‘డ్రాట్’ బీరు వచ్చేస్తోంది..

15 Jul, 2016 02:42 IST|Sakshi
‘డ్రాట్’ బీరు వచ్చేస్తోంది..

సాక్షి, హైదరాబాద్: లోకల్ బ్రాండ్‌తో స్థానిక రెస్టారెంట్లలోనే తయారయ్యే ‘డ్రాట్’ బీరు అక్టోబర్‌కల్లా గ్రేటర్ హైదరాబాద్‌వాసులకు అందుబాటులోకి రానుంది. అర్హులైన మైక్రో బ్రూవరీల యజమానులు గురువారం నుంచి 90 రోజుల్లోపు బీరు తయారీ మిషనరీ ఏర్పాటు చేసుకొంటే ఆబ్కారీ శాఖ లెసైన్సులు మంజూరు చేయనుంది. ఈ మేరకు ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మైక్రో బ్రూవరీలు ఏర్పాటు చేసేందుకు గత సంవత్సరం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 50 దరఖాస్తులు రాగా.. ముగ్గురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ వాటిని పరిశీలించి వాటిలో 20 మాత్రమే బ్రూవరీలు ఏర్పాటు చేసుకునేందుకు అర్హత గలవని నిర్ధారించారు.

ఈ 20 బ్రూవరీలకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు తెప్పించుకున్న కమిషనర్ చంద్రవదన్ సదరు వ్యాపారులతో సమావేశమయ్యారు. వచ్చే 90 రోజుల్లో డ్రాట్‌బీర్ల తయారీకి సంబంధించిన మిషనరీ ఏర్పాటు చేసుకొని, ప్రభుత్వం విధించిన షరతుల ప్రకారం రెస్టారెంట్, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. లెసైన్సు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇదంతా 90 రోజుల్లో పూర్తి కావాలని స్పష్టం చేశారు.
 
రోజుకు వెయ్యి లీటర్ల లోపే..
హైదరాబాద్‌లో కొన్ని పబ్‌లు, రెస్టారెంట్లకే బడా కంపెనీల డ్రాట్ బీరు పరిమితమైంది. ధర ఎక్కువగా ఉండడం, బాటిళ్లలో నిల్వ చేసే పరిస్థితి లేకపోవడంతో డ్రాట్ బీరు కొన్నింటిలోనే లభిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరళీకృత విధానాన్ని అవలంబిస్తూ రెస్టారెంట్లు, హోటళ్లలోనే బీరు తయారు చేసుకొని విక్రయించే వీలు కల్పించింది. మైక్రో బ్రూవరీల ఏర్పాటుకు ఎంపికైన వారు 1000 చదరపు మీటర్ల విస్తీర్ణంలోని హోటళ్లు , రెస్టారెంట్లలో సొంత బ్రాండ్‌తో రోజుకు వెయ్యి లీటర్ల లోపు బీరును తయారు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ బీరును వేర్వేరు పరిమాణాల్లో పిచ్చర్ లేదా మగ్గుల్లో వినియోగదారులకు అందిస్తారు. ఈ బీరును ఇతర ప్రాంతాలకు తరలించడం, విక్రయించడం నేరం. ప్రభుత్వం 90 రోజుల లోపు మిషనరీని ఏర్పాటు చేసుకొని ఉత్పత్తికి సిద్ధంగా ఉంటే అనుమతిస్తామని ప్రకటించినప్పటికీ.. సెప్టెంబర్‌లోగానే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా ఆదేశించినట్లు సమాచారం. అక్టోబర్ 1 నుంచి కొత్త ఎక్సైజ్ సంవత్సరం మొదలు కానుండటంతో అప్పట్నుంచే చ ల్లచల్లని డ్రాట్ బీరును నగరవాసులకు అందించే ఆలోచనలో ఆబ్కారీ శాఖ ఉంది.
 
డ్రాట్ బీరు అంటే..?
బ్రూవరీల్లో తయారయ్యే బీరు మద్యం దుకాణాలు, బార్లకు సీసపు బాటిళ్లు, అల్యూమినియం క్యాన్లలో సరఫరా అవుతుంది. దేశంలోని బడా బ్రూవరీ కంపెనీల్లో తయారయ్యే ఈ బీరును మూడు నెలల వరకు నిల్వ ఉంచే అవకాశం ఉంది. సీసాల్లో ఉండే ఈ బీరుకు సూర్యకిరణాలు సోకితే రుచి, వాసనలో తేడా వస్తుంది. కానీ బీరును ఎలాంటి సీసాలు, క్యాన్లలో నింపకుండా బ్రూవరీల నుంచి కుళాయిలు, బ్యారెల్స్ (కెగ్స్) ద్వారా రెస్టారెంటులోకి నేరుగా తీసుకొచ్చి మగ్గులతో వినియోగదారులకు అందిస్తే.. అదే డ్రాట్ బీరు. దీన్ని ఒకట్రెండు రోజుల్లోనే తాగాల్సి ఉంటుంది. బ్రూవరీ నుంచి గంటల సమయంలోనే నేరుగా వినియోగదారులకు అందే ఈ బీరు రుచిగా, మంచి వాసనతో వినియోగదారులను ఆకట్టుకుంటుందని అధికారులు చెబుతున్నారు. బాటిల్ బీరుతో పోలిస్తే డ్రాట్‌బీరు ధర ఎక్కువే కావడం గమనార్హం.

మరిన్ని వార్తలు