మటన్‌ తిన్నారో..మటాష్‌

4 Apr, 2017 01:45 IST|Sakshi
మటన్‌ తిన్నారో..మటాష్‌

నగరంలోని పలు హోటళ్లలో  నాణ్యత లేని మాంసం
అపరిశుభ్రంగా వంటగదులు
జీహెచ్‌ఎంసీ దాడుల్లో బట్టబయలు


సిటీబ్యూరో:  దమ్‌ బిర్యానీ, మటన్‌ బిర్యానీ, చికెన్‌ బిర్యానీ పేరు ఏదైనా లొట్టలు వేస్తూ తినే వారందరో. ఆయా బిర్యానీలు, మాంసాహార వంటకాల పేర్లు వినగానే మాంసాహారప్రియుల మనస్సు లాగేస్తుంది. అయితే నగరంలోని  పలు హోటళ్లు కనీస ప్రమాణాలు పాటించకుండా నాణ్యతలేని మాంసాన్ని వండి వడిస్తున్నాయి. అపరిశుభ్ర వాతావరణంలో తినడానికి పనికిరాని మాంసాన్ని వడ్డిస్తూ తమ గల్లా పెట్టె నింపుకుంటున్నాయి. గ్రేటర్‌ పరిధిలోని పలు హోటళ్లలో మాంసంగా వినియోగించేందుకు వీల్లేని  రోగాలతో కూడిన గొర్రెలు, పశువుల మాంసాన్ని వంటకాల్లో వినియోగిస్తున్నారు.

వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యకరంగా, తగిన వయసులో ఉన్న మేకలు, గొర్రెలు, పశువుల మాంసాన్నే  ఆహారంగా తీసుకోవాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. అందుకు తగినట్లు జీవాల   ఆరోగ్యస్థితిని, వయసును పరిశీలించి తినడానికి అర్హమైనవాటిని గుర్తించి వాటినే వధించాలని ధ్రువీకరిస్తూ జీహెచ్‌ఎంసీ స్టాంపు వేస్తుంది. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించే స్లాటర్‌ హౌస్‌లలో ఈ ప్రక్రియ జరుగుతుంది. వీటిల్లోనే జంతువుల్ని వధించి, స్టాంపు వేసిన మాంసాన్నే వినియోగించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. అయితే పలు హోటళ్ల యాజమాన్యాలు వీటిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎక్కడ పడితే అక్కడ వధించిన, అనారోగ్యం,, మరీ లేత, ముదిరిపోయిన, ముసలి జీవాలు, పశువుల మాంసాన్ని వండి ప్రజలకు వడ్డిస్తున్నాయి.

నొన్ని హోటళ్లలో కుళ్లిన మాంసాన్ని సైతం నిల్వచేసి వండుతున్నట్లు ఆరోపణలు రావడంతో జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్లు,  వైద్యాధికారులతో కూడిన బృందాలు  నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఆకస్మిక తనిఖీలు, దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు హోటళ్లలో నాణ్యత పాటించడం లేదని గుర్తించి ఆయా హోటళ్ల నిర్వాహకులకు భారీగా జరిమానాలు విధించారు. కొన్నింటిని సీజ్‌ చేశారు   

ఆదేశాలు  బేఖాతర్‌..
జీహెచ్‌ఎంసీ స్లాటర్‌హౌస్‌లలో శాస్త్రీయ పద్ధతుల్లో వధించిన, జీహెచ్‌ఎంసీ ధ్రువీకరిస్తూ స్టాంప్‌ వేసిన   ఆరోగ్యకర మాంసాన్నే వినియోగించాలని, వంటశాలల్ని పరిశుభ్రంగా ఉంచాలని జీహెచ్‌ఎంసీ అధికారులు ఇటీవల హోటళ్ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి, హెచ్చరించినా వారిలో మార్పురాలేదు. ప్రజలనుంచి ఫిర్యాదులు అందడంతో సోమవారం అధికారులు ముమ్మర దాడులు నిర్వహించారు.  పేరెన్నికగన్న హోటళ్లలో కూడా నాణ్యతలేని మాసం విక్రయిస్తున్నట్లు వెల్లడికావడం గమనార్హం.

ఆయా స్లాటర్‌ హౌస్‌లలో రోజుకు 2వేల మేకలు , గొర్రెల్ని శాస్త్రీయ పద్ధతుల్లో వధించే సామర్ధ్యం ఉన్నప్పటికీ కేవలం 50 నుంచి 150 మాత్రమే  అక్కడకు వస్తున్నాయి. దీంతో యథేచ్చగా బహిరంగ ప్రాంతాల్లో వాటిని వధించి హోటళ్లకు తరలిస్తున్నారు.జియాగూడలోని 11 ఎకరాల్లో ప్రతిరోజూ దాదాపు ఆరువేల  మేకలు, గొర్రెలు వధిస్తున్నారు. నగరంలో సరఫరా అవుతున్న మాంసంలో దాదాపు  70 శాతం మేకలు, గొర్రెల్ని ఇక్కడే వధిస్తుండటం గమనార్హం. వీటికి తోడు బహదూర్‌పురా, రామ్నాస్‌పురా, గౌలిపురా, బార్కాస్, గోల్కొండ,  బోయిగూడ, తదితర ప్రాంతాల్లో జీవాల్ని వధిస్తున్నారు.   ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆయా ప్రాంతాల్లో నిబంధనలను పట్టించుకోవడం లేదు.

9నెలల కంటే తక్కువ వయసున్న  మేకలు, గొర్రెల్ని,  మూడేళ్లలోపు పశువులు, అనారోగ్యంగా ఉన్నవాటిని వధించరాదని నిబంధనలున్నా పట్టించుకోవడం లేదు. మాంసంపై వెటర్నరీ వైద్యుని పర్యవేక్షణలో ధ్రువీకరణ స్టాంప్‌ వేయాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావడం లేదు. ప్రముఖ నేతల అండదండల కారణంగానే ప్రైవేటుగా జంతువులను వధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ కారణంగా  పరిసరాలు, భూగర్భజలాలు, వాతావరణం కలుషితమవుతున్నాయి. జీహెచ్‌ఎంసీ స్లాటర్‌ హౌస్‌లలో మేక, గొర్రెలకు రూ. 25లు, పశువులకు రూ.100 వంతున వసూలు చేస్తుండగా, ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద ధర తక్కువని, పశువులు, మేకల్ని ఉంచడానికి తగిన స్థలం లేదని చెబుతూ ప్రైవేటు కబేళాలను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.

రూ. 1.40 లక్షల జరిమానా వసూలు
సోమవారం 14 హోటళ్లపై దాడులు నిర్వహించిన అధికారులు జీహెచ్‌ఎంసీ ధ్రువీకరణ లేని, అపరిశుభ్ర వాతావరణంలో వంటలు చేస్తున్నందుకుగాను రూ. 1.40 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. వ్యాధుల భారిన పడే ప్రమాదం  వ్యాధులతో బాధపడుతున్న జంతువుల మాంసాన్ని వినియోగించరాదని అధికారులు పేర్కొన్నారు. జంతువుల్ని వధించిన తర్వాత రక్తనాళాల్లో రక్తం ఇంకిపోయిన తర్వాత మాత్రమే వాటినుంచి తోలును వేరు చేయాల్సి ఉంటుందన్నారు. ఒక జంతువు రక్తం మరో జంతువు రక్తంతో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అయితే ప్రైవేటు వధశాలల్లో నిబంధనలు పాటించడం లేదన్నారు. మాంసాన్ని 120 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు వేడి చేశాకే ఆహారంగా తీసుకోవాలన్నారు. ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన మాంసాన్ని తగిన ఉష్టోగ్రత వరకు వేడిచేయకుండానే వండటం వల్ల జీర్ణాశయ, శ్వాసకోశ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని డాక్టర్లు హెచ్చరించారు.

జరిమానా విధించిన హోటళ్లు
ఆన్‌ ఓహ్రీస్, (బంజారాహిల్స్‌)అస్టోరియా హోటల్‌ (ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌), డ్రంక్‌యార్డ్‌  శివాని రెస్టారెంట్‌ అండ్‌ బార్‌ (గచ్చిబౌలి), ప్యారడైజ్‌ హోటల్, (ఐఎస్‌సదన్‌), సోహెల్‌ హోటల్‌ (నల్గొండ క్రాస్‌రోడ్స్‌), ఆల్‌ షబా హోటల్‌(గచ్చిబౌలి), సాగర్‌ రెస్టారెంట్‌ (షాపూర్‌నగర్‌).. అపరిశుభ్రమై వాతావరణంలో ఆహారాన్ని వండుతున్న మినర్వా గ్రాండ్, ఎస్‌డిరోడ్‌ (సికింద్రాబాద్‌) యాజమాన్యానికి రూ. 20 వేల జరిమానా విధించారు.

మరిన్ని వార్తలు