‘కల్తీ’మే సవాల్

31 Jan, 2014 04:27 IST|Sakshi
‘కల్తీ’మే సవాల్
  • పెట్రోల్ బంక్‌ల ఇం‘ధన’ దందా
  •   మహారాష్ట్ర ఆయిల్ మాఫియా బాటలో నగరం
  •   ట్యాంకర్ల కొద్దీ చేరుతున్న కల్తీ సరుకు
  •   ఫిర్యాదులు పరీక్షలకే పరిమితం
  •   సాదాసీదా తనిఖీలతోనే సరి
  •   మూలన పడుతున్న వాహనాలు
  •  రమేష్ దారిలో ఓ బంకులో పెట్రోల్ కొట్టించుకుని బయల్దేరిన కాసేపటికే మధ్యలో బండి మొరాయించింది. నేరుగా మెకానిక్ వద్దకు వెళ్తే.. కల్తీ పెట్రోల్ కావడం వల్ల ఇంజన్ దెబ్బతిందని చెప్పాడు. వెంటనే రమేష్ తాను పోయించుకున్న పెట్రోల్ తాలూకు శాంపిల్‌ను తీసుకెళ్లి పౌరసరఫరాల అధికారులకు, బంక్ నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు. నెలైనా ఫలితం లేదు. ఇటు కల్తీ నిర్ధారణ జరగలేదు. అటు బంక్ నిర్వాహకుల నుంచి సమాధానం లేదు. బండి మాత్రం షెడ్‌కు చేరింది.
     
     వెంకట్ నిత్యం అదే బంక్‌కు వెళ్తాడు. ఓసారి ఎందుకో అనుమానం వచ్చింది. బైక్‌లో పోసిన పెట్రోల్ శాంపిల్ తీశాడు. బంక్‌లో నిత్యం భద్రపర్చి ఉంచాల్సిన పెట్రోల్ శాంపిల్ ఇవ్వాలని నిర్వాహకులను అడిగాడు. తాము దాన్ని తీసి ఉంచలేదనే బదులొచ్చింది. రెండు శాంపిల్స్‌ను పోల్చడం ద్వారా కల్తీ కనిపెట్టాలనేది వెంకట్ ఆలోచన. కానీ అందుకు వీల్లేకుండాపోయింది.
     
    సాక్షి, సిటీబ్యూరో: గడిచిన ఐదేళ్లలో నగరంలో ఉన్న దాదాపు 330 పెట్రోలు బంకుల నుంచి పౌరసరఫరాల శాఖ సేకరించిన శాంపిళ్లు నాలుగంటే నాలుగే. వీటిని రెడ్‌హిల్స్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా, ఒక్కదాంట్లోనూ కల్తీ జరిగినట్లు నివేదిక అందలేదు. ఈ ఒక్క కారణంతో అధికారులు పెట్రోల్ బంక్‌ల వైపు కన్నెత్తి చూడట్లేదు. తాజాగా పెట్రోల్ బంక్‌ల్లో గప్‌‘చిప్’గా సాగుతున్న పంపింగ్ మోసం బయటపడిన మాదిరిగానే కల్తీ ఇంధన వ్యవహారం గుట్టు ఎప్పుడు రట్టవుతుందో?.. అప్పటి వరకు వాహన చోదకులకు ఇబ్బందులు తప్పేలా లేవు. నగరంలో ఇంధన కల్తీ తీవ్రస్థాయిలో జరుగుతోంది. పెట్రోల్, డీజిల్ బండిని పరుగెత్తించడానికి బదులు మూన్నాళ్లకే మూలన పడేలా చేస్తున్నాయి. పాడైన వాహనాల్ని బాగు చేయించుకోవడానికి మళ్లీ వాహనచోదకులకే ‘చమురు’ వదులుతోంది.
     
    మహారాష్ట్ర మాఫియా జాడలో..
     
    మహారాష్ట్రలోని కల్తీ ఆయిల్ మాఫియా నగరంలోనూ వేళ్లూనుకుంటోంది. అక్కడ కల్తీ దందా వ్యవస్థీకృతంగా సాగిపోతోంది. నగరంలోని పెట్రోల్ బంకులు అదే బాటలో నడుస్తున్నాయి. కొన్నేళ్లుగా పెట్రోల్, డీజిల్‌తో పాటే ట్యాంకర్ల కొద్దీ టిన్నర్, నాఫ్తా ఆయిల్, కిరోసిన్ పెట్రోల్ బంకులకు యథేచ్ఛగా సరఫరా అవుతున్నట్టు సమాచారం. చాలా బంక్‌లు మానవ వనరుల నిర్వహణ ద్వారానే కొనసాగుతున్నాయి. ఇటువంటి నాన్ ఎలక్ట్రానిక్ పెట్రోల్ బంక్‌లే కల్తీ ప్రక్రియకు వేదికవుతున్నాయి. తరచూ వీటిని తనిఖీ చేయాల్సిన పౌరసరఫరా శాఖాధికారులు పట్టనట్టుగా ఉండిపోతుండటంతో బంక్ నిర్వాహకుల కల్తీ దందాకు అడ్డూఆపూ లేకుండాపోతోంది. అడపాదడపా వినియోగదారులు అనుమానించి నిలదీస్తున్నా, అధికారులకు  ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేకపోతోంది. ప్రధానంగా బంకులు రాజకీయ, పలుకుబడి గల యాజమాన్యాలు ఆధీనంలో ఉండటంతో తనిఖీలకు అధికారులు ధైర్యం చేయలేని పరిస్థితి నెలకొంది.
     
    కల్తీ దందాకు అవే అడ్డాలు
     
    నగరంలోని చాలా బంకులు ఇప్పటికీ నాన్ ఎలక్ట్రానిక్ బంకులుగానే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ బంకులు చాలా తక్కువ. నగరంలోని పూర్తిస్థాయి ఎలక్ట్రానిక్ బంకులుముంబైలోని ఆయిల్ కంపెనీల ప్రధాన యూనిట్లతో అనుసంధానమై ఉంటాయి. ఇంధన కల్తీ జరిగినా, రీడింగ్, ఇంధన సాంద్రతలో తేడా ఉన్నా వెంటనే అక్కడ తెలిసిపోతుంది. దీంతో ఈ తరహా బంకుల్లో కల్తీకి అవకాశం తక్కువ. సాధారణంగా నిత్యం 25 వేల లీటర్ల పెట్రోల్, 40 వేల లీటర్ల డీజిల్‌ను విక్రయించే బంకులు పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్ బంకుగా మారాలి. చాలాచోట్ల తగిన స్థాయిలో అమ్మకాలున్నా.. ఎలక్ట్రానిక్‌గా బంక్‌లుగా మారకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇటువంటి బంకుల్లోనే కల్తీకి అవకాశాలున్నాయి.
     
    కల్తీ దందాకు అవే అడ్డాలు
     
    నగరంలోని చాలా బంకులు ఇప్పటికీ నాన్ ఎలక్ట్రానిక్ బంకులుగానే ఉన్నాయి. ఎలక్ట్రానిక్ బంకులు చాలా తక్కువ. నగరంలోని పూర్తిస్థాయి ఎలక్ట్రానిక్ బంకులుముంబైలోని ఆయిల్ కంపెనీల ప్రధాన యూనిట్లతో అనుసంధానమై ఉంటాయి. ఇంధన కల్తీ జరిగినా, రీడింగ్, ఇంధన సాంద్రతలో తేడా ఉన్నా వెంటనే అక్కడ తెలిసిపోతుంది. దీంతో ఈ తరహా బంకుల్లో కల్తీకి అవకాశం తక్కువ. సాధారణంగా నిత్యం 25 వేల లీటర్ల పెట్రోల్, 40 వేల లీటర్ల డీజిల్‌ను విక్రయించే బంకులు పూర్తి స్థాయి ఎలక్ట్రానిక్ బంకుగా మారాలి. చాలాచోట్ల తగిన స్థాయిలో అమ్మకాలున్నా.. ఎలక్ట్రానిక్‌గా బంక్‌లుగా మారకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇటువంటి బంకుల్లోనే కల్తీకి అవకాశాలున్నాయి.
     
