సారూ.. మా పొట్ట కొట్టొద్దు!

21 Jun, 2016 02:46 IST|Sakshi
సారూ.. మా పొట్ట కొట్టొద్దు!

మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజల గోడు
 
 సాక్షి, హైదరాబాద్: ‘‘సారూ.. మల్లన్న పేరుబెట్టి మా పొట్టలు కొట్టొద్దు. మా బోర్లల్ల నీళ్లున్నయ్.. మా చెర్లల్ల నీళ్లున్నయ్.. ఈ ప్రాజెక్టు మాకొద్దు.. అడవిలల్ల గట్టుకోండ్రి.. మమ్ముల మా ఊర్లె బతకనియ్యుండ్రి.. రెండుపొద్దుల తింటున్నాం.. ఊరిడిసిపోతే మా ముసలోళ్లు సచ్చిపోతరు.. మేం కొంగుజాపి అడుక్కతినాలె..’’ అంటూ మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. మల్లన్నసాగర్ ముంపు గ్రామాల జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాధితులు మాట్లాడారు. తమ బతుకులు ఆగం చేయొద్దంటూ కన్నీరుమున్నీర య్యారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇకనైనా మౌనం వీడి, తమను ఆదుకోవాలని కోరారు. సమావేశంలో జేఏసీ నాయకుడు, ఏటిగడ్డ కిష్టాపురం గ్రామస్తుడు ప్రశాంత్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధిక నష్టపరిహారం ఇస్తున్నామంటూ మంత్రులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. 2013 భూసేకరణ చట్టాన్ని తుంగలోకి తొక్కి జీవో నంబరు 123తో ముంపు గ్రామాల ప్రజలను భయపెడుతున్నారని విమర్శించారు. ‘‘ప్రభుత్వం మెట్టు దిగకపోతే.. మా శవాలపై ప్రాజెక్టు కట్టాల్సి వస్తుంది. ఇప్పటివరకు 10 కుటుంబాలకు చెందిన భూముల రిజిస్ట్రేషన్ మాత్రమే జరిగింది. అది కూడా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కోసం భూములు తీసుకున్నట్టు కాకుండా.. ఆర్‌డీవో పేరున రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రికార్డులు సరిగా లేని వారి భూములు బలవంతంగా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు’’ అని అన్నారు.

 ఎకరాకు రూ.60 వేలా?
 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రజలు ఆమోదం తెలిపితేనే భూసేకరణ జరపాలని, దానిక్కూడా 75 శాతం పరిహారం ఇచ్చి, ఆయకట్టు కింద కనీసం ఎకరం భూమిని ఇవ్వాల్సి ఉంటుందని జేఏసీ కన్వీనర్ భాస్కర్ అన్నారు. రైతులు తమ వ్యక్తిగత కారణాలతో భూములమ్ముకుంటున్నట్టు రాయించుకుంటున్నారన్నారు. తెల్లకాగితాలపై సంతకాలు పెట్టించి, భూములు లాక్కుంటున్నారని చెప్పారు. మార్కెట్ విలువ రూ.5 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఉంటే మంత్రి మాత్రం ఎకరానికి 60 వేలు మాత్రమే ఉందంటూ అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు.

ఈ సందర్భంగా వివిధ ముంపు గ్రామాల్లోని ప్రజలు గతంలో రూ.5 లక్షలు, రూ.6 లక్షలకు రిజిస్ట్రేషన్ చేసుకున్న పత్రాలను చూపించారు. మరో ముంపు గ్రామం వేముల గట్టుకు చె ందిన శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. తమ ఊళ్లో ఏనాడూ కరువు రాలేదని, ఈ ఏడాది గ్రామస్తులు 500 ఎకరాల వరి పంటను కోసారని వివరించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ ఊరికి వచ్చి ప్రజలతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. మరో ముంపు గ్రామమైన పల్లెపాడుకు చెందిన పరిపూర్ణాచారి మాట్లాడుతూ.. మల్లన్నసాగర్ విధ్వంసంతో తామంతా అడ్డాకూలీలుగా మారాల్సి వస్తుందన్నారు. పుట్టి పెరిగిన తమ ఊళ్లోకి వచ్చి పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారంటూ అశోక్ అనే బాధితుడు విలపించారు.

 భూమికి భూమి ఇవ్వండి
 తెలంగాణని సస్యశ్యామలం చేయాలనుకోవడంలో తప్పులేదని, ప్రాజెక్టులకు ఎవ్వరం వ్యతిరేకం కాదని కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. అయితే 2013 చట్టం ప్రకారం భూమికి భూమి యివ్వాలని, ఆయకట్టు కింద కనీసం ఒక ఎకరం భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు మూడెకరాల భూమి కోసం సేకరించిన భూమికి కట్టిన విలువనే ఈ భూములకూ ఇవ్వాలన్నారు. 50 టీఎంసీలతో అక్కడ ప్రాజెక్టు అవసరం లేదని నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తోందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సమైక్యాంధ్ర శక్తుల మాదిరే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని దళిత బహుజన ఫ్రంట్ నాయకుడు శంకర్ మండిపడ్డారు. సీపీఎం నాయకుడు సాగర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రచయిత్రి విమల, సామాజిక కార్యకర్త సీతాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
 
 హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు
 తమ భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిలివేసేలా చర్యలు తీసుకోవాలని సోమవారం మల్లన్న సాగర్ రిజర్వాయర్ బాధితులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను కోరారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకుంటున్నారని ఆరోపించారు. తమ భూములు, ఊళ్లు, ఇళ్లను కాపాడాలని ఫిర్యాదు చేసినట్లు వారు వివరించారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా