ఆ 16 మందిని అనర్హులను చేయండి

1 May, 2016 02:07 IST|Sakshi
ఆ 16 మందిని అనర్హులను చేయండి

♦ మరోసారి స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన వైఎస్సార్‌సీపీ
♦ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని అమలు చేయాలి
♦ చంద్రబాబుపై మండిపడిన బుగ్గన, విశ్వేశ్వరరెడ్డి
 
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా 2014 సాధారణ ఎన్నికల్లో ‘ఫ్యాన్’ గుర్తుపై గెలుపొంది, టీడీపీలో చేరిన పదహారు మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం డిమాండ్ చేసింది. పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఉరవకొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి శనివారం సాయంత్రం 4.30 గంటలకు ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావును అసెంబ్లీలో కలుసుకుని ఈ మేరకు 16 మందిపై వేర్వేరుగా ఫిర్యాదులు అంద జేశారు. ఈ ఫిర్యాదులపై ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి సంతకాలు చేశారు.

ఆయా ఎమ్మెల్యేలు రాజ్యాంగంలోని పదో షెడ్యూలులోని 2(1) పేరాలోని అంశాల మేరకు అనర్హతకు పాత్రులవుతారని వివరించారు. పార్టీ మారిన ఈ ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని కోరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి (నంద్యాల), భూమా అఖిలప్రియ (ఆళ్లగడ్డ), సి.ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), మహ్మద్ జలీల్‌ఖాన్ (విజయవాడ-వెస్ట్), తిరువీధి జయరామయ్య (బద్వేలు), పాలపర్తి డేవిడ్‌రాజు (ఎర్రగొండపాళెం), కలమట వెంకటరమణ (పాతపట్నం), మణి గాంధీ (కోడుమూరు), జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట), వరుపుల సుబ్బారావు (ప్రత్తిపాడు), పాశం సునీల్‌కుమార్ (గూడూరు), రావు సుజయ్‌కృష్ణ రంగారావు (బొబ్బిలి), అత్తారు చాంద్‌బాష (కదిరి), గొట్టిపాటి రవికుమార్ (అద్దంకి), కిడారు సర్వేశ్వరరావు (అరకు), బుడ్డా రాజశేఖరరెడ్డి (శ్రీశైలం)పై ఈ ఫిర్యాదులు అందజేశారు.

 చట్ట ఉల్లంఘనే చంద్రబాబు క్యారక్టరా?
 రాష్ట్ర ప్రభుత్వ పెద్దల అవినీతి, ప్రజా వ్యతిరేక పాలనపై బయటా, అసెంబ్లీలో ఎవరూ మాట్లాడకూడదనే దురుద్దేశంతోనే టీడీపీకి సంపూర్ణమెజార్టీ ఉన్నా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ పార్టీలో చేర్చుకుంటున్నారని బుగ్గన దుయ్యబట్టారు. స్పీకర్‌ను కలిసిన అనంతరం ఆయన విశ్వేశ్వరరెడ్డితో కలిసి వారు అసెంబ్లీ అవరణలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో తన అంత రాజకీయ అనుభవశాలి లేరని, తనంత క్యారెక్టర్ ఉన్న వ్యక్తి లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటారని... చట్ట ఉల్లంఘనలకు పాల్పడడమే ఆయన క్యారెక్టరా? అని ప్రశ్నించారు.

బిహార్ రాష్ట్రంలో మహచంద్రప్రసాద్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి పదవిలో కొనసాగుతున్న సమయంలోనే వేరొక ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కారణానికి అనర్హతకు గురయ్యారని గుర్తు చేశారు. కర్ణాటకలోనూ ఒక ఎమ్మెల్యే ఇండిపెండెంట్‌గా ఎన్నికయ్యాక వేరే పార్టీ తరఫున ప్రచారం చేశారని అనర్హతకు గురైన సంఘటనలు ఉన్నాయని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయాక తన పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, తిరిగి ఎన్నికల పోయిన చరిత్ర జగన్‌మోహన్‌రెడ్డిదని.. ఇప్పుడు టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలు ఎదుర్కొవడానికి చంద్రబాబు భయపడుతున్నారన్నారన్నారు.

 బాబుకు ధైర్యం లేదు : విశ్వేశ్వరరెడ్డి
 సీఎం స్థానంలో ఉన్న చంద్రబాబే స్వయంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పి టీడీపీలో చేర్చుకోవడం పూర్తి అనైతికమని విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లే ధైర్యం ఆయనకు లేదన్నారు.

మరిన్ని వార్తలు