అందుకే తెలంగాణలో పెట్టుబడులు: కేటీఆర్

18 Jun, 2016 14:04 IST|Sakshi

హైదరాబాద్ : పెట్టుబడులకు తెలంగాణ అనుకూలంగా మారిందని ఐటీ శాఖమంత్రి కేటీఆర్ తెలిపారు. అందుకే అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఆయన తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లేందుకు అనేక చర్యలు చేపడుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. దీని ద్వారా 12 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తుందని ఆయన వెల్లడించారు.

కాగా ఆదిభట్లలో టాటా బోయింగ్ ఏరోస్పేస్ యూనిట్కు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్... మాట్లాడుతూ టాటా బోయింగ్ వైమానిక విడి భాగాల సంస్థ తెలంగాణకు రావడం సంతోషకరమన్నారు. దీంతో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని ఆయన పేర్కొన్నారు. అలాగే పరిశ్రమల శాఖ విషయంలో గత ఏడాది వృద్ధిని సాధించామని, ఇక వచ్చే ఏడాదిపై దృష్టి పెట్టామన్నారు. అలాగే అపాచీ, హెలికాప్టర్ల ప్రధాన భాగాన్ని తయారు చేయడానికి బోయింగ్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో ఒప్పందం జరిగింది.

కాగా రక్షణమంత్రి మనోహర్ పరీకర్ మాట్లాడుతూ రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులను అనుమతించడం సరైన ప్రక్రియగా పేర్కొన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్లో బోయింగ్కు శంకుస్థాపన జరిగిందన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో స్పష్టమైన విధానాలుండాలని, ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
 

మరిన్ని వార్తలు