ఎన్నారై మహిళలే అతడి టార్గెట్‌!

17 Oct, 2016 21:09 IST|Sakshi
నిందితుడు కె.వెంకటరత్నరెడ్డి

పెళ్లి చేసుకుంటాడు.. డబ్బుతో ఉడాయిస్తాడు
పెళ్లిళ్ల పేరుతో ఎన్‌ఆర్‌ఐలను మోసం చేస్తున్న గుంటూరువాసి అరెస్టు
గతంలో భూ కబ్జా, సెటిల్‌మెంట్లు,   బలవంతపు వసూలు కేసులు
భారతీమాట్రిమోనీ.కామ్‌లో సంపన్న యువతులకు వల
అమెరికాలో ప్రవాస భారతీయురాలిని పెళ్లాడి రూ.20 లక్షలతో ఉడాయింపు

 
హైదరాబాద్‌: భూ కబ్జాలు ... భూ సెటిల్‌మెంట్ దందాలు చేశాడు... అది కుదరకపోవడంతో ఐఆర్‌ఎస్ అధికారినంటూ సినీ ప్రొడ్యూసర్లను బెదిరించాడు... చివరకు వ్యభిచార దందా నిర్వహించాడు. అయితే ఆశించినంత డబ్బులు రాకపోవడంతో ఈసారి ఎన్నారై మహిళలను టార్గెట్ చేసుకుని పెళ్లి మోసాలకు తెరలేపాడు. ఇందులో భాగంగానే భారతీమాట్రిమోనీ.కామ్‌లో తనకు పెళ్లికాలేదని, ఒంటరిగా ఉంటున్నానని, తల్లిదండ్రులు చనిపోయారని, అమెరికాకు బిజినెస్ పనిమీద వెళుతున్నాననే ప్రొఫైల్ అప్‌లోడ్ చేసి ఎన్నారై మహిళలను మోసగిస్తున్న గుంటూరుకు చెందిన కె.వెంకటరత్నరెడ్డిని నగర సైబర్ క్రైమ్ పోలీసులు గుంటూరులో శుక్రవారం అరెస్టు చేశారు.
 
 విడాకులు తీసుకొని అమెరికాలో ఉంటున్న తన అక్కకూతురికి భారతీమాట్రిమోని.కామ్‌లో నిందితుడి ప్రొఫైల్ చూసి నచ్చి పెళ్లి చేసుకుందని, 20 రోజులు కాగానే అతను భారత్‌లో అత్యవసర పని ఉందని రూ.20 లక్షలు తీసుకొని వచ్చి ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడని బాధితురాలి మేనమామ రాజశేఖర్‌రెడ్డి ఈ నెల 10న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ప్రొఫైల్‌ను ఇంటర్నెట్‌లో సెర్చ్ చేయగా అతడో నేరగాడని, అతడికి తల్లితో పాటు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు తెలిసిందన్నారు.
 
పథకం ప్రకారం పట్టేసుకున్నారు...
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబర్ పోలీసులు నిందితుడి సెల్‌ఫోన్ నంబర్లు, పాత సెల్ నంబర్లతో పాటు అతడి ఫేస్‌బుక్ ఖాతాలు, ఠాణాల్లో అతడిపై ఉన్న కేసులను పరిశీలించారు. సెల్‌ఫోన్ లోకేషన్ టవర్ల ఆధారంగా గుంటూరులో ఉన్నట్లు తెలుసుకుని శుక్రవారం ఉదయం అతడిని అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. ఈ ఏడాది మేలో విశాఖ పాస్‌పోర్టు ప్రాంతీయ కార్యాలయం నుంచి అతడికి పాస్‌పోర్టు వచ్చిందని, నేరచరిత ఉన్నా ట్రాక్ రికార్డును పరిశీలించకుండానే ఎస్‌బీ అధికారులు పాస్‌పోర్టు ఎలా జారీ చేశారన్న దానిపై వారిని వివరణ కోరనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
 
మరో ఇద్దరికి గాలం
నిందితుడు అమెరికాలోనే మేరీ అనే మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈమెను వివాహం చేసుకునేందుకు అమెరికా వెళ్లిన రామ వెంకట్‌కు మరో ప్రవాస భారతీయురాలు(బాధితురాలు) వలలో పడింది. దీంతో మేరీని తర్వాత పెళ్లి చేసుకుందామని  ఇప్పటికే సర్టిఫికెట్ తీసుకున్నాడు. కెనడా అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు మరో నాలుగు రోజుల్లో అక్కడికి వెళుతున్నట్లు నిందితుడు పోలీసులకు విచారణలో తెలిపాడు. ఇప్పటికే ట్రావెల్ ఏజెంట్‌తో మాట్లాడిన అతడు అంతా రెడీ చేసుకున్నాడు.
 
 నిందితుడి బ్యాంక్ ఖాతాలో  రూ.4 వేల అమెరికా డాలర్లు ఉన్నాయని, వాటిని సీజ్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అతడి ఫేస్‌బుక్ ఖాతాలో 300 మంది అమ్మాయిలు ఉన్నారని, ఇతని వలలో పడి ఎవరైనా మోసపోయారనే దిశగా విచారణ చేపట్టామన్నారు. ఐదు రోజుల  కస్టడీకి తీసుకొని మరిన్ని వివరాలు రాబడతామని తెలిపారు.
 
హైదరాబాద్‌లో ఏడు... గుంటూరులో రెండు కేసులు
డిగ్రీ కూడా పూర్తి చేయని వెంకట రత్నరెడ్డి ఉద్యోగం దొరకకపోవడంతో తన స్నేహితులతో కలిసి భవన శిథిలాల తొలగింపు వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. అరుుతే అందులో  నష్టాలు రావడంతో సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో ప్రజలను మోసగించాలని పథకం రచించాడు. ఇందులో భాగంగానే ఐఆఎర్‌ఎస్ అధికారిగా అవతారమెత్తి సినీ ప్రొడ్యూసర్‌తో పాటు ఇతరులను బెదిరించి డబ్బులు వసూలు చేయబోయిన కేసులో బంజారాహిల్స్, ఎస్‌ఆర్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌లో వ్యభిచార దందా నిర్వహిస్తూ దొరికిపోయాడు. గుంటూరులో పక్కింటి వారి సంత్రో కారును కూడా దొంగిలించాడు. డమ్మీ తుపాకీతో ఓ బ్యాంక్ అధికారిని బెదిరించిన కేసుతో సహా ఇప్పటివరకు అతనిపై హైదరాబాద్‌లో ఏడు, గుంటూరులో రెండు కేసులు నమోదై ఉన్నాయి.

మరిన్ని వార్తలు