హైదరాబాద్ లో 'ఫుల్' జోష్

22 Oct, 2015 09:28 IST|Sakshi
హైదరాబాద్ లో 'ఫుల్' జోష్

గ్రేటర్‌లో జోరుగా మద్యం విక్రయాలు
రోజుకు రూ.20 కోట్లకు పైగానే..
 

సాక్షి,సిటీబ్యూరో: హైదరాబాద్ లో మద్యం అమ్మకాలు కిక్కెక్కిస్తున్నాయి. దసరా పర్వదినం సందర్భంగా వరుస సెలవులు కలిసిరావడంతో మందుబాబులు ‘ఫుల్లు’గా పండగ చేసుకుంటున్నారు. నూతన విధానం ప్రకారం ఈనెల తొలివారంలోనే లెసైన్సులు దక్కించుకున్న మద్యం వ్యాపారులకు పండగ బాగా కలిసివచ్చింది. గ్రేటర్ పరిధిలోని 460 మద్యం దుకాణాలు, మరో 483 బార్లలో ఇటీవల మద్యం అమ్మకాల జోరు పెరిగిందని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. అక్టోబరు 1 నుంచి 21వ తేదీ వరకు అమ్మకాలు చుక్కలను తాకినట్లు చెబుతున్నారు. సాధారణంగా మహా నగర  పరిధిలో రోజుకు రూ.10 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు సాగుతుండగా.. దసరా సందర్భంగా మంగళ, బుధ, గురు, శుక్ర వారాల్లో అమ్మకాలు రూ.20 కోట్లకు పైగానే ఉంటాయని ఆబ్కారీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

 తగ్గని విక్రయాలు

 హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 602 మద్యం దుకాణాలకు గాను ఇటీవల టెండర్ల ప్రక్రియలో 70 దుకాణాలకు ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు. దీంతో అవి ఖాళీగామిగిలాయి. వీటిని దశల వారీగా రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్‌కు అప్పగించాలని నిర్ణయించారు. ఉభయ జిల్లాల పరిధిలో దుకాణాల సంఖ్య తగ్గినప్పటికీ లిక్కర్ అమ్మకాల్లో జోరు తగ్గకపోవడంగమనార్హం.

 పొంగుతున్న బీరు

 జీహెచ్‌ఎంసీ పరిధిలోని మద్యం దుకాణాల్లో ఐఎంఎల్ మద్యంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. బీర్ల అమ్మకాలు ‘చుక్క’లను తాకుతున్నాయి.  గ్రేటర్ పరిధిలో గత 20 రోజులుగా 7.01 లక్షల కేసుల బీర్లు అమ్ముడు పోయినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కగట్టింది. ఐఎంఎల్ మద్యం 5.53 లక్షల కేసులు అమ్ముడుపోయినట్లు అంచనా వేసింది. పండగ సీజన్ కావడంతో అక్టోబరు చివరి నాటికి అమ్మకాలు మరింత జోరందుకోనున్నట్లు అంచనా వేస్తోంది.

 స్టాకు ఫుల్లు..

 బీర్లతో పాటు ఐఎంఎల్ ప్రీమియం, మీడియం రకం మద్యం డిపోల్లో ఫుల్లుగానే ఉండడంతో వ్యాపారులు నూతన దుకాణాల్లో భారీగా నిల్వ చేశారు. నగరంలోని టీఎస్‌బీసీఎల్ (తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్) గోడౌన్లలోనూ అన్ని రకాల బ్రాండ్లకు చెందిన మద్యం స్టాకు ‘ఫుల్లు’గా అందుబాటులో ఉందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు