భర్తపై గాయని మధుప్రియ కేసు

13 Mar, 2016 05:27 IST|Sakshi
భర్తపై గాయని మధుప్రియ కేసు

♦ తల్లిదండ్రుల మాట వినకపోతే జీవితం నాశనం
♦ భర్త నన్ను చిత్రహింసలకు గురిచేశాడు
♦ పెళ్లైన మూణ్నెళ్లకే ఆస్తి కోసం వేధించాడు
♦ 6 నెలల వివాహ జీవితం 60 ఏళ్ల మైండ్ సెట్‌నిచ్చింది
♦ నా తల్లిదండ్రులను క్షమాపణలు కోరుతున్నా
 
 సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల కిందట తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న గాయని మధుప్రియ.. తన భర్త వేధిస్తున్నాడంటూ శనివారం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు హుమాయూన్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లయిన తర్వాత మధుప్రియ హుమాయూన్‌నగర్‌లో భర్త శ్రీకాంత్‌తో కలిసి నివాసం ఉంటోంది. మూడు నెలలపాటు బాగానే చూసుకొన్న శ్రీకాంత్.. తనకు కట్నంగా ఆస్తి తీసుకురావాలంటూ వేధింపులకు గురి చేయడంతో మధుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు 498ఏ, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు.

 అమ్మానాన్న ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకోవాలి..
 పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మధుప్రియ మీడియాతో మాట్లాడింది. ‘‘అమ్మాయిలు అమ్మా నాన్న చెప్పినట్లు వినకపోతే జీవితం నాలాగే సంకనాకి పోతుంది. నచ్చిన వాడికి కొన్ని పరీక్షలు పెట్టాక.. అమ్మా నాన్నలు ఒప్పుకొన్నాకే వాళ్లు తోడుంటేనే పెళ్లి చేసుకోవాలి’’ అని చెప్పారు. ‘‘నేను చాలా ఇష్టపడి శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకొన్నా. ఆ అబ్బాయి నన్ను డబ్బు కోసం వాడుకుంటాడనుకోలేదు. అమ్మా నాన్నలను ఎదిరించి పెళ్లి చేసుకొన్నా.. ఇప్పుడు నేను క్షమాపణలు కోరాల్సింది అమ్మానాన్నలనే. పెళ్లయిన 3 నెలలు శ్రీకాంత్  నన్ను బాగా చూసుకొన్నాడు.

ఆ తర్వాత తల్లిదండ్రుల నుంచి ఆస్తి తీసుకురావాలని నిత్యం వేధిస్తూ చిత్ర హింసలకు గురిచేశాడు. ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. కొన్నింటిని చెప్పుకోలేక పోతున్నా. ఏ అమ్మాయి అయినా.. అమ్మానాన్నలు ఓకే  అన ్న తర్వాతే పెళ్లి చేసుకోవాలి. 6 నెలల పెళ్లి జీవితంతో 60 ఏళ్ల మైండ్ సెట్ ఇచ్చింది. 60 ఏళ్లు నేను స్ట్రాంగ్‌గా బతకగలను. ఈ సందర్భంగా అందరికీ క్షమాపణలు కోరుతున్నా. శ్రీకాంత్ లాంటి నీచపు వ్యక్తులున్నంత కాలం సమాజంలో ఆడపిల్లకు స్వేచ్ఛ లేదు. ఆడపిల్లలపై పాటలు పాడిన నేను నిజజీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించా. ఇలాంటి నా కొడుకును ఏం చేసినా తప్పులేదు. నేను ఫైట్ చేసి పెళ్లి చేసుకొన్నా. 

నా గురించి మాట్లాడే రైట్ శ్రీకాంత్‌కు లేదు. పెళ్లయిన 3 నెలల తర్వాత అమ్మానాన్నల దగ్గరకెళ్లి ఆస్తి తీసుకురా అని వేధించడం స్టార్ట్ చేసిండు. ఆస్తి ఇవ్వనంటే కమిషనర్ దగ్గరకు వెళ్లి కేసు పెడదాం అన్నాడు. వాడికి పైసా సంపాదన లేదు. 6 నెలలుగా నేనే పోషించా. మా తల్లిదండ్రులు ఎప్పుడూ నన్ను ఏం అనలేదు. ఇంతజరిగినా ఇప్పటికీ వారు సంతోషపడుతున్నారు. నేను చాలా దెబ్బలు తిన్నాను. నాకు జ్ఞాపకశక్తి కూడా తగ్గింది.  సమాజంలో ఆడపిల్లల గురించి... ఇకపై అసలు మధుప్రియగా వస్తాను. ఇలాంటి నా కొడుకులను నమ్మొద్దు. నమ్మి గోతిలో పడొద్దు. ప్రేమంటూ వెంట పడతారు... పెళ్లితో మోసం చేస్తారు. పనైపోగానే చేతులు దులుపుకొని పోతారు’’ అంటూ తన గోడు వెల్లబోసుకొంది. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో మధుప్రియ సృ్పహ తప్పి పడిపోయారు. పోలీసులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మధుప్రియ చేసిన ఆరోపణలను ఆమె భర్త శ్రీకాంత్ తోసిపుచ్చారు. తాను ఆమెను ఎప్పుడూ కొట్టలేదని.. తాను కొట్టానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ అన్నాడు.

భర్త శ్రీకాంత్‌తో మధుప్రియ(ఫైల్)  


 విలేకరులతో మాట్లాడుతూ స్పృహ తప్పిపడిపోయిన మధుప్రియ
 

మరిన్ని వార్తలు