వీడిన జల ‘చెర’

26 Sep, 2016 02:39 IST|Sakshi
వీడిన జల ‘చెర’

సాక్షి, హైదరాబాద్/పాపన్నపేట: మెదక్ జిల్లా ఏడుపాయలలో మంజీర నదిలో చిక్కుకున్న 24 మంది కూలీలు క్షేమంగా బయటపడ్డారు. వీరిని రక్షించడానికి సీఎం కేసీఆర్ చూపిన చొరవ ఫలిం చింది. సీఎం విజ్ఞప్తి మేరకు ఎయిర్‌ఫోర్స్ చేపట్టిన ఆపరేషన్‌తో కూలీ లంతా ఒడ్డుకు చేరుకున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్ రాస్.. ఏడుపాయల్లోనే మకాం వేసి ప్రభుత్వ అధికారులు, ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో మాట్లాడుతూ, బాధిత కూలీలకు సెల్‌ఫోన్  ద్వారా ధైర్యం చెబుతూ మొత్తం పరిస్థితిని పర్యవేక్షించారు.

ఆదివారం ఉదయం 8.45 గంటలకు ఆపరేషన్  ప్రారంభించిన ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్లు 50 నిమిషాల్లో 24 మంది బాధితులను జల‘చెర’ నుంచి విడిపించి స్వేచ్ఛను ప్రసాదించాయి. మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 24 మంది కూలీలు పొట్టకూటి కోసం నెల రోజుల కిందట మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల ప్రాంతానికి వచ్చారు. మంజీర పాయల మధ్య టేకుల బొడ్డెపై జరుగుతున్న బ్రిడ్జి నిర్మాణంలో కూలీ పనులు చేసుకుంటూ.. అక్కడే రేకుల షెడ్డు వేసుకుని నివసిస్తున్నారు. అయితే భారీ వర్షాలకు మంజీర వరదగా మారి ఘనపురం ప్రాజెక్టు నుంచి పొంగిపొర్లుతూ టేకుల బొడ్డెను చుట్టుముట్టింది.

దీంతో కూలీలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బాధితులను రక్షించేందుకు శనివారం జాతీయ విపత్తుల సహాయక సిబ్బంది రంగంలోకి దిగినప్పటికీ పరిస్థితులు అనుకూలించలేదు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం శనివారం విషయాన్ని సీఎం దృష్టికి తెచ్చింది. దీంతో కేసీఆర్ అక్కడికి ప్రభుత్వ హెలికాప్టర్ పంపడానికి ప్రయత్నించారు. ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్ అయితే తప్ప మనుషులను లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని తేలింది. దీంతో కేసీఆర్ ఎయిర్‌ఫోర్స్ అధికారులతో మాట్లాడి.. హెలికాప్టర్లను పంపించారు. కూలీలను సురక్షితంగా బయటకు తేవడంపై ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.  
 
50 నిమిషాల్లోనే..: కూలీలను రక్షించేందుకు వైమానిక దళం శనివారం రెండు సార్లు ప్రయత్నించగా భారీ వర్షం, మేఘాలు, ప్రతికూల వాతావరణం వల్ల సాధ్యం కాలేదు. అయితే ఆదివారం మరోమారు ఆపరేషన్ చేపట్టి.. 50 నిమిషాల్లోగా పని పూర్తి చేశాయి. రెండు హెలికాప్టర్లు ఉదయం 7.45 గంటలకు టేకులబొడ్డెపై ల్యాండ్ అయ్యాయి. 4 విడతలుగా రెండేసి హెలికాప్టర్లు ఒక్కోసారి ముగ్గురు బాధితులను ఏడుపాయల వైపు తీసుకొచ్చాయి. బాధితులంతా సురక్షితంగా ఇవతలి వైపునకు చేరగానే డిప్యుటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అల్పాహారం అందజేశారు. అనంతరం వైద్య పరీక్షలు జరిపించారు. ఆపై వారికి ఏడుపాయల్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బాధితులంతా తమ స్వస్థలాలకు వెళ్తామని చెప్పడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు