‘మల్లన్న సాగర్’కు రూ. 9,200 కోట్లు

26 Sep, 2016 03:49 IST|Sakshi
‘మల్లన్న సాగర్’కు రూ. 9,200 కోట్లు

భారీగా పెరిగిన రిజర్వాయర్ వ్యయ అంచనా
* గత ఒప్పంద విలువ రూ. 1,954 కోట్లే
* నీటి నిల్వ సామర్థ్యం పెంపు వల్లే పెరిగిన అంచనా వ్యయం
* బస్వాపూర్, పాములపర్తి, గంధమల రిజర్వాయర్ల వ్యయ అంచనాలూ రెడీ
* త్వరలోనే టెండర్లు పిలవనున్న ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా మెదక్ జిల్లాలో చేపట్టనున్న కొమరవెల్లి మల్లన్న సాగర్ (తడ్కపల్లి) రిజర్వాయర్ అంచనా వ్యయం సిద్ధమైంది. ఈ నిర్మాణానికి రూ. 9,200 కోట్లు ఖర్చవుతుందని నీటిపారుదల శాఖ తేల్చింది.

అలాగే రూ. 600 కోట్లతో పాములపర్తి, రూ. 1,700 కోట్లతో బస్వాపూర్, రూ. 900 కోట్లతో గంధమల, రూ. 600 కోట్లతో ఇమామాబాద్ రిజర్వాయర్ల వ్యయ అంచనాలనూ సిద్ధం చేసింది. ఈ అంచనాలపై హైపవర్ కమిటీ చర్చించాక ప్రభుత్వం వాటికి ఆమోదం తెలుపనుంది. అనంతరం టెండర్లు పిలవనుంది.
 
సామర్థ్యానికి తగ్గట్లే మల్లన్న సాగర్ వ్యయ పెరుగుదల...
160 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ప్రాణహిత నదిపై పెద్దగా రిజర్వాయర్‌లు లేని దృష్ట్యా సిద్దిపేటలోని మల్లన్న సాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.5 టీఎంసీల నుంచి 50 టీఎంసీలకు, గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని కొండపోచమ్మ రిజర్వాయర్ (పాములపర్తి) సామర్థ్యాన్ని ఒక టీఎంసీ నుంచి 21 టీఎంసీలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇమామాబాద్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని ఒక టీఎంసీ నుంచి 3 టీఎంసీలకు పెంచగా నల్లగొండ జిల్లాలో కొత్తగా గంధమల రిజర్వాయర్‌ను 10 టీఎంసీలతో, బస్వాపూర్ రిజర్వాయర్‌ను 11.39 టీఎంసీలతో చేపట్టాలని నిర్ణయించింది.

మల్లన్న సాగర్ పాత వ్యయం అంచనా రూ. 1,864 కోట్లు ఉండగా దాన్ని 4.86 శాతం అధికంగా కోట్ చేయడంతో అంచనా వ్యయం రూ. 1,954.59 కోట్లకు చేరింది. ప్రస్తుతం రిజర్వాయర్‌ను 50 టీఎంసీలకు పెంచి నిర్మాణం చేపట్టనుండటంతో అంచనా వ్యయం ఏకంగా రూ. 9,200 కోట్లకు పెరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్నసాగర్ రిజర్వాయర్ ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ రిజర్వాయర్ కిందే మెదక్ జిల్లాలో 5 లక్షల ఎకరాల ఆయకట్టును నిర్ణయించారు. దీంతోపాటే ఇక్కడి నుంచి ఒకవైపున నల్లగొండ జిల్లాలోని గంధమల, బస్వాపూర్‌లకు లింకేజీ ఉంది.

మరోవైపున కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో నిర్మించనున్న ఏడు రిజర్వాయర్‌లకు మల్లన్న సాగర్ నుంచే నీటి తరలింపు ప్రణాళిక రూపొందించారు. మరోపక్క సింగూరు ప్రాజెక్టుకు నీరు, నిజాంసాగర్ ఆయకట్టు స్థిరీకరణకు మల్లన్న సాగర్ నుంచి నీటి సరఫరా చే యాలని నిర్ణయించారు. మొత్తంగా 13 లక్షల ఆయకట్టుకు నీరందించేందుకు మల్లన్న సాగర్ కీలకంగా మారనుంది. దీని కింద 14,367 ఎకరాల ముంపు ఉంటుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు