అద్దెబస్సుల బిల్లు. ఆర్టీసీ ఖజానాకు చిల్లు

22 Mar, 2016 03:24 IST|Sakshi
అద్దెబస్సుల బిల్లు.. ఆర్టీసీ ఖజానాకు చిల్లు

♦ రూట్ సర్వే చేయకుండానే కిలోమీటర్ల లెక్క తేల్చిన అధికారులు
♦ ఒక్కో ట్రిప్పులో 20 కిలోమీటర్ల ఎక్కువ నమోదు
♦ రూ.లక్షల్లో అదనపు చెల్లింపులు ఆలస్యంగా వెలుగుచూసిన వ్యవహారం
 
 సాక్షి, హైదరాబాద్: అద్దె బస్సుల అడ్డగోలు బిల్లులు ఆర్టీసీ ఖజానాకు చిల్లులు పెడుతున్నాయి. అక్రమాలు, అవకతవకలకు అడ్డూఅదుపూలేకుండా పోయింది. ఇంత దగా చేస్తున్నా నిఘా సంస్థ మొద్దునిద్ర వీడడంలేదు. డొక్కు బస్సులకు కూడా కొత్త బస్సు లెక్కల ప్రకారం బిల్లులు చెల్లిస్తూ ఇటీవల సిబ్బంది అడ్డంగా దొరికిపోయిన ఘటనలు వెలుగుచూశాయి. ఇప్పుడు ఏకంగా ఆ బస్సులు వాస్తవంగా తిరిగిన కిలోమీటర్లతో సంబంధం లేకుండా అడ్డదిడ్డంగా బిల్లులు చెల్లిస్తున్న తీరు వెలుగు చూసింది. నిఘా, ఆడిట్ విభాగాలు ఉన్నా దాన్ని పట్టుకోలేకపోతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లాలో ఈ బాగోతం వెలుగుచూసింది. కానీ, చాలా చోట్ల ఇదే తరహా అవకతవకలు జరుగుతున్నట్టు పలువురు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు.

 ఇదీ సంగతి...
 ఐదు నెలల క్రితం కొత్తగా ఆర్టీసీ 600 అద్దె బస్సులు తీసుకుంది. ఇవి నాలుగు నెలల నుంచి దశలవారీగా రోడ్డెక్కుతున్నాయి. తాజాగా ఈ బస్సులకు చెల్లిస్తున్న బిల్లులో లొసుగులు చోటుచేసుకున్నట్టు వెలుగులోకి వచ్చింది. కొత్తగా ఒక అద్దె బస్సు రాగానే... అది తిరిగే రూట్‌లో అధికారులు సర్వే చేయాల్సి ఉంటుంది. దానికి కేటాయించిన మార్గం ఎన్ని కిలోమీటర్ల మేర ఉందో అదే బస్సు లో ప్రయాణించి అధికారులు సర్వే చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తారు. దాని ఆధారంగా అది తిరిగిన ట్రిప్పుల సంఖ్యను తేల్చి నెల కాగానే బిల్లు సిద్ధం చేస్తారు. కానీ కొత్తగా వచ్చిన అద్దెబస్సుల్లో కొన్నిచోట్ల ఈ రూట్ సర్వే చేయలేదని తేలింది. గతంలో ఆ మార్గంలో నడిచిన అద్దెబస్సులు ఎన్ని కిలోమీటర్లు తిరిగాయో చూసి వాటి ఆధారంగా కొత్త బస్సులకూ బిల్లు లెక్కగట్టారు.

పాత అద్దె బస్సులు ఆయా మార్గాల్లో కొన్ని గ్రామాలను కూడా చుట్టొచ్చేవి. కానీ కొత్త బస్సులకు ఆ గ్రామాలను కేటాయించలేదు. అంటే కొత్త బస్సులు ఆ మార్గంలో తిరిగే దూరం తగ్గిపోయింది. కానీ పాత బస్సుల ప్రకారం ఎక్కువ దూరం తిరిగినట్టుగా అధికారులు లెక్కలు తేల్చి నెలనెలా బిల్లులు చెల్లిస్తున్నారు. వరంగల్ జిల్లాలో కొన్ని బస్సులకు అలా ప్రతి ట్రిప్పులో 20 కిలోమీటర్లకుపైగా అదనపు కిలోమీటర్లను జోడించారు. అంటే ఒక్కో ట్రిప్పులో దాదాపు రూ.500పైగా అదనంగా చెల్లించినట్టయింది. ఇది నెల తిరిగేసరికి లక్షల్లోకి చేరుకుంది. ఇలా గత నాలుగు నెలలుగా అదనపు బిల్లులు చెల్లిస్తున్న విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో అసలు ఎన్ని బస్సులకు అక్రమంగా చెల్లించారన్నదానిలో ఇంకా స్పష్టత రాలేదు. దీంతో ఉన్నతాధికారులు హడావుడిగా మిగతాచోట్ల పరిస్థితిని తేల్చే పనిలో పడ్డారు.

మరిన్ని వార్తలు