బంజారాహిల్స్‌లో మహిళ దారుణ హత్య

16 Oct, 2015 04:08 IST|Sakshi
బంజారాహిల్స్‌లో మహిళ దారుణ హత్య

 కత్తితో దాడి చేసి ముక్కలుగా కోసి సూట్‌కేసులో కుక్కేసిన వైనం
 యువతి అదృశ్యంపై విజయువాడలో కేసు
 నిందితుడి అరెస్టుతో వెలుగులోకి..

 హైదరాబాద్: పట్టపగలు శవాన్ని ముక్కలు ముక్కలుగా కోశాడు.. మూటల్లో కుక్కాడు.. దర్జాగా బైక్‌పైనే మూటలు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతాల్లో పాడేశాడు. ఇంత జరిగినా చుట్టుపక్కల వారికి గాని, స్థానిక పోలీసులకు గాని విషయం తెలియలేదు. అంతేకాదు మర్డర్ చేసిన నిందితుడు పలానా చోట మహిళను ముక్కలుగా నరికానని చెప్పేవరకూ స్థానిక పోలీసుల దృష్టికీ ఈ విషయం రాలేదు. సంచలనం సృ ష్టించిన ఈ ఘటన బంజారాహిల్స్‌లో చోటు చేసుకుంది. విజయవాడకు చెందిన దుర్గావిజ య్‌బాబు(40) బంజారాహిల్స్ రోడ్ నం.2 లోని ఇందిరానగర్‌లో నివాసముంటూ నందినగర్ సమీపంలోని ఓ బిల్డర్ వద్ద డ్రైవర్‌గా పని చేస్తుండేవాడు.

తూర్పుగోదావరి జిల్లా రాజ మండ్రి లలితానగర్‌కు చెందిన వేల్పూరి రమణకుమారి(35)తో రెండేళ్ల నుంచి పరిచయం పెంచుకొని సహజీవనం చేస్తున్నాడు. అప్పటికే ఆయనకు భార్య పద్మావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఎన్నిసార్లు అడిగినా అంగీకరించకపోవడంతో.. విజ య్‌బాబు తనను వేధిస్తున్నాడంటూ రమణకుమారి రాజమండ్రి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. పోలీసులు విచారణ నిమిత్తం విజయ్‌బాబును పిలవగా తాను రమణకుమారిని పెళ్లి చేసుకుంటానని చెప్పి విడుదలయ్యాడు. ఈ ఏడాది ఆగస్టు 3వ తేదీన హైదరాబాద్‌లో పెళ్లి చేసుకుందామని రమణకుమారిని నమ్మించి తీసుకొచ్చి ఇందిరానగర్‌లోని అద్దె గదిలో ఉంచాడు.

 పథకం ప్రకారమే...: ఆగస్టు 4న ఉదయం 10 గంటల సమయంలో అప్పటికే వేసుకున్న పథకం ప్రకారం విజయ్‌బాబు మాంసం నరికే కత్తితో రమణకుమారి తలపై బలంగా బాదాడు. ఆమె కుప్పకూలడంతో మెడను నరికాడు. రెండుకాళ్లు నరికి మొండెం ను ఓ సూట్‌కేస్‌లో, కాళ్లు, తలను వుూటల్లో చుట్టి తన బైక్‌పై యూసుఫ్‌గూడ సమీపంలోని జానకమ్మ తోటలో కాళ్లు, తల ఉన్న కవర్‌ను పడేసి మొండెం ఉంచిన సూట్‌కేస్‌ను మాదాపూర్ గుట్టల బేగంపేట నిర్మానుష్య ప్రాంతంలో వేసి పరారయ్యాడు. రెండు నెలలు గడుస్తున్నా తన సోదరి ఆచూకీ తెలియకపోయేసరికి రమణకుమారి అక్క పద్మావతి విజయవాడ సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు విచారించగా ఆగస్టు 3న విజయ్‌బాబుతో హైదరాబాద్ వెళ్లినట్లు తేలింది. విజయ్‌బాబును  విచారించగా రమణకుమారిని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇదే కేసు విషయంలో సత్యనారాయణపురం ఎస్‌ఐ నరేష్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడిని విచారణ నిమిత్తం తీసుకొచ్చి ఇందిరానగర్‌లో హత్య జరిగిన ప్రాంతంలో దర్యాప్తు చేశారు. వివరాలను బంజారాహిల్స్ పోలీసులకు తెలిపారు. కాగా, పట్టపగలు ఇందిరానగర్‌లో దారుణ హత్య జరిగినా బంజారాహిల్స్ పోలీసులకు సమాచారమే లేదు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు