని అంచనా. హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి పట్టణాల్లో బరువును తగ్గించుకునేందుకు బేరియాట్రిక్, లైపోసక్షన్ సర్జరీలను ఆశ్రయిస్తున్నారు. అసలు ఈ రెండిటి మధ్య తేడా కూడా తెలియకుండానే శస్త్ర చికిత్సలకు సిద్ధపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ రెండు సర్జరీల మధ్య తేడా ఓసారి చూద్దాం.
 
లైపోసక్షన్
ఇది పూర్తిగా కాస్మొటిక్ శస్త్రచికిత్స. శరీరంలో ఉన్న కొవ్వులను కరిగించి బయటకు తీయడం. మనిషి బరువును బట్టి కనిష్టంగా 5 లీటర్ల నుంచి గరిష్టంగా 14 లీటర్ల కొవ్వును బయటకు తీస్తారు. ప్రస్తుతం బరువు తగ్గడం కోసం, శరీరాకృతి మార్చుకోవడం కోసం వైద్యులను ఆశ్రయిస్తున్న వారిలో ఎక్కువ మంది లైపోసక్షన్ కోసం వస్తున్నవారే. వీరిలో 80 శాతం మంది 35 నుంచి 45 ఏళ్ల లోపు వారే కావడం విశేషం. ఇవిగాకుండా ముక్కు(రినోప్లాస్టీ), లాసిక్(కళ్లలో చిన్న పొరలాంటి అద్దాలు తగిలించుకోవడం), బ్రెస్ట్ ఇంప్లాంటేషన్స్ (వక్షోజాలు పెంచుకోవడం) చేయించుకునే వారూ ఎక్కువే.
 
బేరియాట్రిక్ సర్జరీ
స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాస్, డియోడినల్ స్విచ్ అనేవి వీటిలో రకాలు. ఇందులో ప్రధానంగా జీర్ణాశయాన్ని శస్త్రచికిత్స ద్వారా చిన్నదిగా చేసి, చిన్న పేగు మధ్య భాగాన్ని కత్తిరించి ఈ సంచికి కలిపేస్తారు. ఈ శస్త్రచికిత్స ద్వారా జీర్ణమయ్యే ఆహారం చిన్న పేగుల్లోని డియోడినల్‌లోకి కాకుండా నేరుగా పేగు మధ్యభాగంలోకి వెళుతుంది. అంటే మనం తినే ఆహారం పేగుల్లో ఇంకిపోవడం తగ్గిపోతుంది. దీనిద్వారా కొద్దిగా తినగానే కడుపు నిండుతుంది. ఇది పూర్తిగా హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపేలా చేస్తుంది. గుండె జబ్బులు, డయాబెటిక్ తదితర జబ్బులున్న వారు ఈ ప్రక్రియకు పూర్తిగా దూరంగా ఉండాలి.
 
సర్జరీల ముందూ.. వెనుకా..
♦  గుండె, కాలేయం, ఊపిరితిత్తులు వంటి అవయవాలతోపాటు ప్రధాన వైద్య పరీక్షలన్నీ చేసి, అంతా బాగుందన్న తర్వాతే బేరియాట్రిక్ లేదా లైపోసక్షన్ చేయాలి
♦  ఆపరేషన్ పూర్తయ్యాక 2 వారాల పాటు తరచూ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి
బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్న వారు ఆకలైనప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి
తినడానికి అరగంట ముందు, తిన్నాక అరగంట తర్వాత వరకూ నీళ్లు తీసుకోకూడదు
బేరియాట్రిక్ చేయించుకున్న వారు పూర్తిగా ఆహారాన్ని నమిలి మింగాలి
♦  బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 లేదా అంతకంటే ఎక్కువ  ఉన్నవారు, గుండెజబ్బులు లేదా మధుమేహం ఉన్నవారికి బేరియాట్రిక్ లేదా లైపోసక్షన్ చెయ్యడం మంచిది కాదు
లైపోసక్షన్ చేయించుకున్న వారు కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు తగ్గించాలి. క్రమశిక్షణతో కూడిన వ్యాయామం చెయ్యాలి.
 వీటి ద్వారా తగ్గొచ్చు..
 ఆహార నియమాలు విధిగా పాటించడం. తక్కువ ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకోవడం. రోజూ కనీసం 45 నిముషాల నడక లేదా ఈత. యోగా, ఏరోబిక్స్ చేయడం.
 - డా.ఫణిమహేశ్వరరెడ్డి, ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కళాశాల, విజయవాడ
 
దుష్పరిణామాలు ఎన్నో...

 లైపోసక్షన్
లైపోసక్షన్ వల్ల చాలావరకూ తాత్కాలికంగా స్వల్ప సమస్యలు మాత్రమే తలెత్తుతాయి.
అరుదుగా వివిధ కారణాల వల్ల తీవ్రమైన దుష్పరిణామాలు, చాలా అరుదుగా మరణం కలుగుతాయి.
ఒకేసారి వేర్వేరు చోట్ల కొవ్వును తొలగించినా, ఎక్కువ మొత్తంలో తొలగించినా ప్రమాదం.
లైపోసక్షన్‌తో పాటు ఇతర శస్త్రచికిత్సలు చేసినా ప్రమాదం ఎక్కువ.
రక్తం, ద్రవాలు ఎక్కువగా తొలగిపోతే షాక్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది.
చర్మం కింద ద్రవాలు లేదా రక్తం లీక్ కావడంతో పాటు ఇన్‌ఫెక్షన్ల ముప్పు పెరగొచ్చు.
పొరపాటుగా ప్లీహం, కాలేయం వంటి కీలక అవయవాలు ధ్వంసం అయ్యే ప్రమాదం ఉంటుంది.
ఇంజెక్ట్ చేసిన ద్రావణం విషపూరితంగా మారి కూడా ముప్పు కలగవచ్చు.
ఊపిరితిత్తుల్లో కొవ్వు లేదా రక్తం గడ్డలు ప్రాణాంతకం కావొచ్చు.

 బేరియాట్రిక్
ఈ శస్త్రచికిత్సలు చేసుకునే ప్రతి 20 మందిలో ఒకరు ఇన్‌ఫెక్షన్లకు గురవుతుంటారు.
పౌష్టికాహార లోపం, పేగుల్లో అడ్డంకులు ఏర్పడవచ్చు.
ప్రతి 100 మందిలో ఒకరికి కాళ్లలో లేదా ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డలు కట్టవచ్చు.
గుండె వద్ద మంట, వాంతులు, వికారం కలుగుతాయి.
♦ శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం జరగొచ్చు.
శస్త్రచికిత్స తర్వాత పది నెలలకు పిత్తాశయంలో రాళ్లు ఏర్పడవచ్చు.
అరుదుగా గుండెపోటు వచ్చి మరణమూ సంభవించవచ్చు.

మరిన్ని వార్తలు