మట్కా కనికట్టు.. బతుకు తాకట్టు

21 Jan, 2018 02:03 IST|Sakshi

పేదల బతుకులను చిదిమేస్తున్న మట్కా జూదం 

రాష్ట్రంలో నిషేధమున్నా విచ్చలవిడిగా పందేలు  

మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు పట్టణాల్లో దందా

ఆ రాష్ట్రాల్లో చట్టబద్ధం కావడంతో బహిరంగంగానే ‘నంబర్లాట’

మహారాష్ట్రలోని ‘ఉమ్మర్గ’లో ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన

అక్కడి లాడ్జీలన్నీ అడ్డాలే.. పందేలు కాస్తున్నవారిలో 80% తెలుగువారే

కూలీల నుంచి ఉద్యోగులు, వ్యాపారుల దాకా అందరూ బానిసలే..

‘ఆన్‌లైన్‌’తో మరింతగా విస్తరిస్తున్న మహమ్మారి

సభ్యత్వం తీసుకుని.. జస్ట్‌ ఫోన్‌ చేస్తే చాలు..

నేరుగా బ్యాంకు ఖాతాల నుంచే సొమ్ముల మార్పిడి

రాష్ట్రంలోని వివిధ పట్టణాల్లో ఏజెంట్లు

మెల్లమెల్లగా ఇక్కడా విస్తరిస్తున్న జూదం

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం గ్రామానికి చెందిన ఐజయ్య (పేరు మార్చాం) మట్కా జూదానికి బానిసయ్యాడు. జహీరాబాద్‌లోని ఓ హోటల్‌లో సర్వర్‌గా పనిచేస్తూ.. వచ్చిన డబ్బంతా ‘మెయిన్‌ ముంబై’ మట్కాలో పెట్టాడు. అడ్డగోలు వడ్డీకి అప్పులు చేసి కూడా పందేలు కాశాడు. కానీ ఇప్పటివరకు రూపాయి గెలుచుకున్నది లేదు. చివరికి ఉన్న రెండెకరాల పొలం అమ్ముకున్నాడు.

... వీరే కాదు.. తెలంగాణ పల్లెల్లో వేలకొద్దీ కుటుంబాలు మట్కా జూదానికి చిన్నాభిన్నమవుతున్నాయి. చెమటోడ్చి సంపాదించిన నాలుగు రాళ్లను మాయదారి మట్కానే మింగేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకల సరిహద్దు జిల్లాల్లో ఈ జూదం జోరుగా సాగుతోంది. మన రాష్ట్రంలో మట్కాపై నిషేధం ఉన్నా... ఆ రెండు రాష్ట్రాల్లో దానికి చట్టబద్ధత ఉంది. దీంతో ఇక్కడివారు సరిహద్దులు దాటివెళ్లి మరీ పందేల్లో పాల్గొంటున్నారు. కొందరు ఇక్కడి నుంచే ఫోన్ల ద్వారా పందేలు కాస్తున్నారు. దీనిపై ‘సాక్షి’ బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. మహారాష్ట్రలో మట్కాకు అడ్డా అయిన ‘ఉమ్మర్గ’ పట్టణానికి వెళ్లి పరిశీలించింది. ఈ సందర్భంగా ఎన్నో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. అక్కడ మట్కా ఆడుతున్న వారిలో తెలుగువారే ఏకంగా 80 శాతం వరకు ఉండడం గమనార్హం.  
– వర్ధెల్లి వెంకటేశ్వర్లు, సాక్షి ప్రతినిధి

తెల్ల బట్టలు.. మాసిన గడ్డంతో ఉన్న ఈ పెద్దాయన జీవితమంతా జూదంతోనే పండిపోయింది. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌కు చెందిన ఆయన.. భార్య పుట్టింటి నుంచి తెచ్చిన బంగారు నగలు, వారసత్వంగా వచ్చిన మూడెకరాల భూమిని మట్కాకే తగలేశాడు. చివరికి కుటుంబ సభ్యులను కూడా వదిలేసి వచ్చి మట్కాకు కేంద్రమైన ఉమ్మర్గ (మహారాష్ట్ర)లో మకాం పెట్టాడు. వారానికి రూ.రెండున్నర వేల జీతంతో మట్కా చీటీలు రాసే పని చేస్తున్నాడు. 

లక్షన్నర మందికిపైగా.. 
మట్కా జూదం కేవలం సరిహద్దు జిల్లాల్లోనే కాకుండా ఇటీవల ఉమ్మడి వరంగల్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలకు కూడా విస్తరించింది. రాష్ట్రం నుంచి రోజుకు సగటున 1.5 లక్షల మంది మట్కా పందేలు కాస్తున్నట్లు అంచనా. ఇందులో 50 వేల మంది వరకు సరిహద్దులు దాటి మహారాష్ట్ర పట్టణాల్లో ప్రత్యక్షంగా జూదంలో పాల్గొంటున్నట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేకాటపై ఉక్కుపాదం మోపిన నేపథ్యంలో..జూదరులు మట్కా వైపు దృష్టి సారించినట్లు చెబుతున్నారు. 

అక్కడ చట్టబద్ధమే.. 
మహారాష్ట్రలో మట్కాకు చట్టబద్ధత ఉంది. మెయిన్‌ ముంబై, రాజధాని నైట్, న్యూముంబై దబ్రా, సెంట్రల్‌ ముంబై, శుభలక్ష్మి, న్యూవర్లీ, రాజధానిడే, కల్యాణి.. ఇలా రకరకాల పేర్లలో వందకుపైగా మట్కా కంపెనీలు జూదం నిర్వహిస్తున్నాయి. అన్నీ కూడా నిరుపేదలు, దినసరి కూలీలు, మధ్యతరగతి వారు టార్గెట్‌గా నడుస్తున్నవే. ఇందులో రోహణ్‌ ఖత్రీ అనే వ్యక్తి నడిపిస్తున్న మెయిన్‌ ముంబై, కల్యాణ్‌ మట్కా కంపెనీలకు 75 శాతం మార్కెట్‌ వాటా ఉంది. ఈ రెండు ఆటలను కూడా అంతా పనులు ముగించుకొని ఇంటికొచ్చే వేళల్లో నిర్వహిస్తుంటారు. దీంతో వ్యాపారులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, యువత కూడా మట్కా ఆడుతున్నారు.

అంకెలు, సంఖ్యల మాయాజాలం!
మెయిన్‌ ముంబై, కల్యాణ్‌ కంపెనీలు రోజుకు ఒక ఆట నిర్వహిస్తాయి. 00 నుంచి 999 వరకు సంఖ్యల ఆధారంగా ఈ జూదం నడుస్తుంది. ఒక్కో ఆటలో ప్యానల్, సింగిల్, జోడీ, డబుల్‌ ప్యానల్‌ అనే విభాగాలు ఉంటాయి. ప్యానల్‌ను కూడగా వచ్చిన చివరి సంఖ్యను సింగిల్‌ అని పిలుస్తారు. ఆట ఓపెన్‌ కాకముందు ప్యానల్‌కు పందెం కాస్తే విజేతలకు ప్రతి రూ.10కి రూ.1,400 ఇస్తారు. డబుల్‌ ప్యానల్‌ గెలిస్తే రూ.2,400,  సింగిల్‌ నంబర్‌ గెలిస్తే రూ.95, జోడీ గెలిస్తే రూ.950 చొప్పున చెల్లిస్తారు. చాలా మంది జోడీ నంబర్‌ మీద పందెం కాస్తుంటారు. ఆట ఓపెన్‌ అయిన రెండు గంటల్లో ముగుస్తుంది. ఒక్కో ఆటలో 6 లక్షల నుంచి 10 లక్షల మంది వరకు పాల్గొంటారని మట్కా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. 

గ్రామీణ ప్రాంతాల నుంచే..
ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్, బేల మండలాలు, ఖానాపూర్, జిన్నింగ్‌ ఏరియాల్లో, ఖుర్షిద్‌నగర్, ఆదిలాబాద్‌లోని తాంసి బస్టాండ్, సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, న్యాల్‌కల్‌ మండలం రాజోల్, సంగారెడ్డి పట్టణం, నారాయణఖేడ్, సమీప గ్రామాలు, కామారెడ్డి జిల్లాలోని పిట్లం, బిచ్కుంద, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని కృష్ణా్ణ, మన్ననూరు, ఆత్మకూరు, నారాయణపేట మండలాల్లో మట్కా జూదం సాగుతున్నట్లుగా పోలీసుల వద్ద సమాచారం ఉంది. ఇక హైదరాబాద్, వరంగల్‌తో సహా అన్ని నగర, పట్టణ ప్రాంతాల్లో ఆన్‌లైన్‌ పందేలు ఎక్కువగా సాగుతున్నాయి. మొత్తంగా రోజుకు రూ. 3 కోట్ల నుంచి రూ. 5 కోట్ల వరకు చేతులు మారుతున్నట్లు అంచనా.

టెక్నాలజీతో విస్తృతమై..
ఒకప్పుడు కోడి పందాల తరహాలో ఒకచోట గుంపులుగా చేరి చీటీలపై నంబర్లతో సాగిన మట్కా దందా... సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో బాగా విస్తృతమైంది. మొబైల్‌ ఫోన్‌లో యాప్‌లు, ఎస్సెమ్మెస్‌ల స్థాయికి చేరింది. ఎక్కడున్నా, ఎక్కడి నుంచైనా మట్కా ఆడేలా వీలు ఏర్పడింది. ఇక తెలంగాణలో ప్రభుత్వం పేకాటపై ఉక్కుపాదం మోపడంతో జూదం ఆడేవాళ్లు మట్కావైపు మళ్లారు. పేకాట క్లబ్బులు నిర్వహించడంలో అనుభవమున్న వారు మట్కా ఏజెంట్లుగా మారిపోయారు. పందెం రాయుళ్ల నుంచి రూ.2 వేలు రుసుము తీసుకుని ఏడాది పాటు సభ్యత్వం ఇస్తున్నారు. పందెం డబ్బు చెల్లించడం కోసం బ్యాంకు ఖాతా నంబర్‌ ఇచ్చి, గెలిస్తే బహుమతి డబ్బు ఇవ్వడం కోసం జూదరుల ఖాతా నంబర్లు తీసుకుంటున్నారు. పందెం కాయాలనుకుంటే.. నిర్వాహకుల ఖాతాలో డబ్బులు వేసి, ఫోన్‌ చేసి ‘మట్కా’ ఓపెనింగ్‌ నంబరో, ప్యానల్‌ నంబరో, జోడీ నంబరో చెబితే నోట్‌ చేసుకుంటారు. గెలిస్తే పందెం కాసినవాళ్ల బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేస్తారు. పందెం కాయడం సులువుగా మారిపోవడంతో మట్కా మెల్లమెల్లగా విస్తరిస్తోంది. తెలంగాణలో కార్మికుల నుంచి కాంట్రాక్టర్ల వరకు చాలా మంది దీని మాయలో పడిపోతున్నారు. రాష్ట్రం నుంచి లక్ష మందికిపైగా సభ్యత్వం తీసుకున్నట్లు మహారాష్ట్రలోని ఉమ్మర్గలో ఉన్న మట్కా నిర్వాహకులు చెబుతుండడం గమనార్హం.

ఊరూరికీ ఏజెంట్ల వ్యవస్థ
ముంబై మాఫియా కనుసన్నల్లో నడిచే మట్కా జూదం ఏజెంట్ల వ్యవస్థ మీద ఆధారపడి కొనసాగుతోంది.  ప్రతి పట్టణంతో ఇద్దరు ముగ్గురు ఏజెంట్లను నియమించుకుని.. వారు సేకరించే పందెం సొమ్ము నుంచి 10 శాతం కమీషన్‌గా ఇస్తున్నారు. ఈ ఏజెంట్ల మీద పర్యవేక్షణకు మునీంలు, వారిపై పట్వారీలు.. అలా అధినేత వరకు ఉంటారు. వారికి వేర్వేరుగా కమీషన్లు ఉంటాయి. 

1 రాష్ట్రం నుంచి మొదలై..
మట్కా జూదం జరుగుతున్న తీరును గుర్తించడం కోసం ‘సాక్షి’ బృందం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని ఉమ్మర్గ పట్టణం వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ముందుగా జహీరాబాద్‌లో ఒక ఏజెంట్‌ను కలవగా.. ఆ సమయంలో న్యాల్‌కల్‌ మండలం రాజోల్‌లో జోరుగా పందేలు సాగుతాయని వెల్లడించాడు. కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఆ గ్రామానికి వెళుతుండగా పొలిమేరల్లోనే పందాల గుంపు కనిపించింది. అటువైపు వెళ్లేసరికి పందెం రాయుళ్లు, నిర్వాహకులు అడవిలోకి వెళ్లిపోయారు. అక్కడ జెరప్ప అనే వ్యక్తి, అతని అనుచరులు కలసి మట్కా జూదం నిర్వహిస్తుంటారని.. ప్రతి రోజూ మూడు నాలుగు వందల మంది పందేలు కాస్తుంటారని స్థానికుడొకరు వెల్లడించారు.

2 ఉమ్మర్గ.. పందాలకు అడ్డా
అనంతరం ‘సాక్షి’ బృందం మహారాష్ట్రలోని ఉమ్మర్గ పట్టణానికి వెళ్లి పరిశీలించింది. ఈ పట్టణం మట్కాకు ముంబై తర్వాత రెండో రాజధానిగా అభివర్ణిస్తుంటారు. రాష్ట్రం నుంచి చాలా మంది ప్రత్యక్షంగా మట్కా పందేలు కాయడం కోసం ఉమ్మర్గకు వెళుతుంటారు. ఉమ్మర్గ పట్టణం, సమీప గ్రామాల్లో కలిపి  150 వరకు లాడ్జీలు ఉండగా... ఇందులో పది పదిహేను మాత్రమే సాధారణ లాడ్జీలు. మిగతావన్నీ బెట్టింగ్‌ అడ్డాలే. వాటిల్లోకి ఉచితంగా వెళ్లవచ్చు. డబ్బులు తీసుకుని భోజనం, మద్యం కూడా సమకూర్చుతారు. అసలు ఈ పట్టణ జనాభాలో 40 శాతం మంది మట్కా ఏజెంట్లేనని, సుమారు 1,000 మంది ఏజెంట్లు ఉంటారని స్థానికులు చెప్పారు. ఇక్కడి లాడ్జీల్లో చాలా వరకు తెలంగాణ జిల్లాల నుంచి వచ్చేవారే ఉంటారని వెల్లడించారు. ‘సాక్షి’ బృందం ఓ స్థానిక సహాయకుడిని తోడు తీసుకుని పందేలు కాసే ఓ లాడ్జీలోకి వెళ్లింది. అందులో పది పన్నెండు చిన్న గదులు ఉండగా.. అంతా పందెం రాయుళ్లతో కిక్కిరిసి ఉన్నాయి. వారిలో 80 శాతం మంది తెలుగు వారే కనిపించారు. 20–30 మందితో మాట్లాడగా.. వారంతా హైదరాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల నుంచి వచ్చినట్టు చెప్పారు. రూ. 50 నుంచి రూ. 500 వరకు పందేలు కాస్తున్నారు.

3 పందెం కోసమంటూ వెళ్లి..
తర్వాత ఉమ్మర్గ పట్టణంలోని మహాదేవుని రోడ్డు ప్రాంతంలో ఉన్న మూడంతస్తుల మరో లాడ్జిలోకి పరిశీలన బృందం వెళ్లింది. అక్కడ దాదాపు 30 గదులు ఉండగా.. అన్నింటిలోనూ తెలుగు వాళ్లు కనిపించారు. రిటైర్డ్‌ ఉద్యోగుల నుంచి వ్యాపారులు, కూలీల వరకు అందరూ వారిలో ఉండడం గమనార్హం. ఒక్కసారి ఇక్కడికి వస్తే వారం రోజుల వరకు ఉంటారని గదులు శుభ్రం చేసే వ్యక్తి వెల్లడించాడు. ‘సాక్షి’ బృందం కూడా పందెం ఆడటానికంటూ ఆ లాడ్జిలోని ఒక గదిలోకి వెళ్లి పరిస్థితిని పరిశీలించింది. వారికి నమ్మకం కలిగించడానికి రూ.100, రూ.50 పందేలు కూడా కాసింది. ఫలితం వచ్చే సమయం దాకా అక్కడున్నవారితో మాటలు కలిపి.. వివరాలు సేకరించింది. 

4 మట్కా చీటీలు రాసేది తెలుగువాళ్లే..
ఆ లాడ్జి నిర్వహించే ఏజెంట్‌ వద్ద క్లర్కుగా పనిచేసే వ్యక్తిని ‘సాక్షి’ బృందం పలకరించగా.. అతను తన పేరు ‘ఎన్‌.రాజ్‌’ అని చెప్పాడు. ఉమ్మర్గ, పర్భణి, ధర్మపురి, నాందేడ్‌ తదితర ప్రాంతాల్లోని మట్కా కేంద్రాలకు తెలుగు వారే ఎక్కువగా వస్తారని వెల్లడించాడు. అందువల్ల కచ్చితంగా తెలుగు వచ్చిన వారినే ఏజెంటుగా, చీటీలు రాసే క్లర్కుగా తీసుకుంటారని చెప్పాడు. క్లర్కుకు వారానికి రూ. 2.5 వేలు జీతంగా ఇచ్చి భోజనం పెడతారని తెలిపాడు. ఫోన్‌ ద్వారా పందేలు కాయవచ్చని చెబుతూ.. ఆ ఫోన్‌ నంబర్లు కూడా రాసి ఇచ్చాడు. బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయాలని.. గెలిస్తే తాము కూడా ఖాతాలో జమ చేస్తామని చెప్పాడు.

5 పెద్ద ఏజెంట్‌పై ఆరా.. 
మట్కా కంపెనీల్లో నంబర్‌వన్‌ అయిన ‘మెయిన్‌ ముంబై’లో భారీగా పందెం కాస్తామని, ఆ స్థాయి ఏజెంట్‌ ఎవరని సాక్షి బృందం ఆరా తీసింది. దాంతో ఓ మధ్యవర్తి రూ.300 తీసుకుని.. పెద్ద ఏజెంట్‌ నిర్వహించే లాడ్జికి తీసుకెళ్లాడు. ఆ ఏజెంట్‌ పేరు రతన్‌ భాయ్‌ అని చెప్పాడు. బృందం ఆయనను కలవగా.. తెలుగువారని తెలుసుకుని మర్యాదగా ప్రవర్తించారు. భారీగా పందెం కాస్తామంటే ఐదు నుంచి 10 నంబర్ల మీద పెడితే మంచిదని సలహా కూడా ఇచ్చాడు. బ్యాంకులో డబ్బు వేసి.. ఫోన్‌కాల్, ఎస్సెమ్మెస్‌ ద్వారానైనా మట్కా స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చని చెప్పాడు. ఫోన్‌ నంబర్లు ఇచ్చాడు. ఆ నంబర్లకు కాల్‌ చేస్తే.. బ్యాంకు ఖాతాల నంబర్లు ఎస్సెమ్మెస్‌ చేస్తానన్నాడు. దీంతో పని ముగిసిన బృందం.. సరేనంటూ అక్కడి నుంచి తిరిగి వచ్చేసింది. 
 

మరిన్ని వార్తలు