భక్తుడిలా వచ్చి అమ్మవారి మంగళసూత్రం చోరీ

2 Feb, 2015 04:33 IST|Sakshi

సీసీ కెమెరా ఫుటేజీలో దొంగ కదలికలు
సైదాబాద్: భక్తుడిలా గుడిలోకి వచ్చిన దొంగ అమ్మవారి మెడలోని 8 తులాల బంగారు మంగళసూత్రం అపహరించుకెళ్లాడు. సైదాబాద్ ఠాణా పరిధిలోని జీవనజ్యోతి సంఘం ఆవరణలోని శ్రీజయదుర్గాదేవి గుడిలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... తలకు మంకీ క్యాప్ పెట్టుకొని, భుజానికి సంచి తగిలించుకొని ఉదయం 9.30కి బైక్‌పై ఓ యువకుడు అమ్మవారి ఆలయానికొచ్చి పూజలు చేశాడు.  పూజారి అతనికి అమ్మవారి ఆశీర్వచనాలు అందజేసి తీర్థప్రసాదాలు ఇచ్చాడు.

ఈ క్రమంలో పూజారికి రూ. 100 ఇచ్చి టెంకాయ తీసుకురమ్మని బయటకు పంపాడు. తర్వాత గుడిలో అటు ఇటు తిరిగి ఎవరు లేరని నిర్థారించుకొని గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారి మెడలోని మంగళ సూత్రాన్ని తెంచుకుని వాహనంపై జారుకున్నాడు. కొబ్బరికాయ తీసుకుని గుడిలోకి వచ్చిన పూజారికి అమ్మవారి మెడలో మంగళసూత్రం కనిపించలేదు. దీంతో ఆలయ కమిటీకి, పోలీసులకు  సమాచారం అందించారు.  

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చోరీ జరిగిన తీరును పరిశీలించారు. గుడిలో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా దొంగ అమ్మవారి మంగళసూత్రం తెంచుకొని వెళ్లినట్టు స్పష్టంగా కనిపించింది.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గుడిలో చోరీ జరగడంతో పూజారి అమ్మవారి ఆలయంలో సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమం నిర్వహించారు.

మరిన్ని వార్తలు