పాతబస్తీలో మజ్లిస్ హవా

6 Feb, 2016 03:37 IST|Sakshi
పాతబస్తీలో మజ్లిస్ హవా

44 డివిజన్లలో విజయకేతనం  కొత్త నగరంలోనూ పాగా
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ తన పట్టు నిలుపుకుంది. రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. పాతబస్తీలో ఎప్పట్లా హవా కొనసాగించడంతో పాటు కొత్త నగరంలోనూ పాగా వేసింది. మొత్తం 60 డివిజన్లలో బరిలో దిగి 44 స్థానాలను కైవసం చేసుకుంది. పాతబస్తీలో తాను పోటీ చేసిన డివిజన్లను క్లీన్‌స్వీప్ చేసింది. ఈసారి కొత్తగా ఎర్రగడ్డ, షేక్‌పేట, భోలక్‌పూర్, మెహిదీపట్నం, కుర్మగూడ, ఆజంపురా డివిజన్లలోనూ జయకేతనం ఎగురవేసింది.

పునర్విభజనలో తన సిట్టింగ్ డివిజన్లయిన ఫతే దర్వాజా, నూర్‌ఖాన్ బజార్, హుసేనీ ఆలం, చింతల్‌బస్తీ గల్లంతైనా కూడా మొత్తంమీద గతంలో కంటే ఒక డివిజన్‌ను ఎక్కువగా గెలిచింది! బీసీ,ఎస్సీ, ఎస్సీ, మహిళా అభ్యర్థులను బరిలో దింపి సత్తా చాటింది. పాతబస్తీలో మాజీ సిట్టింగ్ కార్పొరేటర్ పార్టీ ఫిరాయించినా ఆ ప్రభావం పడకుండా జాగ్రత్త పడింది. పైగా గతం కంటే ఓటు బ్యాంకు పెంచుకోగలిగింది. పాతబస్తీలో చార్మినార్ అసెంబ్లీ స్థానం పరిధిలో ఐదు డివిజన్లకు నాలుగింటిని గెలుచుకుంది. బహదూర్‌పురా పరిధిలో ఆరు, కార్వాన్ పరిధిలో పోటీ చేసిన ఐదు డివిజన్లనూ క్లీన్‌స్వీప్ చేసింది (జియాగూడ, గుడిమల్కాపూర్ డివిజన్లలో పోటీ చేయలేదు). మలక్‌పేట్ పరిధిలోనూ మరోసారి పట్టు నిలుపుకుంది.

ఆరింటికి నాలుగు డివిజన్లలో ఘన విజయం సాధించింది. యాకత్‌పురా నియోజకవర్గంలో ఏడు డివిజన్లకు గాను ఐదింటిలో పోటీ చేసి విజయం సాధించింది. గోషామహల్‌లోనూ ఆరు డివిజన్లకు గాను రెండింట పోటీ చేసి విజయం సాధించింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రెండు డివిజన్లను కైవసం చేసుకున్న మజ్లిస్, భోలక్‌పూర్ డివిజన్‌లో నెగ్గడం ద్వారా ముషీరాబాద్ అసెంబ్లీ స్థానంలోనూ బోణీ కొట్టింది! 1986 ఎన్నికల్లో నగరంలో 38 డివిజన్లు గెలుచుకున్న పార్టీ, మెజారిటీ మార్కును చేరకపోయినా ఐదేళ్లూ నగరాన్ని పాలించింది. ఇక 2002లో 36, 2009లో 43 డివిజన్లు గెలుచుకుంది. మరోవైపు, ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లాఖాన్ ఈసారి అక్బర్‌బాగ్ డివిజన్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

మరిన్ని వార్తలు