పలువురు ఐఏఎస్‌ల బదిలీ

24 Jun, 2016 03:47 IST|Sakshi

రెవెన్యూ శాఖకు ప్రదీప్‌చంద్ర  అటవీ శాఖకు బీఆర్ మీనా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్‌లో ఉన్న కొందరు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కొంతకాలంగా వెయిటింగ్‌లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్ చంద్రకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ బాధ్యతలు అప్పగించారు.

ప్రస్తుతం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న బీఆర్ మీనాను అటవీ, పర్యావరణ శాఖకు బదిలీ చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సమయంలో కీలకమైన రెవెన్యూ శాఖ నుంచి సీనియర్ అధికారి బీఆర్ మీనాను బదిలీ చేయటం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అటవీ శాఖ కార్యదర్శిగా ఉన్న వికాస్‌రాజ్‌ను నీటిపారుదల శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న కాళీచరణ్ సుదమ్‌రావ్‌కు సీసీఎల్‌ఏ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.

ప్రస్తుతం అక్కడ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎల్.శశిధర్‌ను రిలీవ్ చేశారు. వెయిటింగ్‌లో ఉన్న ఈ.శ్రీధర్‌ను పంచాయతీరాజ్ శాఖ జాయింట్ సెక్రెటరీగా నియమించారు. కరీంనగర్ జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్న పౌసమి బసును సెర్ప్ సీఈవో పోస్టుకు బదిలీ చేశారు. ఆమె స్థానంలో వెయిటింగ్‌లో ఉన్న దేవసేనకు జాయింట్ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. వీరితో పాటు అటవీ శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ఐఎఫ్‌ఎస్ అధికారి మోహన్ చంద్రను బదిలీ చేశారు. తదుపరి పోస్టింగ్‌కు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఎదుట రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వార్తలు