జనశక్తి నేత కూర రాజన్నపై ‘రాజద్రోహం’ తగదు

7 May, 2015 02:26 IST|Sakshi

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క
 
దోమలగూడ: జనశక్తి నాయకులు కూర రాజన్న తదితరులపై రాజద్రోహం ఆరోపణలతో నమోదైన కర్నూలు కుట్ర కేసును ఎత్తి వేసి బేషరతుగా విడుదల చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క డిమాండ్ చేశారు. దోమలగూడలోని అరుణోదయ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆమె మాట్లాడారు. కూర రాజన్న, మరో 11 మంది అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన నీలం రాంచంద్రయ్య స్మృతిలో ప్రజలు నిర్మించుకున్న రాంచంద్రయ్య స్మారక పాఠశాల ఒడిదుడుకులు ఎదుర్కొంటుండటంతో ఈ విషయాన్ని చర్చించడానికి హైదరాబాదు నుంచి వెళ్లిన కూర రాజన్న తిరుగు ప్రయాణంలో అనారోగ్యంతో కర్నూలులో ఆగాడన్నారు.

రాజన్నతో పాటు కార్మిక సంఘం, రైతు కూలీ సంఘం నాయకులైన నంబి నర్సింహ్మయ్య, మోతా వెంకట్రావు, కర్నాకుల వీరాంజనేయులు, మాస్టారు నాగేందర్‌రావు, పెంచలయ్య, అందే బాలాజీలను అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి బలవంతంగా అరెస్టు చేశారని ఆరోపించారు. అంతకుముందే కర్నూలులో నివాసముంటున్న రాంచంద్రయ్య స్మారక పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయుడు, బోల్లవరం గ్రామ మాజీ సర్పంచు ఒడ్డె పోతనను ఇంట్లో అరెస్టు చేశారని, పీఓడబ్ల్యూ కార్యాలయంలో రైతుకూలీ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు బోయ సుంకులును, కర్నూలు బస్టాండ్‌లో వసంత్, చాకలి శ్రీను అనే యువకులను పట్టుకున్నారని చెప్పారు. వీరందరిపై 121 ఎ, 120 బి సెక్షన్‌ల కింద రాజద్రోహం కుట్ర కేసులు నమోదు చేశారన్నారు. ప్రభుత్వ కుట్ర అని ఆరోపించారు. ప్రజా సంఘాల నాయకులు విఠల్‌రాజ్ (ఏఐఎప్‌టియూ), హన్మేష్ (సీపీఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ), ఆవుల అశోక్, (పీడీఎస్‌యూ), మోహన్ బైరాగి (అరుణోదయ), రామలింగం (శోషిత జనసభ), నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు