దొంగతనానికి వెళ్లి... మృగాడిగా మారి

16 Oct, 2016 10:47 IST|Sakshi
దొంగతనానికి వెళ్లి... మృగాడిగా మారి

చిన్నారి లక్ష్మీప్రసన్నను హత్య చేసిన పొరుగింటి మైనర్
వీడిన మిస్టరీ... నిందితుడిని పట్టించిన చెప్పులు


సాక్షి, హైదరాబాద్/మేడ్చల్: మేడ్చల్ ఎల్లంపేట్‌కు చెందిన చిన్నారి ఇందుశ్రీ సాయిలక్ష్మీప్రసన్న(8) హత్య కేసులో మిస్టరీ వీడింది. దొంగతనానికి వెళ్లి... కామాంధుడిగా మారిన పొరుగింటి మైనరే ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తేలింది. ఘటనా స్థలిలో వదిలి వెళ్లిన ఎర్ర రంగు చెప్పుల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని శనివారం నాగోల్‌లోని జువైనల్ హోమ్‌కు తరలించారు. మేడ్చల్ ఠాణాలో పేట్‌బషీర్‌బాద్ ఏసీపీ అశోక్‌కుమార్, సీసీఎస్ ఏసీపీ ఉషారాణి, సీఐ రాజశేఖర్‌రెడ్డితోకలసి బాలనగర్ డీసీపీ సాయిశేఖర్ వివరాలు వెల్లడించారు.

నమ్మించి గొంతు కోశాడు...
ఎల్లంపేట్ గ్రామానికి చెందిన కృష్ణమూర్తి, భవానీ దంపతుల రెండో కుమార్తె లక్ష్మీప్రసన్న. ఇంటి సమీపంలోనే నిందితుడైన మైనర్(17) నివాసం. గతంలో కృష్ణమూర్తి కుటుం బం అతడి ఇంట్లో అద్దెకు ఉండటం వల్ల వీరి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పదో తరగతి వరకు చదివిన నిందితుడు చదువు అబ్బక గ్రామంలోని ఓ ప్రైవేటు కంపెనీలో కార్మికుడిగా పని చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడటంతో... వచ్చే జీతం సరిపోక చిన్నచిన్న దొంగతనాలు మొదలుపెట్టాడు. ఈ నెల 12న మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో కృష్ణమూర్తి ఇంటికి వెళ్లిన మైనర్... లక్ష్మీప్రసన్న కుక్కతో ఆడుకోవడం, ఆమె అక్క నిద్రిస్తుండడం గమనించాడు. చెప్పులు బయట విడిచి, బీరువా పైనున్న తాళం చెవితో బీరువా తెరిచి అందులో ఉన్న రూ.7వేలు దొంగిలించాడు.

అమ్మానాన్నలు లేరని, ఇంటికి ఎందుకు వచ్చావని లక్ష్మీప్రసన్న అతడిని ప్రశ్నించింది. ‘బీరువాలో ఉన్న ఆధార్ కార్డు తెమ్మని మీ నాన్నే చెప్పాడు’ అంటూ నిందితుడు నమ్మించాడు. ఇంతలోనే కామాంధుడిగా మారిన మైనర్... లక్ష్మీప్రసన్నను బాత్‌రూమ్‌లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. చిన్నారి కేకలు వేయడంతో బాత్‌రూమ్‌లో ఉన్న షేవింగ్ బ్లేడ్‌తో ఆమె మణికట్టును బలంగా కోశాడు. నొప్పితో లక్ష్మీప్రసన్న మరింత బిగ్గరగా అరవగా... వెంటనే గొంతు కోసి వెనక వైపునున్న ప్రహరీ దూకి నిందితుడు పారిపోయాడు.
 
నటించి... పక్కదారి పట్టించి...
అరుపులు విని చిన్నారి పిన్ని వెంకటలక్ష్మి ఇంట్లోకి రాగా, ప్రసన్న రక్తపు మడుగులో కనిపించింది. ఆమె వెంటనే పాపను తన చేతుల్లోకి తీసుకుని రోడ్డుపైకి వచ్చింది. ఇంతలో వెనుక నుంచి వచ్చిన నిందితుడు చిన్నారిని తన చేతుల్లోకి తీసుకుని ఆస్పత్రికి వెళ్లాడు. పోలీసు జాగిలాలు కూడా అతడిని గుర్తించలేకపోయాయి. ఆస్పత్రిలో లక్ష్మీప్రసన్న మరణించిందని వైద్యులు చెప్పగానే అతగాడు ఎక్కడలేని ప్రేమ ఒలకబోశాడు. కేసులో మొదట చిన్నారి కుటుంబీకులను అనుమానించి విచారించిన పోలీసులకు... వారు అమాయకులని తేలింది. ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క మొరగకపోవడంతో ఆ దిశగా దర్యాప్తు చేశారు.

డీసీపీ సాయిశేఖర్, సీపీ సందీప్‌శాండిల్యా శుక్రవారం ఎల్లంపేట్‌కు వెళ్లి బాధిత కుటుంబం నుంచి వివరాలు సేకరించారు. హత్య సమయంలో ఇంటి ముందు ఎర్ర రంగు చెప్పులున్నాయని హతురాలి పిన్ని చెప్పడంతో వాటి ఆధారంగా నిందితుడు పొరుగింటి మైనరని నిర్థారించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి రూ.6,200 నగదు స్వాధీనం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు