అన్న రాఖీ పండుగకు వస్తే బాగుండు

14 Aug, 2016 01:48 IST|Sakshi
అన్న రాఖీ పండుగకు వస్తే బాగుండు

* నయీమ్ వల్ల మేమంతా చెల్లాచెదురయ్యాం
* 17 ఏళ్ల తర్వాత కలుసుకున్నాం
* మీడియాతో బెల్లి లలిత అక్కాచెల్లెళ్లు

తుర్కపల్లి: ‘‘గ్యాంగ్‌స్టర్ నయీమ్ కారణంగా 17 ఏళ్లుగా మా నలుగురం అక్కాచెల్లెళ్లం, అన్నయ్య విడిపోయాం. నయూమ్ చనిపోయూడని తెలిసి ఈ రోజు ముగ్గురం అక్కాచెల్లెళ్లం కలుసుకున్నాం.. మా అన్నయ్య జాడ తెలియదు. ఈ రాఖీ పండుగకైనా వస్తే బాగుండు.. మేమంతా కలుసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నాం’’ అని బెల్లి లలిత సోదరీమణులు బాలకృష్ణమ్మ, గుంటి కవిత, సరిత అన్నారు. శనివారం వారు మీడియాతో మాట్లాడుతూ ‘‘మేము నలుగురం ఆడపిల్లలం, ఒక అన్నయ్య ఉన్నాడు.

మా నాన్న ఒగ్గు కథలు చెప్పి కుటుంబాన్ని పోషించేవాడు. చిన్నతనంలోనే నాన్న చనిపోవడంతో అన్న బెల్లి కృష్ణ ఆలనా పాలనా చూస్తూ మా పెళ్లిళ్ల్లు కూడా చేశాడు. తెలంగాణ సాధన కోసం లలిత కాలుకు గజ్జెకట్టి ఎన్నో వేదికల మీద తన ఆట పాటలతో జనాన్ని ఉర్రూతలూగించింది. భువనగిరి నియోజకవర్గంలో రాజకీయంగా ఎదుగుతుం దన్న కారణంతో కొంతమంది నాయకులు కక్షగట్టి 1999లో లలితను హత్య చేయించారు. అదే ఏడాది లలిత చెల్లెలు సరిత భర్త కరుణాకర్‌ను భువనగిరిలో హత్య చేశారు. ఆ తరువాత మా అక్క బాల కృష్టమ్మ భర్తను కూడా హత్య చేశారు. అలా ముగ్గురి హత్యలు జరిగిన తర్వాత మా కుటుంబం ఛిన్నాభిన్నమైంది. మా అన్న ఎక్కడున్నాడో కానీ.. రాఖీ పండుగకు రావాలని ఎదురుచూస్తున్నాం’’ అని చెప్పారు.

మరిన్ని వార్తలు