వీఐపీల కోసం వారిని ఆపొద్దు..

13 Apr, 2018 01:29 IST|Sakshi

అంబులెన్స్‌లతో పాటు ఎమర్జెన్సీ వాహనాలకు దారివ్వండి

మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌పై స్పందించిన డీజీపీ మహేందర్‌రెడ్డి

అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖుల పర్యటనల నేపథ్యంలో వారి అధికారిక కాన్వాయ్‌ల కోసం అంబులెన్స్‌లతో పాటు అత్యవసర వైద్య సహాయం కోసం వెళుతున్న వారి వాహ నాలను ఆపవద్దని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం ఆదేశాలు జారీ చేశారు.

అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనరేట్ల కమిషనర్లు ఇవి కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శనివారం జవహర్‌నగర్‌ ఠాణా పరిధిలోని దమ్మాయిగూడలో జరిగిన ఉదంతం మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. దీనిపై స్పందించిన కేటీఆర్‌ అవసరమైన చర్యలు తీసుకోవాలంటూ ట్వీటర్‌ ద్వారా డీజీపీని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే మహేందర్‌రెడ్డి ఈ ఉత్తర్వులు జారీ చేశారు.  

అసలేమైందంటే..
బొల్లారం ప్రాంతానికి చెందిన వ్యాపారి జితేం ద్ర సురానా శనివారం తన ద్విచక్ర వాహనంపై వెళ్తుం డగా దమ్మాయిగూడ చౌరస్తాలో ఓ కారు ఢీ కొట్టింది. ఆయన కిందపడటంతో కుడి మోకాలు కింది భాగం విరిగింది. సురానా తన కుటుంబీకులకు ఫోన్‌ చేయగా వారు కారు తీసుకుని వచ్చారు. అంతా కలసి సురానను కారులో చేర్చినప్పటికీ ముందుకు వెళ్లడానికి అక్కడున్న పోలీసులు అనుమతించలేదు.

ఆ సమయంలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఇతర ప్రముఖుల కాన్వాయ్‌లు ఆ మార్గంలో వెళ్లాల్సి ఉంది. దీంతో అర్ధ గంట పాటు తీవ్ర నొప్పితో బాధపడుతున్న సురానా అక్కడే కారులో ఉండిపోవాల్సి వచ్చింది. ఆపై ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆయనకు శస్త్రచికిత్స చేసి విరిగిన కాలును సరిచేశారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో పాటు విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. విషయం కేటీఆర్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని ట్వీటర్‌లో ఆదేశించారు.

మరిన్ని వార్తలు