వర్మ మాటలు పట్టించుకోవద్దు: శివాజీరాజా

22 Jul, 2017 13:46 IST|Sakshi
వర్మ మాటలు పట్టించుకోవద్దు: శివాజీరాజా

హైదరాబాద్: టాలీవుడ్‌ను కుదిపేస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసుపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలపై మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు శివాజీరాజా మండిపడ్డారు. ఇండస్ట్రీకి వర్మ చేసిందేం లేదని, వర్మ చేసిన వ్యాఖ్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. శివాజీరాజాను 'సాక్షి' ఫోన్లో సంప్రదించగా ఆయన మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ముందుకొచ్చి వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఈ కేసుకు ఒరిగేదేం లేదు. ఈ కేసులో నోటీసులు అందుకున్న సెలబ్రిటీలకు, విచారణ చేపట్టిన అధికారులకు మాత్రమే అన్ని విషయాలు తెలుసు. సిట్ విచారణ ద్వారా త్వరలోనే నిజనిజాలు వెల్లడవుతాయి. ఈ కేసుపై ఇండస్ట్రీ వారితో పాటు బయటివారు ఏం మాట్లాడినా అబద్దాలు నిజాలు కావు. నిర్దోషులుగా ఉన్న వ్యక్తులను దోషులుగా నిరూపించడం ఎవరికీ సాధ్యం కాదని' చెప్పారు.

ఇండస్ట్రీకి చెందిన మరికొందరికి నోటీసులు అందే అవకాశం ఉందా అన్న ప్రశ్నపై స్పందిస్తూ.. ఆ విషయం విచారణ కొనసాగిస్తున్న అకున్ సబర్వాల్ మాత్రమే చెప్పగలరని ఆయన బదులిచ్చారు. టాలీవుడ్ సెలబ్రిటీలను విచారిస్తున్నట్లుగానే డ్రగ్స్ కేసులో స్కూలు, కాలేజీ విద్యార్థులను విచారిస్తారా అని వర్మ ప్రశ్నించడంపై మా అధ్యక్షుడు శివాజీరాజా పై విధంగా స్పందించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌ను మీడియా అమరేంద్ర బాహుబలిలా చూపిస్తుందని, ఆయనతో రాజమౌళి బాహుబలి-3 తీస్తారేమోనంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సామాన్యుడి ప్రతీ పనిలో సినిమా వాళ్లు కావాలి, అలాగే విమర్శించడానికి వాళ్లు వేసే నిందలను బరించడానికి కూడా సినిమావాళ్లే కావాలంటూ ప్రముఖ రచయిత సిరాశ్రీ ఇటీవల పోస్ట్ చేసిన కవితను దర్శకుడు వర్మ మళ్లీ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు