ప్రసూతికి ప్రైవేటే!

28 Jan, 2016 04:23 IST|Sakshi
ప్రసూతికి ప్రైవేటే!

♦ సర్కారీ దవాఖానాలను నమ్మని జనం
♦ వాటిలో ప్రసవాలు 31 శాతమే
♦ 69 శాతం కాన్పులు ప్రైవేటు ఆసుపత్రుల్లో
♦ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో చేదు నిజాలు
♦ మొత్తమ్మీద 58 శాతం సిజేరియన్ కాన్పులే
♦ వాస్తవానికి 15 శాతం కాన్పులకే సిజేరియన్ అవసరం
 
 సాక్షి, హైదరాబాద్: తమిళనాడులో 80 శాతం కాన్పులు ప్రభుత్వాసుపత్రుల్లోనే జరుగుతాయి. తెలంగాణలో ఎన్ని జరుగుతాయో తెలుసా? కనాకష్టంగా 31 శాతం!! ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పు చేయించుకుంటే జనని సురక్ష, జనని శిశు సురక్ష పథకాల కింద రూ.వెయ్యి ప్రోత్సాహకమిస్తారు. కాన్పు కోసం తీసుకొచ్చేందుకు 108 వాహనం వస్తుంది. కాన్పు తర్వాత వెళ్లేప్పుడు రవాణా చార్జీలూ ఇస్తారు. భోజనం కోసం రోజుకు రూ.100 ఇస్తారు. పరీక్షలు, మందులన్నీ పూర్తిగా ఉచితం.

పైగా సిజేరియన్ అయితే ఐదు రోజులు ఆసుపత్రి లోనే ఉంచి రూ.500, సాధారణ ప్రసవమైతే మూడు రోజులుంచి రూ.300 ఇస్తా రు. ఇన్ని సదుపాయాలున్నా సరే... రాష్ట్రం లో కాన్పు కోసం ప్రభుత్వాసుపత్రుల గడప తొక్కేం దుకు గర్భిణులు, వారి కుటుంబీ కులు వెనకాడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణాలేమిటో తెలుసా? వసతుల లేమి, నరకప్రాయమైన గదులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం!! ఇవన్నీ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే వెల్లడిం చిన చేదు నిజాలు. ప్రసవాలు, సిజేరియన్లు ఇతరత్రా అంశాలపై విడుదల చేసిన నివేదికలో తెలంగాణ పరిస్థితిని సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించింది. రాష్ట్రంలో ఏటా 6.3 లక్షల ప్రసవాలు జరుగుతున్నాయి. వీటిలో 91 శాతం ఆసుపత్రుల్లో కాగా, మిగతావి ఇళ్ల వద్ద ఏఎన్‌ఎంలు, ఇతరుల సమక్షంలో జరుగుతున్నాయి. ఆసుపత్రి కాన్పుల్లో ఏకంగా 69 శాతం ప్రైవేటు ఆసుపత్రుల్లోనే జరుగుతున్నాయని సర్వే వెల్లడించింది.

 58 శాతం సిజేరియన్ ద్వారానే కాన్పులు
 కేంద్ర ఆరోగ్యశాఖ అంచనా ప్రకారం కాన్పుల్లో 12 నుంచి 15 శాతానికి మించి సిజేరియన్ల అవసరం రాదు. మిగిలినవన్నీ సాధారణ కాన్పులే కావాలి. కానీ తెలంగాణలో జరుగుతున్న ప్రసవాల్లో ఏకంగా 58 శాతం సిజేరియన్ ఆపరేషన్లే! ఇక ప్రైవేటు ఆసుపత్రుల్లో జరుగుతున్న కాన్పుల్లో 74 శాతం సిజేరియన్ ద్వారానే జరుగుతున్నాయని సర్వే తేల్చిచెప్పింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న కాన్పుల్లో 40 శాతం సిజేరియన్లని సర్వే తేల్చిం ది. తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్ కాన్పుల ద్వారా ఆయా ప్రైవేటు ఆసుపత్రులు ఏడాదికి రూ.1,500 కోట్లు ఆర్జిస్తున్నాయని రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు లెక్కగట్టారు. సాధారణ ప్రైవేటు ఆసుపత్రులు మొదలు కార్పొరేట్ ఆసుపత్రుల వరకు సిజేరియన్ కోసం రూ.30 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. సరాసరి ప్రైవేటు ఆసుపత్రులు ఒక్కో సిజేరియన్ ఆపరేషన్‌కు రూ.50 వేలు వసూలు చేస్తున్నాయన్నారు. వీటికి మందులు, రవాణా, ఇతరత్రా ఖర్చులు అదనమన్నారు.

 ప్రసవం డాక్టర్ పనికాదు.. నర్సే చేయాలి
 వాస్తవానికి కాన్పు పని డాక్టర్‌ది కాదని, ఆ బాధ్యత నర్సుదేనని డాక్టర్ శ్రీనివాసరావు అంటున్నారు. ‘‘విదేశాల్లో నర్సులే ఆ బాధ్యత నిర్వహిస్తారు. గర్భిణి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసి సాధారణమో లేదా సిజేరియన్ కాన్పో నిర్ణయించి నర్సుకు అప్పగించాలి’’ అని ఆయన చెప్పారు. కానీ ఇక్కడ అలా జరగడంలేదు. సాధారణ ప్రసవం జరిగే అవకా శం ఉన్నా వాటిని క్లిష్టంగా మార్చుతూ సిజేరియన్‌కే మొగ్గుచూపుతున్నారు. మరోవైపు ప్రసవం సులువుగా కాకుండా ప్రమాదమైతే ఎలా అన్న భయాందోళనలవల్ల కొన్ని కుటుంబాలు సిజేరియన్ వైపే మొగ్గుచూపుతున్నాయి. వారి బలహీనతలను కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రసవాలకూ ముహూర్తాలు పెట్టి మరీ సిజేరియన్ ద్వారా బిడ్డను బయటకు తీస్తున్నవారు కూడా ఉండడం గమనార్హం.
 
 ప్రభుత్వ ఆసుపత్రులపై వ్యతిరేకతకు కారణమిదీ..
 ► కాన్పు చేసే గదిలో కనీసం కర్టెన్లు లేని పరిస్థితి
 ► ఒకే గదిలో పక్కపక్కనే నలుగురైదుగురికి కాన్పు చేయడం
 ► ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్, నర్సులు ఉంటారన్న నమ్మకం లేకపోవడం.
 ►ఎప్పుడు వస్తారో ఎప్పడు పోతారో తెలియకపోవడం. సరైన స్పందన లేకపోవడం.
 ► ప్రమాదమైతే అందుకు తగ్గ ఏర్పాట్లు ఉంటాయన్న నమ్మకం లేకపోవడం.
 ► పరిశుభ్రమైన వాతావరణం లేకపోవడం
 ► పుట్టిన బిడ్డకు అనారోగ్యమైతే తక్షణమే స్పందించే పరిస్థితులు లేకపోవడం.
 ► గర్భిణిలతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం

మరిన్ని వార్తలు