బ్యాంక్ లోన్ అంటూ మోసం..

1 Jul, 2016 18:01 IST|Sakshi

బంజారాహిల్స్ : బ్యాంకు రుణాలు ఇప్పిస్తానంటూ ఓ వ్యాపారిని నమ్మించి లక్షలాది రూపాయలకు టోకరా వేశాడో యువకుడు. దీనిపై బాధితుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించగా వారు చీటింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్- 2లోని ఇందిరానగర్ నివాసి ఖురేషి నిసార్ అహ్మద్ అనే వ్యాపారికి కర్నూలు నగరంలోని భాస్కర్‌నగర్‌కు చెందిన కేఎం.ఇలియాస్(28) గత ఏడాది పరిచయం అయ్యాడు. మాసబ్ ట్యాంకులో నివాసముంటున్న తాను చార్టెడ్ అకౌంటెంట్‌ను అని ఐసీఐసీఐ, స్టాండర్డ్ చార్టెర్డు బ్యాంకు, ఎస్‌బీఐ తదితర బ్యాంకుల్లో మంచి పరిచయాలున్నాయని, దక్షిణాఫ్రికాలో చేపట్టబోయే వ్యాపారానికి అవసరమైన రూ. 20 కోట్ల రుణాన్ని తాను ఇప్పించగలనంటూ నమ్మించాడు.

ఇందుకోసం పలు దఫాలుగా ఆయన్నుంచి రూ.45 లక్షలు వసూలు చేశాడు. ఎన్ని రోజులు గడిచినా రుణం మాటే ఎత్తకపోవడంతో నిసార్ అహ్మద్‌కు అనుమానం వచ్చి ప్రశ్నించగా ఎస్‌బీఐలో రూ.2.65 కోట్లు రుణం వచ్చిందంటూ బ్యాంకు పేరున ఉన్న రుణం మంజూరు పత్రాన్ని ఇచ్చాడు. దాన్ని తీసుకొని ఆయన సికింద్రాబాద్‌లోని ఎస్‌బీఐ బ్రాంచికి వెళ్లగా ఆ పత్రాలు నకిలీవని తేలింది. దీంతో ఇలియాస్‌కు ఫోన్ చేసి నిలదీశాడు. ఇక అప్పటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు. మోసపోయానని తెలుసుకొన్న ఖురేషి నిసార్ అహ్మద్ శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు ఇలియాస్‌పై ఐపీసీ 420, 406, 506ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు