'గెలుపు కోసం సామదానభేద దండోపాయాలు'

23 Jan, 2016 20:27 IST|Sakshi

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్‌ఎస్ సామదానభేద దండోపాయాలను ప్రయోగిస్తోందని సీపీఎం ధ్వజమెత్తింది. కులసంఘాలు, ఇతర సంస్థలకు తాయిలాలు ప్రకటించే దుస్థితితోపాటు, బెదిరించడం, లొంగదీసుకోవడం, డబ్బులు ఆశ చూపించడం వంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. అదేసమయంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, ఎంఐఎం ఆంతరంగిక సంక్షోభంలో, రెబెల్స్ గొడవతో ప్రచారం చేసుకోలేని స్థితిలో ఉన్నాయని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా, ప్రజాసమస్యల పరిష్కారానికి మెరుగైన స్వచ్ఛ హైదరాబాద్ కోసం సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ, లోక్‌సత్తా, ఎంబీసీ జేఏసీ, వివిధ సామాజిక సంఘాలు, కాలనీ సంఘాలతో కూడిన వన్ హైదరాబాద్ కూటమిని గెలిపించాలని కోరింది.

శనివారం ఎంబీ భవన్‌లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నరసింహారావు, పార్టీ నాయకులు ఎం.శ్రీనివాస్, కె.రవి జీహెచ్‌ఎంసీ ఎన్నికల బ్రోచర్‌ను విడుదల చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారం కోసం వన్ హైదరాబాద్ కూటమి ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 31 వరకు బస్సుజాతాలను నిర్వహిస్తున్నట్లు డీజీ నరసింహారావు విలేకరులకు తెలిపారు. ఈ ప్రచారంలో జయప్రకాష్‌ నారాయణ (లోక్‌సత్తా), బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం (సీపీఎం), కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి (సీపీఐ), మహ్మద్‌ గౌస్ (ఎంసీపీఐ) పాల్గొంటారని తెలిపారు. ఈ కూటమి పోటీ చేయనిచోట్ల భావసారూప్యత ఉన్న స్వతంత్ర అభ్యర్థులను గుర్తించి ఈ నెల 26న ప్రకటిస్తామన్నారు.
 

మరిన్ని వార్తలు