     మహా నగరంలో...
     పెట్రోల్/డీజిల్ బంకులు: 330కిపైగా
     మొత్తం వాహనాలు: 40 లక్షలు
     పెట్రోల్‌తో నడిచే వాహనాలు: 29 లక్షలు
     డీజిల్‌తో నడిచే వాహనాలు: 11 లక్షలు
     రోజూ సగటున ఇంధన వినియోగం: 30 లక్షల లీటర్ల పెట్రోల్,  33 లక్షల లీటర్ల డీజిల్ పెద్ద బంకుల్లో రోజుకు విక్రయాలు: 30 వేల లీటర్ల పెట్రోల్, 45 వేల లీటర్ల డీజీల్
     
     ఇంధన సాంద్రత ఇలా ఉండాలి
     వేసవిలో పెట్రోల్ సాంద్రత సుమారు 830- 835 డిగ్రీలుగా ఉండాలి
     ఇతర సీజన్లలో 820- 825 వరకు ఉండాలి
     పెట్రోల్ సాంద్రతను నిర్ధారించే హైడ్రోమీటర్లు, థర్మామీటర్, జార్‌తో కూడిన కిట్‌లను బంక్ యజమానులు అందుబాటులో ఉంచాలి.
     
     కల్తీతో బండి షెడ్‌కే..
     కల్తీ ఇంధనం కారణంగానే నగరంలో అత్యధిక వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయి
         
     కల్తీ ఇంధనం వాడిన వాహనాలు పొగను ఎక్కువగా వదులుతాయి
         
     బండి స్టార్ కావడంలో ఇబ్బందులతో పాటు, సౌండ్‌లోనూ స్పష్టమైన తేడా ఉంటుంది
         
     ప్రధానంగా ఇంజన్లు దెబ్బతింటాయి
         
     వాహనంలోని బోరు పిస్టన్ పనికిరాకుండా పోయి త్వరగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
         
     నాలుగు చక్రాల వాహనాల విషయంలో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి
     
     మొక్కుబడి తనిఖీలు
    ఇంధన కల్తీ దందాకు అడ్డుకట్ట వేసే దిశగా పౌరసరఫరాల శాఖ నడుం బిగించట్లేదు. మొక్కుబడి తనిఖీలు, శాంపిల్స్ సేకరణతోనే సరిపెట్టుకుంటోంది
         
     ఎప్పటికప్పుడు ఇంధన శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపి పరీక్షించాలి. అధికారుల వద్ద కూడా పరీక్షలు నిర్వహించే పరికరాలు అందుబాటులో ఉండాలి
         
     పరీక్ష పరికరాలు అందుబాటులో ఉన్నా ఉపయోగిస్తున్న దాఖలాల్లేవు
         
     పౌరసరఫరాల శాఖ గత ఐదేళ్లలో నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి కేవలం నాలుగు శాంపిల్స్ మాత్రమే సేకరించింది
     
     ఇలా అయితే అనుమానించాల్సిందే...
     ప్రధాన ఆయిల్ కంపెనీ నుంచి బంక్‌కు ఇంధనాన్ని
         
     సరఫరా చేసేటప్పుడే పెట్రోల్, డీజిల్  సాంద్రత ఎంత ఉండాలనే విషయాన్ని ధ్రువీకరిస్తారు
         
     పెట్రోల్ బంక్‌కు ఇంధనాన్ని తీసుకుని ట్యాంకర్ రాగానే ప్రత్యేకంగా శాంపిల్ తీసి ఇన్వాయిస్‌తో సహా వినియోగదారుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచాలి
         
     వినియోగదారుడు కల్తీ జరిగిందని అనుమానిస్తే బాట్లింగ్ పేపర్, ఇంధన సాంద్రత పరీక్షలు నిర్వహించి చూపాలి
         
     పరీక్షలో ఇన్వాయిస్‌లో పేర్కొన్న సాంద్రతకు, బండిలో నింపిన ఇంధనం సాంద్రతకు మధ్య తేడా కనిపిస్తే కల్తీ జరిగినట్లు అనుమానించాలి
         
     ఒకవేళ ట్యాంకర్ నుంచి శాంపిల్ తీసి భద్రపర్చలేదని నిర్వాహకులు చెబితే, ఆ బంక్‌లో కల్తీ జరుగుతున్నట్లు అనుమానించాల్సిందే.
     

మరిన్ని వార్తలు