చుక్కల్లో 'సుక్క'

4 Nov, 2015 02:48 IST|Sakshi
చుక్కల్లో 'సుక్క'

 భారీగా పెరగనున్న మద్యం ధరలు
10 నుంచి 20 శాతం పెంపునకు సర్కారు గ్రీన్‌సిగ్నల్
ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు.. వచ్చేవారం అమల్లోకి
మద్యం ప్రియుల జేబులకు ప్రతినెలా రూ.70 కోట్ల చిల్లు
సంవత్సరానికి 840 కోట్ల రూపాయల వడ్డన
పెంపుతో ప్రభుత్వానికి వచ్చేది రూ. 250 కోట్లే
వ్యాపారులు, డిస్టిలరీల యాజమాన్యాలు, రిటైలర్ల జేబులోకి రూ.590 కోట్లు
ధరలపై మద్యం వ్యాపారుల ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రభుత్వం

 
సాక్షి, హైదరాబాద్:
మద్యం ధరలు భారీగా పెంచేందుకు రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. వివిధ రకాల మద్యంపై కనీసం 10% నుంచి 20% వడ్డించేందుకు పచ్చజెండా ఊపింది. ఈ ధరల పెంపుతో ప్రతినెలా రూ.70 కోట్ల మేరకు మద్యం ప్రియుల జేబులకు చిల్లు పడనుంది. ఈ లెక్కన ఏడాదికి రూ.840 కోట్ల మేర ఆదాయం వస్తుందని ప్రభుత్వం లెక్కలేసుకుంది. అంటే.. మద్యంప్రియులపై అంత మేరకు ధరల వాత పెట్టడం ఖాయమైంది. ఇటీవలే తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్‌బీసీఎల్) పంపిన ధరల పెంపు ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఒకట్రెండు రోజుల్లోనే ధరల పెంపు ఉత్తర్వులు వెలువడనున్నాయి. వచ్చే వారం నుంచే పెరిగిన ధరలు అమల్లోకి వచ్చే అవకాశముంది.
 
 అంచనాలకు దూరంగా ఆదాయం
 ఆశించినంత ఆదాయం రాకపోవటం, అంచనాలు తలకిందులవటంతో తెలంగాణ సర్కారు ఏనెలకానెలా ఆర్థికంగా ఇబ్బంది పడుతోంది. దీంతో మద్యం ధరల పెంపునకు మొగ్గు చూపింది. ఈ ఏడాది మద్యం అమ్మకాల ద్వారా రూ.12 వేల కోట్ల ఆదాయం రాబట్టాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. బడ్జెట్‌లోనే ఈ విషయాన్ని ప్రస్తావించింది. ప్రస్తుతం మద్యం అమ్మకాల ద్వారా ప్రతినెలా దాదాపు రూ.900 కోట్ల ఆదాయం వస్తోంది. దీంతో వార్షిక ఆదాయం రూ.10 వేల కోట్లకు మించేటట్లు లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఆర్థిక సంవత్సరంలో ఏడు నెలలు గడిచిపోవటంతో.. అదనపు ఆదాయ మార్గాలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఇటీవల ప్రభుత్వ భూముల వేలానికి నోటిఫికేషన్, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో భూముల క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే క్రమంలో మద్యం ధరల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
 
 సర్కారుకు వచ్చేది వ్యాటే
 మద్యం ధరల పెంపుతో సర్కారు కంటే మద్యం వ్యాపారులు, డిస్టిలరీల యాజమాన్యాలకే లాభాల పంట పండనుంది. మద్యం ప్రియులపై వడ్డించనున్న రూ.840 కోట్ల భారంలో వ్యాట్ రూపంలో ఖజానాకు చేరేది దాదాపు రూ.250 కోట్లు మాత్రమే. మిగతా రూ.590 కోట్లు డిస్టిలరీల యాజమాన్యాలు, రిటైలర్లు, మద్యం వ్యాపారుల గల్లా పెట్టెల్లోకి చేరనుంది. ఉమ్మడి రాష్ట్రంలో మూడేళ్ల క్రితం మద్యం ధరలు పెరిగాయి. తెలంగాణ ఏర్పడ్డాక నాలుగు నెలల కిందట బీర్ల ధరలు పెరిగాయి. ఈ నేపథ్యంలో దేశీయ తయారీ మద్యం(ఐఎంఎల్), విదేశీ మద్యం ధరలను కూడా పెంచాలని కొంతకాలంగా డిస్టిలరీల యాజమాన్యాలు కోరుతున్నాయి.
 
 ఇతర రాష్ట్రాల్లో రెండేళ్లకోసారి మద్యం ధరలపై సమీక్ష జరుగుతుంది. కానీ ఇక్కడ మూడేళ్లుగా పెంచటం లేదంటూ డిస్టిలరీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. ఇటీవల కోట్లాది రూపాయల పెట్టుబడితో మద్యం దుకాణాలు పొందిన బడా వ్యాపారులు సైతం తమకున్న రాజకీయ పలుకుబడితో పావులు కదిపారు. అందుకే అటు డిస్టిలరీల యాజమాన్యాలు, మద్యం వ్యాపారులకు లబ్ధి చేకూరటంతోపాటు.. ఇటు ఖజానాకు కాస్తో కూస్తో ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా ఐఎంఎల్‌తో పాటు వైన్, విదేశీ మద్యం ధరలను పెంచే అవకాశముంది.
 
 వేటిపై పెంచుతారు?
 మద్యం ధరలను పెంచేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ గత నెలాఖరున ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కమిటీ సిఫారసుల మేరకే చీప్ లిక్కర్, మీడియం లిక్కర్, ప్రీమియం లిక్కర్, విదేశీ మద్యం ధరల పెంపు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం డిస్టిలరీలకు చీప్, మీడియం, ప్రీమియం లిక్కర్‌కు ఒక పెట్టెకు ఇస్తున్న మొత్తాన్ని 10 శాతం వరకు పెంచాలని యోచిస్తోంది. వైన్ వినియోగం రాష్ట్రంలో తక్కువగా ఉన్నందున వెరైటీ వైన్ బ్రాండ్‌లను రాష్ట్రానికి దిగుమతి చేయించి వాటి ధరలను కూడా 10 శాతం పెంచాలనే ఆలోచన చేసింది. విదేశీ మద్యం ధరలను 20 శాతం వరకు పెంచనున్నట్లు తెలిసింది. పెరిగిన ధరలతో ఒక్కో ఫుల్‌బాటిల్‌పై రూ.20 నుంచి రూ.50 వరకు పెరిగే అవకాశం ఉంటుందని టీఎస్‌బీసీఎల్ వర్గాలు తెలిపాయి.

>
మరిన్ని వార్తలు