‘దారి’లో ‘దేవుడు’!

20 Apr, 2016 23:57 IST|Sakshi
‘దారి’లో ‘దేవుడు’!

నగరంలో నడిరోడ్డుపై పలు ప్రార్థనా స్థలాలు
అత్యధికం అనధికారికంగానే నిర్మితం
తొలగింపులో అడుగడుగునా అడ్డంకులు
సమష్టి కృషితోనే ఆశించిన ఫలితాలు

 

‘బహిరంగ ప్రదేశాల్లో అనధికారికంగా కొనసాగుతున్న ప్రార్థనా మందిరాలను తొలగిం చడమో... మరో ప్రదేశానికి తరలించడమో చేయాలి. రెండు వారాల్లో చర్యలు తీసుకోని పక్షంలో స్వయం గా కోర్టుకు హాజరుకావాల్సిదిగా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు సమన్లు జారీ చేయాల్సి ఉంటుంది.’   - జస్టిస్ వి.గోపాల గౌడ, జస్టిస్ అరుణ్ మిశ్రాలతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం మంగళవారం చేసిన వ్యాఖ్యలివి.

 

సిటీబ్యూరో:  రాజధాని సైతం ఈ తరహా ప్రార్థనామందిరాలకు ఏమాత్రం అతీతం కాదు. ఎన్నో ఏళ్లుగా ఇవి అడుగడుగునా ట్రాఫిక్ అడ్డంకుల్ని సృష్టిస్తూనే ఉన్నాయి. ‘మెట్రో’ పనులతో పలు కీలక ప్రాంతాల్లో ఈ ఇబ్బందులు మరింతగా పెరిగాయి. సమస్య పరిష్కారానికి గతంలో అనేక ప్రయత్నాలు జరిగినా, పూర్తిస్థాయిలో ఫలితాలు సాధించలేదు. తాజాగా సుప్రీం కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ వ్యవహారం మరోసారి తెరమీదికి వచ్చింది. నగర ట్రాఫిక్ విభాగం గణాంకాల ప్రకారం నగరంలో ఈ తర హా ప్రార్థనా స్థలాలు 253 వరకు ఉన్నాయి. వీటికి తోడు మరికొన్ని ప్రాంతాల్లో స్మశానాలు అడ్డంకులుగా మారుతున్నాయి.

 
ఫలక్‌నుమలో అత్యధికం

ట్రాఫిక్ కమిషనరేట్‌లోని 25 ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో 253 ‘అక్రమ’ ప్రార్థనా స్థలాలు ఉండగా వాటిలో అత్యధికం ఫలక్‌నుమలోనే ఉన్నాయి. ఇక్కడ గరిష్టంగా 43 కొలువైనట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. చార్మినార్ పరిధిలో అతి తక్కువ ప్రార్థనాస్థలాలు ఉన్నాయి. కాగా ఇక్కడ కేవలం ఒకే ప్రార్థనా స్థలం ట్రాఫిక్‌కు ఇబ్బందికరంగా ఉంది. ఈ అక్రమ ప్రార్థనాస్థలాల్లో మసీదులు, చిల్లాలు, దర్గాలు 129, దేవాలయాలు 117, చర్చీలు 7 ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు 

 

తొలగింపు ప్రహసనమే...

అనేక సందర్భాల్లో ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమవుతున్న ప్రార్థనా స్థలాల తొలగింపు పెద్ద ప్రహసనంగా మారిపోయింది. నగరంలోని పరిస్థితుల నేపథ్యంలో దీనిని అత్యంత సున్నితమైన అంశంగా పరిగణించాల్సి వస్తోంది. గతంలో కోఠిలోని ఉమెన్స్ కాలేజీ బస్టాప్ వద్ద ఉన్న నల్లపోచమ్మ ఆలయాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు ‘తాకడం’తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  మరికొన్ని ప్రాంతాల్లో దర్గాల విషయంలోనూ ఇదే పరిస్థితి ఎదురయ్యింది. ఫలితంగా వీటి విషయంపై మాట్లాడటానికే సంబంధిత అధికారులు పలుమార్లు ఆలోచించాల్సి ఉంది. అధికార యంత్రాంగం ఈ కోణంలో అడుగు వేయాలని ప్రయత్నించినా... అనేక రాజకీయాలు అడ్డం తగులుతున్నాయి.


అంతా కలిసి ముందువెళితేనే...
ఎన్నో ఏళ్లుగా నగరాన్ని వేధిస్తున్న ఈ సమస్యను పరిష్కరించి, అరుణాచల్‌ప్రదేశ్ తరహాలో భాగ్యనగరాన్నీ తీర్చిదిద్దేందుకు అన్ని వర్గాలు, శాఖల అధికారులతో పాటు రాజకీయ వర్గాలు కలిసి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఒకటి కంటే ఎక్కువ వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలాలు ఒకే చోట ఉన్నాయి. వీటి విషయంలో తరచూ ఎదురవుతున్న వాదన ‘ముందు వారిది తొలగించండి’. ఈ కారణంతోనే ఏళ్లుగా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. సాధారణ సమయాల్లో కంటే  పర్వదినాలప్పుడు ఈ ఇబ్బందులు మరింత ఎక్కువ అవుతున్నాయి. ప్రస్తుతం ‘మెట్రో’ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సమస్య మరీ జఠిలంగా మారింది.

 

ఉమ్మడి కమిటీలు ఏర్పాటు చేయాలి: నిపుణులు

ఈ సమస్యను పరిష్కరించేందుకు ‘పీస్’ కమిటీల తరహా లోనే వివిధ వర్గాల పెద్దలతో కూడిన ఉమ్మడి కమిటీలను ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాంతాల వారీగా సాధారణ పౌరులు, అధికారుల, భిన్న వర్గాలకు చెందిన పెద్దలు, వ్యాపార యూనియన్ లీడర్లతో వీటిని ఏర్పాటు చేయాలన్నారు. అంతా కలిసి సమావేశాలు ఏర్పా టు చేసుకుని సదరు ప్రార్థనా స్థలం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలపై క్షేత్రస్థాయిలో చర్చించాలని, పూ ర్తిగా తొలగించే విషయం కాకపోయినా కనీసం ఇబ్బందులు లేని స్థానాలకు మార్చేందుకు అందరినీ ఒప్పించగలిగితే ఈ సమస్య తీరుతుందని వారు పేర్కొంటున్నారు. అయితే ఎలాంటి వివాదం లేని ప్రత్యామ్నాయ స్థలాలను చూపడానికి జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ విభాగాలు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని వారు సూచిస్తున్నారు.

 

>
మరిన్ని వార్తలు