ర్యాంకులు ఉల్టా పల్టా!

27 May, 2016 06:52 IST|Sakshi
ర్యాంకులు ఉల్టా పల్టా!

* తెలంగాణ, ఏపీ ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు తారుమారు
* ఇక్కడ ఫస్ట్ ర్యాంకర్‌కు ఏపీలో ఏడో ర్యాంకు
* ఏపీలో ఫస్ట్ ర్యాంకర్‌కు తెలంగాణలో పదో ర్యాంకు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ ఎంసెట్ లో టాప్ ర్యాంకులు తారుమారయ్యాయి! ఏపీ ఎంసెట్  ఇంజనీరింగ్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించిన విద్యార్థికి తెలంగాణ ఎంసెట్‌లో పదో ర్యాంకు లభించగా.. తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్‌లో ఒకటో ర్యాంకు సాధించిన విద్యార్థికి ఏపీలో 7వ ర్యాంకు వచ్చింది. అగ్రికల్చర్ అండ్ మెడికల్(ఎంబీబీఎస్, బీడీఎస్ మినహా) ఎంసెట్‌లోనూ ఇదే పరిస్థితి.

తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో ఒకటో ర్యాంకు సాధించిన విద్యార్థికి ఏపీలో 100వ ర్యాంకు లభించింది. ఇదే విభాగంలో తెలంగాణ ఎంసెట్‌లో పదో ర్యాంకు సాధించి న విద్యార్థికి ఏపీలో 193వ ర్యాంకు వచ్చింది. ఇటీవల ఏపీ ఎంసెట్ ఫలితాలను ప్రకటించగా.. గురువారం తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణ ఎంసెట్ రాసిన అనేక మంది విద్యార్థులు ఏపీ ఎంసెట్ కూడా రాశారు. ఏపీ ఎంసెట్ రాసిన వారిలో చాలామంది తెలంగాణ ఎంసెట్‌కు హాజరయ్యారు. రెండుచోట్లా తొలి పది స్థానాల్లో నిలిచినవారికి తెలంగాణలో వచ్చిన ర్యాంకు ఏపీలో రాలేదు.. ఏపీలో వచ్చిన ర్యాంకు తెలంగాణలో రాలేదు. వీరివే కాదు ఇలా అనేక మంది విద్యార్థుల ర్యాంకులు మారిపోయాయి.
 
మెడికల్ టాపర్ల మనోగతం గ్రామాల్లో సేవ చేస్తా: ప్రదీప్
గాలివీడు: ఏపీలోని వైఎస్సార్ జిల్లాకు చెందిన బొజ్జల ప్రదీప్ కుమార్ రెడ్డి తెలంగాణ మెడికల్‌లో తొలి ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. రాయచోటి నియోజకవర్గం గాలివీడుకు చెందిన బొజ్జల నారాయణరెడ్డి, అంజనమ్మ దంపతుల కుమారుడైన ప్రదీప్ ఇంటర్‌లో ఏపీలో రెండో ర్యాంకు సాధించాడు. ఇటీవలి ఏపీ ఎంసెట్ మెడికల్ ఫలితాల్లో 100వ ర్యాంకు సాధించాడు. తండ్రి టీచర్ కాగా తల్లి గృహిణి. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. కార్డియాలజిస్టుగా గ్రామాల్లో పేదలకు సేవ చేయడమే నా లక్ష్యం’’ అని ప్రదీప్ ‘సాక్షి’కి తెలిపాడు.
 
ఎయిమ్స్‌లో సీటే లక్ష్యం..: అర్బాజ్
కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన మహ్మద్ అర్బాజ్ తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో మెడికల్ విభాగంలో మూడో ర్యాంకు సాధించాడు. ఏపీ ఎంసెట్‌లో 48వ ర్యాంకు సాధించిన అర్బాజ్, ఢిల్లీ ఎయిమ్స్‌లో సీటు సాధించడమే తన లక్ష్యమని తెలిపాడు.  
 
ఇంటర్‌లోనూ ప్రతిభావంతురాలు
హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు చెందిన ఉప్పల ప్రణతి మెడికల్ విభాగంలో రాష్ట్రంలో నాలుగో ర్యాంకు సాధించింది. పదో తరగతి, ఇంటర్‌లోనూ ఆమె అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది. తల్లి హేమలత గృహిణి కాగా తండ్రి హైటెక్ సిటిలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.
 
పదో తరగతిలో 9.8 గ్రేడ్  
తెలంగాణ ఎంసెట్ మెడికల్ విభాగంలో ఐదో ర్యాంకు సాధించిన యజ్ఞప్రియ ఇటీవలి ఏపీ ఎంసెట్‌లో మూడో ర్యాంక్ సాధించింది. వీరిది మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట. తండ్రి సత్యనారాయణరెడ్డి హైదరాబాద్‌లో సాగునీటి శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. యజ్ఞప్రియ పదో తరగతిలో 9.8 గ్రేడ్ మార్కులు, ఇంటర్‌లో 975 మార్కులు సాధించింది.
 
మంచి డాక్టర్‌నవుతా: జలీలి
హైదరాబాద్ పాతబస్తీ నూర్‌ఖాన్‌బజార్‌కు చెందిన జీషాన్ అహ్మద్ జలీలి ఎంసెట్ మెడికల్‌లో 6వ ర్యాంక్ సాధించాడు. మంచి వైద్యునిగా ఎదుగుతానని అతను చెప్పాడు. జీషాన్ తండ్రి డాక్టర్ ఖలీం అహ్మద్ జలీలి నిజాం కాలేజీలో ఫిజిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కాగా తల్లి అంజుమ్ ఫాతిమా యాకత్‌పురా ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్. జీషాన్ అక్క మరియా డాక్టర్. సోదరుడు హరూన్ అమెరికాలో ఎంఎస్ చదువుతున్నాడు.

మరిన్ని వార్తలు