మేకిన్ ఇండియాకు ఏరోనాటిక్స్ సొసైటీ ఊతం

13 Mar, 2016 00:27 IST|Sakshi
మేకిన్ ఇండియాకు ఏరోనాటిక్స్ సొసైటీ ఊతం

రక్షణమంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి
 
 సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేకిన్ ఇండియా’కు తమ వంతు సహకారం అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ విభాగం డెరైక్టర్, రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా లుమినరీ లెక్చర్ సిరీస్ కార్యక్రమంలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

దేశ వైమానిక రంగంలో అందుబాటులో లేని పరికరాలు, తయారీ సౌకర్యాలను ఇప్పటికే గుర్తించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏరోనాటికల్ సొసైటీల సహకారంతో ఈ లోటును భర్తీ చేసి తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై ఇప్పటికే అన్ని సొసైటీలకు లేఖలు రాశామన్నారు. వారి స్పందనల ఆధారంగా తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని వివరించారు. సెన్సర్లు మొదలుకొని అనేక ఇతర వైమానిక రంగ పరికరాల తయారీకి భారత్ కేంద్రం కావచ్చని ఆశిస్తున్నట్లు తెలిపారు. వైమానిక రంగంలో కీలక పాత్ర పోషించే ఏరోనాటిక్స్ అభివృద్ధికి, విస్తృతికి హైదరాబాద్ సొసైటీ కృషి చేస్తోందన్నారు.

 వచ్చే నెలలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ తుది ఉపగ్రహం: ఇస్రో చైర్మన్
 దేశీ జీపీఎస్ వ్యవస్థ సాకారమయ్యేందుకు మిగిలిన ఒకేఒక్క ఉపగ్రహాన్ని వచ్చేనెల చివరి వారంలో ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ తెలిపారు. మొత్తం ఏడు ఉపగ్రహాలతో ఏర్పడనున్న ఈ కొత్త వ్యవస్థ ఇతర వ్యవస్థల కంటే మెరుగైన లొకేషన్ ఆధారిత సేవలు అందిస్తుందన్నారు. ఇస్రో ఇప్పటికే అభివృద్ధి చేసిన గగన్, భువన్ (గూగుల్ ఎర్త్ వంటి మ్యాప్) వ్యవస్థలతో కలిపి చూసినప్పుడు దేశీ జీపీఎస్ భారత్‌తో పాటు ఇరుగుపొరుగు దేశాలకు ఎంతో ఉపయుక్త సేవలు అందిస్తుందని వివరించారు. నేషనల్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డెరైక్టర్ శ్యామ్ చెట్టి తదితరులు పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు