సీఎం పీఎస్‌నంటూ ఘరానా మోసం.. అరెస్ట్

24 Sep, 2016 22:23 IST|Sakshi
హైదరాబాద్: సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీనంటూ ఘరానా మోసానికి పాల్పడిన ఓ వ్యక్తిని సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సీనియర్ జర్నలిస్ట్‌ను, హోంశాఖ కార్యదర్శినంటూ అనేక మందిని బెదిరించిన కేసుల్లో పలుమార్లు జైలుకు వెళ్లాడు. అయినా తీరు మారని సదరు వ్యక్తి మరోసారి కటకటాల పాలైయ్యాడు. 
 
సీసీఎస్ డీసీపీ అవినాశ్ మహంతి కథనం ప్రకారం...రంగారెడ్డి జిల్లా కంట్లూరు గ్రామానికి చెందిన రాయబండి సూర్య ప్రకాశచారి... ఖమ్మంలో జర్నలిస్టు కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నానని ఓ రిటైర్డ్ సీటీవోకు సీఎంకు ప్రిన్సిపల్ సెక్రటరీ అంటూ ఫోన్‌కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేశాడు. ఇంటర్ వరకు చదివిన ఇతను 2002 నుంచి కొన్నేళ్ల పాటు వివిధ పత్రికలు, మ్యాగజైన్‌లలో రిపోర్టర్‌గా పనిచేశాడు. పనిచేసిన ప్రతిచోట మద్యం తాగి ఆఫీసుకు రావడంతో పాటు ప్రవర్తన బాగా లేకపోవడంతో అన్ని యజమాన్యాలు అతడిని రిపోర్టర్ ఉద్యోగం నుంచి తొలగించాయి. అయితే రిపోర్టర్‌గా ఉన్న జ్ఞానంతో కొంత మంది వ్యాపారవేత్తలు, ఆస్పత్రులు, స్కూళ్లు, ప్రభుత్వ అధికారులను ఎంపిక చేసుకొని మీడియావాళ్లు కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నారని అందుకు కొంత డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. 
 
సులభ పద్ధతిని డబ్బు సంపాదించాలనే ఆశతో సీనియర్ జర్నలిస్ట్‌ను అని, మాజీ సీఎం పీఏను అని, హోంశాఖ కార్యదర్శిని అని, తెలంగాణ సీఎం పీఎస్ అని చెప్పుకుంటూ డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడు. గతంలో పలు కేసుల్లో కుషాయిగూడ, చైతన్యపురి, కీసర, మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. మాజీ సీఎం పీఏను అని చెప్పి కొరుట్ల మున్సిపల్ కమిషనర్ నుంచి డబ్బు బెదిరింపు వసూళ్లకు పాల్పడిన కేసులో గతేడాది నగర సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే సీఎంకు ప్రిన్సిపల్ సెక్రటరీ అని చెప్పి ఖమ్మంలో జర్నలిస్టు కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నామని, అందుకు కొంత డబ్బులు కావాలని రిటైర్డ్ సీటీవో కె.బాలసముద్రంను డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన ఆయన సీసీఎస్ పోలీసులకు ఇటీవల ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు సూర్య ప్రకాశ్చారిని శనివారం అరెస్టు చేశారు. 
మరిన్ని వార్తలు