గంజాయి రవాణా.. ఐదుగురి అరెస్టు

23 Jul, 2017 02:02 IST|Sakshi
గంజాయి రవాణా.. ఐదుగురి అరెస్టు
200 కిలోల గంజాయి, రెండు కార్లు స్వాధీనం
 
హైదరాబాద్‌: గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు యువకులను నార్సింగి పోలీసులు, మాదాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితులైన సినీ నిర్మాత వి.రమేశ్‌తోపాటు మరొక నిందితుడు శేఖర్‌ పరారీలో ఉన్నట్లు డీసీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు. ఈ ఘటనలో రూ.37 లక్షల విలువ చేసే 200 కిలోల గంజాయి, రెండు కార్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ శనివారం తెలిపారు. నల్లగొండ జిల్లాకు చెందిన రామకృష్ణ(23), రవి(27), వెంకన్న(42) క్యాబ్‌ డ్రైవర్లుగా పనిచేశారు. ఆదాయం లేకపోవడంతో వాహనాలను అమ్మేసి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. పనికోసం వెంకన్న మామ దుర్గయ్యను సంప్రదించారు. దుర్గయ్య కొత్తగూడెం ప్రాంతానికి చెందిన వి.రమేశ్‌ను పరిచయం చేయగా.. ఆయన ద్వారా వైజాగ్‌కు చెందిన శేఖర్‌ పరిచయమయ్యాడు.

ఈ ముగ్గురూ శేఖర్‌ను కలసి గంజాయిని ముంబైకి తరలించేందుకు ఒప్పుకున్నారు. వీరికి ఈసారి నిర్మాత రమేశ్‌ కూడా జతకలిశాడు. ఈ ముగ్గురితోపాటు డ్రైవర్లు నరేశ్‌(25), మధు(24)ను కూడా తీసుకుని కార్లలో ముంబైకి బయలుదేరారు. సమాచారం అందుకున్న నగర టాస్క్‌ఫోర్స్, ఎస్‌ఓటీ, నార్సింగి పోలీసులు పుప్పాలగూడ ఓఆర్‌ఆర్‌ వద్ద వర్ణా కారును ఆపి సోదా చేశారు. వెనుక వర్ణాకారు రాకపోవడంతో నిస్సాన్‌ కారులోని వ్యక్తులు ఫోన్‌ చేయడంతో పోలీసులు కారు మరమ్మతుకు గురైందని చెప్పి వారిని రప్పించారు. దీంతో రెండు కార్లు, 200 కిలోల గంజాయితోపాటు ఐదుగురిని పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  
మరిన్ని వార్తలు