హనుమంతరావు మృతికి పలువురి సంతాపం

10 Jan, 2017 03:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాగునీటి రంగ నిపుణుడు, రిటైర్డ్‌ ఈఎన్‌సీ టి.హనుమంతరావు మృతిపై రాజస్తాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజస్తాన్‌ లో నీటి వనరుల అభివృద్ధికి హనుమంతరావు అందించిన సేవలు మరువ లేనివని వసుంధర కొనియాడారు. చిన్న నీటిపారుదల రంగంలో హనుమంతరావు ప్రయో గాలు ప్రామాణికంగా ఉన్నట్టు మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. తెలంగాణలో గుర్తింపుపొందిన ఇంజనీర్లలో హనుమంతరావు ఒకరని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

హనుమంతరావు అంత్యక్రియలు మంగళవారం జరుగనున్నాయి. హనుమంతరావు మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంతాపం తెలిపారు. నీటిపారుదల శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి, చతుర్విద జల ప్రకియను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ఆయన రూపొందించిన టెక్నాలజీని పలు దేశాల్లో, మన దేశంలోని వివిధ రాష్ట్రాలు ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో వ్యవసాయాన్ని సాగిస్తున్నారని నివాళులర్పించారు. ఐక్యరాజ్యసమితికి సలహాదారుగా వ్యవహరించడంతోపాటు ఆఫ్రికా, ఆసియా, పసిఫిక్‌ దేశాల్లో పలు సాగునీటి ప్రాజెక్టుల అమల్లో భాగస్వాములయ్యారని పేర్కొన్నారు.

శ్రీరాం వెదిరె సంతాపం  
సాక్షి, న్యూఢిల్లీ: నీటి పారుదల రంగ నిపుణులు టి.హనుమంతరావు మృతికి కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు శ్రీరాం వెదిరె సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్‌ సహా దేశవ్యాప్తంగా నీటి పారుదల రంగానికి సేవలందించి హనుమంతరావు మార్గదర్శిగా నిలిచారని ఆయన సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.

>
మరిన్ని వార్తలు