పైన మొక్కజొన్న.. కింద గంజాయి..

24 Aug, 2017 01:24 IST|Sakshi
పైన మొక్కజొన్న.. కింద గంజాయి..
- ఓఆర్‌ఆర్‌పై 300 కేజీల గంజాయి పట్టివేత 
- విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి  రవాణా 
- ఐదుగురి అరెస్ట్‌.. పరారీలో మరో ముగ్గురు 
 
హైదరాబాద్‌: పైన మొక్కజొన్న సంచులు.. కింద గంజాయి బ్యాగ్‌లు.. మాదకద్రవ్యాల రవాణా కోసం స్మగ్లర్లు ఎన్నుకున్న మార్గమిది. బుధవారం ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై బొలేరో వాహనంలో తరలిస్తున్న 300 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. బుధవారం శంషాబాద్‌ డీసీసీ పీవీ పద్మజ విలేకరులకు వివరాలు వెల్లడించారు. వారం రోజులుగా ఔటర్‌పై ఆర్‌జీఐఏ పోలీసులతో పాటు ఎస్‌ఓటీ, సీసీఎస్‌ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో అనుమానాస్పదంగా వెళుతున్న బొలేరో వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. వాహనం లోడులో పై భాగం మొత్తం మొక్కజొన్న సంచులతో నింపి.. కింది భాగంలో 11 బ్యాగుల్లో తరలిస్తున్న 300 కేజీల గంజాయి గుట్టు రట్టయ్యింది.

విశాఖ జిల్లా చింతపల్లి తొటమామిడి గ్రామానికి చెందిన లక్ష్మణ్‌రావు, సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌ గ్రామానికి చెందిన పరుశురాంతో గంజాయిని స్మగ్లింగ్‌ చేసే విషయంలో ఒప్పందం కుదుర్చుకున్నాడు. విశాఖ జిల్లా నర్సీపట్నం నుంచి బొలేరో వాహనంలో మూడు క్వింటాళ్ల గంజాయిని బ్యాగుల్లో సర్దుకుని, దానిపై భారీగా మొక్కజొన్న సంచులను వేసుకుని విశాఖ జిల్లా కోడుగుమ్మడి గ్రామానికి చెందిన తంబెల్లి చందర్‌రావు(24), తుని మండలానికి చెందిన జొక్కన్న శ్రీను బయలుదేరారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన మోహన్‌(20), సీహెచ్‌ వెంకట్‌(29) ఇండికా కారులో పరుశురాం సూచనల మేరకు సూర్యాపేట నుంచి బొలేరో వాహనానికి పైలట్‌గా వస్తూ పోలీసు తనిఖీల గురించి బొలేరోలో ఉన్న వారికి సమాచారం అందిస్తున్నారు.

శంషాబాద్‌ కొత్వాల్‌గూడ పరిధిలోకి వచ్చిన వీరి వాహనాలను పోలీసులు తనిఖీ చేయడంతో గంజాయి రవాణా గుట్టు రట్టయింది. రూ.30 లక్షల విలువ చేసే 300 కేజీల గంజాయితో పాటు రెండు వాహనాలు, రూ.4,250 నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చందర్‌రావు, శ్రీను, మోహన్, వెంకట్‌తోపాటు విశాఖ వాసి బొంతల నాగులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. లక్ష్మణ్‌రావు, పరుశురాంతో పాటు విశాఖ వాసి తంబెల్ల సురేశ్‌ పరారీలో ఉన్నారు.
>
మరిన్ని వార్తలు