జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

4 Feb, 2017 03:26 IST|Sakshi
జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం
  • వచ్చే సంవత్సరం నుంచి అమలు
  • రూ.200 కోట్లతో డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీలకు సొంత భవనాలు
  • ఉన్నత స్థాయి సమావేశంలో కడియం
  • సాక్షి, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరంలో జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఏటా రూ. 84 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసింది. విద్యా శాఖకు అవసరమైన బడ్జెట్, ప్రణాళికలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, ఉన్నత విద్యాశాఖ కమిషనర్‌ వాణిప్రసాద్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ కిషన్, ఇంటర్‌ విద్య కార్యదర్శి అశోక్‌ సమావేశంలో పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా జూనియర్‌ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలుకు అవసరమైన నిధులను కేటాయించాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు రెగ్యులర్‌గా ఇచ్చే నిధులకంటే అదనంగా మరో రూ.1,500 కోట్లు కేటాయించాలని కడియం పేర్కొన్నారు. రాష్ట్రంలోని 404 జూనియర్‌ కాలేజీల్లో మౌలిక వసతులకు రూ.111 కోట్లు అవసరమన్నారు. బాలికలు చదువు కుంటున్న కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. ప్రస్తుతం కేజీబీవీ లకు ఉన్న భవనాలను హాస్టళ్లుగా వినియోగించేలా, కొత్తగా ఆరు తరగతి గదులతో అకడమిక్‌ బ్లాకులు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఇందుకు రూ. 300 కోట్లు కేటాయించాలని కోరారు. పాఠశాలల్లో మౌలిక వసతులకు రూ.100 కోట్లు, టాయిలెట్లు, నీటి వసతులకు రూ.100 కోట్లు చొప్పున అవసరమన్నారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు పాఠశాలలను పటిష్టం చేసేందుకు అదనంగా రూ.600 కోట్లు ఇవ్వాలని పేర్కొన్నారు. డిగ్రీ కాలే జీలు, పాలిటెక్నిక్‌ కాలేజీలకు సొంత భవనాల కోసం రూ. 200 కోట్లను బడ్జెట్‌లో కేటాయించాలన్నారు.

    వర్సిటీల్లో పోస్టుల భర్తీకి చర్యలు
    యూనివర్సిటీల్లో మౌలిక వసతులు కల్పిం చడంతోపాటు, ఖాళీ పోస్టుల భర్తీ, కొత్త పోస్టుల మంజూరుకు చర్యలు చేపడుతున్నామని కడియం తెలిపారు. ఇందుకోసం కనీసంగా రూ.500 కోట్లు కావాలన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ కేటాయించా లన్నారు. తెలంగాణ రెసిడెన్షియల్‌ స్కూళ్లలో 20 స్కూళ్లను కాలేజీలుగా అప్‌ గ్రేడ్‌ చేసేందుకు రూ.26 కోట్లు అవసరం అవుతాయన్నారు. 

మరిన్ని వార్తలు