రోహిత్ కులంపై రంధ్రాన్వేషణా?

9 Oct, 2016 05:27 IST|Sakshi
రోహిత్ కులంపై రంధ్రాన్వేషణా?

ఎవర్ని కాపాడటానికి జస్టిస్ రూపన్వాల్ కమిషన్ నివేదిక ఇచ్చింది
కేంద్ర మంత్రులకు క్లీన్‌చిట్ ఇచ్చిన నివేదిక ఏకపక్షం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం.అరుణ్‌కుమార్ ధ్వజం
ఆ కమిషన్ నివేదికను తిరస్కరిస్తున్నాం
హెచ్‌సీయూ ఆందోళనలకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు

 
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనలో ఎవర్ని కాపాడటానికి అతని కులంపై రంధ్రాన్వేషణ చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా. ఎం అరుణ్‌కుమార్ ధ్వజమెత్తారు. కులవివక్షకు రోహిత్ బలయ్యాడనే విషయాన్ని దాచడానికి కమిషన్ ప్రయత్నించడం దారుణమన్నారు. రోహిత్ దళితుడని రెవెన్యూ అధికారులు ధ్రువీకరించినా.. జస్టిస్ రూపన్వాల్ కమిషన్ మాత్రం కాదని చెప్పడం అన్యాయమన్నారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అరుణ్ విలేకరులతో మాట్లాడారు.
 
రోహిత్ ఎస్సీనా? కాదా? అని చెప్పే అధికారం రెవెన్యూ అధికారులకు మాత్రమే ఉంది తప్ప కమిషన్‌కు లేదన్నారు. రోహిత్‌కు గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు ఎస్సీగా సర్టిఫికెట్ ఇచ్చారని, కేంద్ర ఎస్సీ కమిషన్ కూడా రోహిత్ ఎస్సీ అని చెప్పిందని అరుణ్ గుర్తు చేశారు. ఇపుడు దానిని కమిషన్ కాదనటం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపించారు. హెచ్‌సీయూ వీసీ అప్పారావును రక్షించేందుకే ఈ కమిషన్ వేశారా అని నిలదీశారు. రోహిత్ విషయంలో లేఖలు రాసిన కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయలకు క్లీన్‌చిట్ ఇచ్చిన కమిషన్ నివేదిక ఏకపక్షంగా ఉందని విమర్శించారు. వ్యక్తిగత కారణాలతో రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని కమిషన్ చెప్పడం దారుణమన్నారు. రూపన్వాల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ద్వారా పెద్దలను కాపాడే ప్రయత్నం చేశారని అనుమానం వ్యక్తం చేశారు.
 
సంస్కరణలు శూన్యం..
రోహిత్ మరణం తర్వాతైనా మంచి సంస్కరణలు వస్తాయని అందరూ ఆశించారని, కానీ ఆ దిశగా చర్యలు శూన్యమని అరుణ్ ఆందోళన వ్యక్తం చేశారు. జస్టిస్ రూపన్వాల్ కమిషన్ ఇచ్చిన నివేదిక కూడా ఆత్మహత్యలు ప్రేరేపించేలా ఉండటం బాధాకరమన్నారు. ఈ నివేదిక ద్వారా సమాజానికి మంచి కన్నా, చెడే ఎక్కువ జరిగేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోహిత్ ఆత్మహత్య వెనుక కుల సంఘాలు, అధికార సంఘాలు, రాజకీయ శక్తుల ప్రమేయం ఉందని ఆరోపించారు. కమిషన్ ఇచ్చిన నివేదికను పూర్తిస్థాయిలో తిరస్కరించాలని హెచ్‌సీయూలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని అరుణ్ కుమార్ తెలిపారు.
 
కులవివక్ష కమిషన్‌కు పట్టదా?
రోహిత్ తన సూసైడ్ నోట్‌లో కులవివక్ష గురించి రాసిన విషయాలు కమిషన్‌కు పట్టవా? అని అరుణ్ ప్రశ్నించారు. చనిపోయే వారం రోజుల ముందు వైస్‌చాన్స్‌లర్‌కు రోహిత్ రాసిన లేఖలో కాలేజీలో చేరేముందు దళితులకు ఉరి తాడన్నా.. విషమన్నా ఇవ్వమని కోరాడని చెప్పారు. వీసీ అప్పారావు వెనుక ఉన్న రాజకీయ పక్షాలు, తమ వర్గాన్ని కాపాడటం కోసమే రూపన్వాల్ కమిషన్ రోహిత్ మరణాన్ని వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని ఆరోపించారు. దళిత విద్యార్థులకు ఏ మాత్రం న్యాయం చేయని, భరోసా కల్పించలేని ఈ నివేదికను పూర్తిగా తిరస్కరిస్తున్నామని చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు