'కుని'కిపాట్లు..!

5 Aug, 2017 02:42 IST|Sakshi
'కుని'కిపాట్లు..!
కుటుంబ నియంత్రణ పట్టని వైద్య, ఆరోగ్య శాఖ.. మూడేళ్లుగా రాష్ట్రంలో ఇదే పరిస్థితి
కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న పురుషులకు ఇస్తున్న ప్రోత్సాహకం రూ. 1,500
స్త్రీలకు ఇస్తున్న ప్రోత్సాహకం రూ. 1,000
 
సాక్షి, హైదరాబాద్‌: దేశానికి అతి పెద్ద సవాలు.. జనాభా పెరుగుదల. దీంతో అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ (కు.ని.)కోసం పలు చర్యలు చేపట్టారు. అవగాహన, ప్రోత్సాహకాలతో పాటు దీని పర్యవేక్షణ బాధ్యతలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు కేటాయించారు. అయితే ఇప్పుడు ఈ శాఖ పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి కనిపిస్తోంది. దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సంఖ్య పెరుగుతూ వస్తుండగా.. గత మూడేళ్లుగా దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. గతంలో ఏటా జిల్లాలవారీగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల ప్రణాళిక సిద్ధం చేసి.. ఆయా జిల్లాలకు లక్ష్యాలను నిర్దేశించేది. ప్రస్తుతం లక్ష్యాలను సైతం నిర్దేశించే పరిస్థితి లేకుండాపోయింది. ఎవరైనా సిబ్బంది వ్యక్తిగత శ్రద్ధతో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను చేయించడమేగానీ.. శాఖాపరంగా పర్యవేక్షణ ఉండటంలేదు. దీంతో మూడేళ్లుగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు బాగా తగ్గుముఖం పట్టాయి.
 
ఏడు జిల్లాల్లోనే..
జనాభా నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేస్తోంది. కుటుంబ నియంత్రణ చేయించుకున్న వారికి ప్రోత్సాహకాలు ఇస్తోంది. మిగిలిన నిధులతో పోల్చితే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసుకున్న వారికి ఇచ్చే ప్రోత్సాహకాల నిధులను ముందుగానే విడుదల చేస్తోంది. గత ఏడాది వరకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న పురుషులకు, వైద్య సిబ్బందికి కలిపి రూ.1,500, అదే మహిళ అయితే ఆమెకు సిబ్బంది కలిపి అయితే రూ.వెయ్యి ఇచ్చేవారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఈ మొత్తాన్ని శస్త్రచికిత్స చేయించుకున్న వారికే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.

అయినా రాష్ట్రంలో శస్త్రచికిత్సలు బాగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని హైదరాబాద్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, వికారాబాద్, యాదాద్రి భువనగరి జిల్లాల్లోనే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు జరుగుతున్నట్లు వైద్య శాఖ తాజా నివేదికలో పేర్కొన్నాయి. పురుషుల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల్లో మాత్రమే పురుషుల కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు నమోదయ్యాయి. ఈ ఏడాది 112 మంది పురుషులు మాత్రమే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్నారని నివేదికలో వెల్లడైంది. 
మరిన్ని వార్తలు