సంకెళ్లు తెంచిన కుంచె

25 Jun, 2016 00:31 IST|Sakshi
సంకెళ్లు తెంచిన కుంచె

అది కారాగారం. అక్కడ గొలుసు తెంచుకుపోయిన వాళ్ల దగ్గర్నుంచి గొంతుకోసిన వాళ్ల దాకా ఎందరో.. చేసిన తప్పుకు వేసిన శిక్షను భరిస్తూనే... అలా చేయకుండా ఉంటే బాగుండేదనే ఆలోచన చేస్తున్నవాళ్లు ఎందరో. వీరంతా అయినవాళ్లకు దూరంగా నాలుగు గోడల మధ్య, తమలాంటి మరికొందరు ‘నేరరూప దానవుల’ మధ్య బతుకీడుస్తూంటారు. ఈ నేపథ్యంలో..  పడిన సంకెళ్లు చేతుల్ని మరింత మొద్దుబారేలా చేసేస్తున్న పరిస్థితుల్లో... ఆ చేతులకు అందిందో కుంచె. అంతే... ఆ చేతులిప్పుడు అద్భుత చిత్రాలను లిఖిస్తున్నాయి. మనసులను కదిలిస్తున్నాయి.    - ఎస్.సత్యబాబు

 

 ఓ మధ్యవయసు వ్యక్తి. గోడకు చేరబడి కూర్చున్నాడు. ఆ చూపుల్లో అంతులేని నిర్వేదం. ఆ కూర్చున్న శైలిలో అనంతమైన శూన్యం. చిత్రంగా... తానేడుస్తున్న విషయం, చెంపలకు అంటిన తడి కూడా అతనికి తెలిసినట్టు లేదు. చిత్రంగా అతనో చిత్రమే. కారాగారవాసం అనుభవిస్తున్న ఖైదీ భావాలకు ప్రతి రూప చిత్రమది. ఓ ప్రసిద్ధ చిత్రకారుడు వేస్తే ఆ చిత్రం బహుశా చాలా గొప్పగా ఉండేదేమో.. అయితే అచ్చంగా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్న ఖైదీ గీసింది కాబట్టి అత్యంత సహజంగా ఉంది. ఖైదీలు గీసిన ఇలాంటి ఎన్నో చిత్రాలు బంజారాహిల్స్‌లోని కళాకృతి గ్యాలరీ కేఫ్‌లో కొలువుదీరాయి.

 జైలులో... ‘కళ’‘కలం’...

 బహుశా దేశంలోనే ఇలాంటి ప్రయోగం ఎక్కడా జరిగి ఉండదు. నగరానికి చెందిన కృష్నాకృతి ఫౌండేషన్ ప్రయోగాత్మకంగా చేపట్టిన ‘బియాండ్ ది బార్స్’... గత 7 నెలలుగా నగర చిత్రకళా ప్రపంచంలో సంచలనం. జైలు జీవితం అనుభవిస్తున్న ఖైదీలకు, కత్తులు, కత్తెరలు తప్ప తెలీని ఖైదీల చేతులకు కుంచెనిచ్చి, వారిలోని కళాతృష్ణను వెలికితీసేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం అద్భుత ఫలితాలను అందిస్తోంది. పలువురు ఖైదీలను ఆర్టిస్టులుగా తీర్చిదిద్ది, వారు గీసిన చిత్రాలను ఇప్పటికే ఒక దఫా స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శించారు. రెండో దఫా కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో 180 చిత్రాల ప్రదర్శనను శుక్రవారం ప్రారంభమై, ఈ నెల 29 వరకూ కొనసాగుతుంది.

 
‘రంగు’మారింది...

కరడుగట్టిన హృదయాలు ‘కళ’కనేలా చేసిందీ ప్రయోగం. మోడువారిన మనసుల్లోని సున్నితత్వాన్ని తట్టి లేపింది. చర్లపల్లి, చంచల్‌గూడ కారాగారాల్లో బందీలుగా ఉన్న ఖైదీలు... 40 మంది వారంలో రెండు రోజుల పాటు చొప్పున చిత్రలేఖనంలో శిక్షణ పొందిన అనంతరం వారు స్వయంగా గీసిన చిత్రాలు ఈ మార్పునకు నిదర్శనంగా నిలిచాయి. పోలీసు కావాలనుకుని నేరస్తుడి గా మారిన ఓ ఖైదీ మానసిక సంఘర్షణ పోలీసుల గొప్ప తనాన్ని చాటి చెప్పేలా గీసిన ఓ చిత్రం ప్రతిఫలిస్తే, మనిషి అంతర్ముఖంలో ఉండే భావాలు ఒకేసారి బయటికి వస్తే ఆ మనిషి ముఖం ఎన్ని ముఖాలుగా మారుతుందో మరో చిత్రం తెలియజేస్తుంది. ఇబ్రహీం, విక్రమ్, రాజ్‌కుమార్, రమేష్, చిన్నా... తదితర ఖైదీల చేతుల్లో ప్రాణం పోసుకున్న దేశనాయకుల పోట్రైట్‌ల నుంచి ప్రకృతి దృశ్యాల దాకా... ఇక్కడ కనువిందు చేస్తాయి. ‘ఈ చిత్రాల విక్రయం ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్కాలర్‌షిప్‌ల రూపంలో ఖైదీలకే అందిస్తాం. అయితే ఇది కేవలం ఖైదీలకు ఆదాయం అందించడానికి మాత్రమే కాదు వారిలో సున్నితత్వాన్ని మేల్కొలిపి జీవితం పట్ల వారి దృక్పథాన్ని మార్చేందుకు కూడా’ అని కళాకృతి ఫౌండేషన్ నిర్వాహకులు ప్రశాంత్ లహోటి అన్నారు.

 

మొదట భయపడ్డా...
తొలుత ఖైదీలకు ఆర్ట్ వర్క్ అంశంలో శిక్షణ అంటే భయపడ్డాను. అయితే పోలీసు ఉన్నతాధికారులు, కళాకృతి ఫౌండేషన్ నిర్వాహకులు ప్రశాంత్ లహోటిలు అందించిన ప్రోత్సాహంతో దీన్ని అధిగమించాను. తొలి దశలో వారికి చెప్పడం కాస్త కష్టమైంది. అయితే వారిలో ఆసక్తి పెరిగిన తర్వాత నా పని సులభం అయింది. ఇప్పుడు కొందరైతే ప్రసిద్ధ చిత్రకారులకు తీసిపోని రీతిలో చిత్రాలు గీస్తున్నారు. అంతేకాదు ఖైదీ నుంచి కళాకారుడిగా రూపాంతరం చెందిన తర్వాత వారి మాట, మర్యాదల్లో ఎంతో మార్పు వచ్చింది. ఒక ఆర్ట్ ఇన్‌స్ట్రక్టర్‌గా ఇప్పటిదాకా ఎవరికీ రాని అవకాశం నాకు రావడం ఎంతో ఆనందంగా ఉంది.  - సయ్యద్, ఆర్ట్ టీచర్.

మరిన్ని వార్తలు