మార్క్‌ఫెడ్ ద్వారా ముతక ధాన్యం కొనుగోలు

25 Sep, 2016 02:59 IST|Sakshi
 • జొన్న, సజ్జ తదితరాలకు మద్దతు ధర ప్రకటించిన కేంద్రం
 • అక్టోబర్ ఒకటి నుంచి కొనుగోలుకు రాష్ట్రం సన్నాహాలు
 • సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఖరీఫ్ సీజన్ (2016-17)లో మొక్కజొన్న, జొన్న, రాగి, సజ్జ వంటి ముతక ధాన్యాన్ని రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముతక ధాన్యం దిగుబడులను అంచనా వేసి.. అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ధాన్యం సేకరించే బాధ్యతను రాష్ట్ర మార్కెటింగ్ సంస్థ మార్క్‌ఫెడ్‌కు అప్పగించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ, ఇతర సంక్షేమ పథకాలకు ముతక ధాన్యం అవసరం లేకున్నా.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఇటీవల ముతక ధాన్యాలకు మద్దతు ధర ప్రకటించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు అనుగుణంగా.. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ను ఆదేశించింది.

  2016-17 ఖరీఫ్ సీజన్‌కు గాను కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ.. మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.1,365, సజ్జకు రూ.1,330, జొన్న (హైబ్రిడ్)కు రూ.1,625, జొన్న (సాధారణ) రూ.1,650, రాగులకు రూ.1,725 చొప్పున మద్దతు ధర ప్రకటించింది. కాగా, ప్రస్తుత సీజన్‌లో 2.5 లక్ష ల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నతో పాటు.. ఇతర ధాన్యాలను దిగుబడి అంచనాలకు అనుగుణంగా కొనుగోలు చేయాలని మార్క్‌ఫెడ్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా, జిల్లాల వారీగా దిగుబడిని దృష్టిలో పెట్టుకుని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్క్‌ఫెడ్ నిర్ణయించింది. మెరుగైన పనితీరు ఉన్న జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలు (డీసీఎంఎస్‌లు), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌లు), గ్రామైఖ్య సంఘాలను కూడా కొనుగోలు ప్రక్రియలో భాగస్వాములను చేయనున్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలపై ఒత్తిడిని తగ్గించడం లక్ష్యంగా.. ముతక ధాన్యాన్ని ఎక్కువగా గ్రామాల్లోనే కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.
   
  అక్టోబర్ ఒకటి నుంచి కొనుగోలు
   అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ముతక ధాన్యం సేకరణను ప్రారంభించనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్ల బాధ్యతను జిల్లా జాయింట్ కలెక్టర్ నేతృత్వంలోని జిల్లాస్థాయి కమిటీకి అప్పగించారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాల్సిన బాధ్యతను జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో పీడీ (డీఆర్‌డీఏ), డీసీఓ, జేడీ (అగ్రికల్చర్), ఏడీ (మార్కెటింగ్), జిల్లా మేనేజర్ (మార్క్‌ఫెడ్), ఏరియా మేనేజర్ (ఎఫ్‌సీఐ) తదితరులు సభ్యులుగా ఉన్న కమిటీకి అప్పగించారు.

  రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం రవాణా, గన్నీ సంచుల ధరలు తదితరాలను కూడా ఈ కమిటీ నిర్ణయిస్తుంది. కొనుగోలు కేంద్రాల్లో హమాలీ చార్జీలు.. తదితరాలను నిర్ణయించేందుకు స్థానికంగా కమిటీని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన ధాన్యం నిలువ చేసేందుకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కేంద్ర, రాష్ట్ర గిడ్డంగుల సంస్థలు, ఎఫ్‌సీఐ, వ్యవసాయ మార్కెట్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా