సీఎంకు ప్రేమతో...

9 Mar, 2016 14:04 IST|Sakshi
సీఎంకు ప్రేమతో...

సిటీబ్యూరో: ఓ వైపు వివిధ ప్రాంతాల కళాకారుల ప్రదర్శనలు.. మరోవైపు టీఆర్‌ఎస్ నాయకులు.. కార్యకర్తల కోలాహలం... దారి పొడవునా బారులు తీరిన జనం....ఇదీ మహారాష్ట్ర పర్యటన నుంచి వచ్చిన సీఎం కేసీఆర్‌కు స్వాగత సంరంభం. నదీజలాలపై ఒప్పందాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చిన సీఎంకు టీఆర్‌ఎస్ పార్టీ భారీగా స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓగ్గు కళాకారుల విన్యాసాలతో పాటు... కొంతమంది యువకులు గుర్రాలపై గులాబీ రంగుల టీ షర్ట్‌లతో ర్యాలీలో పాల్గొన్నారు. బంజారా మహిళా కళాకారులు కోలాటంతో మంత్రముగ్ధులను చేశారు. మానకొండూరు కళాకారుల ఉద్యమ పాటలు ఆకట్టుకున్నాయి. ఆదిలాబాద్ జిల్లా సారథి కళాకారులు తె ల్ల టీషర్ట్‌లతో ప్రత్యేకంగా కనిపించారు.

ఎయిర్‌పోర్ట్ లోపలి నుంచి సికింద్రాబాద్ మెయిన్ రోడ్డు వరకు కళాకారులు బృందాలుగా సందడి చేశారు. ఈ కార్యక్రమాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, సాంస్కతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ పర్యవేక్షించారు. సరిగ్గా సాయంత్రం 4.59 గంటలకు సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావుతో కలిసి బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై ఎక్కి కళాకారులకు, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ప్రజలకు అభివాదం చేశారు. సికింద్రాబాద్ మెయిన్ రోడ్డు వరకు వచ్చి అక్కడ మరో వాహనం ఎక్కి క్యాంపు కార్యాలయానికి వెళ్లిపోయారు. ఎయిర్‌పోర్ట్ నుంచి సికింద్రాబాద్ మెయిన్ రోడ్డు వరకు భారీ సంఖ్యలో ప్రజలు నిండిపోయారు. సీఎం కేసీఆర్ వెంట ఆయన మనుమడు హిమాన్షు ఉన్నారు.   
 
 

మరిన్ని వార్తలు