రైల్వే ట్రాక్‌ల రక్షణకు చర్యలు

26 May, 2016 03:39 IST|Sakshi
రైల్వే ట్రాక్‌ల రక్షణకు చర్యలు

- చెరువులతో ముంపు ప్రమాదం ఉన్న చోట     నివారణ చర్యలు
- రైల్వే, నీటి పారుదల శాఖ అధికారుల భేటీలో నిర్ణయం
 
 సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలు కురిసిన ప్పుడు రైల్వే ట్రాక్‌లకు చేరువగా ఉన్న చెరువులు, వాగులు, నదుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని రైల్వే శాఖ, నీటిపారుదల శాఖలు నిర్ణయించాయి. జిల్లాల వారీగా ప్రమాదకరంగా ఉన్న చెరువులపై ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి సమన్వయ కమిటీలో చర్చించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలని ఇరుపక్షాలు అవగాహనకు వచ్చాయి. రైల్వేలైన్లకు ప్రమాదకరంగా మారిన చెరువులు, వాటి పునరుద్ధరణ వంటి అంశాలపై రైల్వే అధికారులు బుధవారం జలసౌధలో నీటి పారుదల శాఖ అధికారులతో భేటీ అయ్యారు.

దీనికి రైల్వే శాఖ నుంచి చీఫ్ ఇంజనీర్ బ్రహ్మానందం సహా ఇతర అధికారులు హాజరవగా, చిన్న నీటి పారుదల విభాగం నుంచి సీఈ నాగేంద్రరావు, ఇతర ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో గుర్తించిన 870 ముంపు ప్రమాదం ఉన్న చెరువుల పరిధిలో చేయాల్సిన సంయుక్త సర్వే, గండ్లు పడే అవకాశం ఉన్న చెరువుల పరిధిలో చేపట్టిన పునరుద్ధరణ, నవీకరణ చర్యలపై చర్చించారు. ఇప్పటికే సర్వే చేసిన 370 చెరువులు పోనూ మిగతా చెరువుల్లో త్వరితగతిన సర్వే పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు రెండు శాఖలు సమన్వయం చేసుకోవడం, ప్రమాదకరంగా ఉండే రైల్వేట్రాక్‌లపై గ్యాంగ్‌మెన్‌లు ఇచ్చే సమాచారం ఆధారంగా వేగంగా స్పందించడం వంటి అంశాలపై ఓ అవగాహనకు వచ్చారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా