మీరే సారథులు..

22 Apr, 2015 02:48 IST|Sakshi
మీరే సారథులు..

సాక్షి,సిటీబ్యూరో: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.... ప్రయాణికుల ప్రాంగణమే కాదు. విభిన్న భాషలు, సంస్కృతులకు నిలయం. రకరకాల పనులపై నగరానికి నిత్యం లక్షలాది మంది వస్తుంటారు. ఒక్క సికింద్రాబాద్ స్టేషన్ మాత్రమే కాదు. నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌లలోనూ ఇలాంటి దృశ్యమే కనిపిస్తుంది. చారిత్రక హైదరాబాద్ మహానగరాన్ని సందర్శించేందుకు నిత్యం వేల సంఖ్యలో వస్తుంటారు. పర్యాటకులు రైలు దిగి, స్టేషన్ బయటకు రాగానే వారిని మొట్టమొదట పలుకరించేది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లే.

నగరంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలంటే ఆటో, ట్యాక్సీలను ఆశ్రయించవలసిందే. పర్యాటకులు నగరంలోకి ప్రవేశించగానే వారిని ఎలా పలుకరించాలి? మర్యాదగా ఎలా వ్యవహరించాలి? ఏ చారిత్రక , పర్యాటక ప్రదేశాలు నగరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి? అనే అంశాలపై ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు ఐఆర్‌సీటీసీ శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. రహదారి భద్రతా నియమాలపైన కూడా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
 
అతిథులను ఆహ్వానిద్దాం...
దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలను సందర్శించేందుకు వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆ ప్రాంతానికి వచ్చే విశిష్ట అతిథులుగా భావించి, ఆహ్వానించాలనే లక్ష్యంతో రైల్వేశాఖ ఈ  కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన గోవాలో ఈ శిక్షణ ను విజయవంతంగా నిర్వహించింది. ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ప్రయాణికులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి చేరేవేసే వ్యక్తులు మాత్రమే కాకుండా సాంస్కృతిక, చారిత్రక వారథులుగా వ్యవహరిస్తోంది.

ఇందులో భాగంగా పర్యాటకులను ఆకట్టుకునేందుకు వీరికి శిక్షణ ఇస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ టూరిజం విభాగ  డిప్యూటీ జనరల్  మేనేజర్ ఎన్.సంజీవయ్య ‘సాక్షి’తో చె ప్పారు. ఈ క్రమంలో ఇటీవల సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కొంతమంది ఆటో,ట్యాక్సీ డ్రైవర్లకు శిక్షణ ఇచ్చినట్లు  తెలిపారు. శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్‌లను అందిస్తున్నారు. దశలవారీగా ఈ కార్యక్రమాలను విస్తృతం చేయనున్నట్లు ఆయన చెప్పారు.

‘హైదరాబాద్ నగరానికి నిత్యం 50 వేల నుంచి  లక్ష మందికి పైగా టూరిస్టులు వస్తారు. వారంతా నగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా కారు లేదా ఆటోలు అవసరం. అలా వేలాది మంది డ్రైవర్లు ప్రత్యక్షంగా పర్యాటక రంగంతో ముడిపడి ఉన్నారు. వారు పర్యాటకులతో వ్యవహరించే పద్ధతిపైనే ఆ రంగం అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే రైల్వేశాఖ ఈ శిక్షణ కార్యక్రమాలను రూపొందించింది.’ అని సంజీవయ్య వివరించారు. ఈ వేసవి సెలవుల్లో పర్యాటకులను మరింత ఆకట్టుకునేందుకు  హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖ, వరంగల్, తదితర ప్రాంతాల్లో కూడా డ్రైవర్లకు శిక్షణనివ్వనున్నట్లు వెల్లడించారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు