మెడికల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఏపీ నో

6 Aug, 2016 02:44 IST|Sakshi

కోర్టుకు వెళ్లాలని విద్యార్థులకు సూచించిన రాష్ట్ర ప్రభుత్వం
 హైదరాబాద్: తమ విద్యార్థుల కోసం మెడికల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మరోసారి నిర్వహించాలని తెలంగాణ సర్కారు చేసిన విజ్ఞప్తిని ఏపీ ప్రభుత్వం తిరస్కరించింది. ఏపీ మెడికల్ ఎంసెట్‌లో అనేక మంది తెలంగాణ విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించారు. వీరు తెలంగాణ ఎంసెట్-2లోనూ టాప్ ర్యాంకులు దక్కించుకున్నారు. దీంతో తెలంగాణలోనే సీట్లు వస్తాయని భావించిన విద్యార్థులు.. ఏపీ మెడికల్ కాలేజీల్లో సీట్లు వచ్చే అవకాశమున్నా వదులుకున్నారు. దీంతో ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం కౌన్సెలింగ్‌కు ముందుగా నిర్వహించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు చాలామంది తెలంగాణ విద్యార్థులు హాజరుకాలేదు.

అయితే ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీకై.. పరీక్ష రద్దు కావడంతో వారి పరిస్థితి తలకిందులైంది. తమకు ఏపీ ఎంసెట్‌లో మంచి ర్యాంకులు వచ్చినందున అక్కడి కౌన్సెలింగ్‌కు హాజరయ్యేలా మరోసారి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు అవకాశం కల్పించాలని తెలంగాణ వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి, కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ కరుణాకర్‌రెడ్డిని కోరారు. దీంతో మంత్రి లక్ష్మారెడ్డి ఏపీ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పరిశీలిస్తానని కామినేని హామీ ఇవ్వడంతో కాళోజీ వర్సిటీ వీసీ.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ రవిరాజుకు లేఖ రాశారు. అయితే తెలంగాణ విద్యార్థుల కోసం మరోసారి వెరిఫికేషన్‌కు అవకాశం ఇవ్వలేమని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు తేల్చిచెప్పారు. ఈ మేరకు ఎన్టీఆర్ వర్సిటీ నుంచి తిరస్కరణ జవాబు వచ్చిందని కాళోజీ వర్సిటీ వీసీ కరుణాకర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

కోర్టుకు వెళ్లాలని సూచన..: సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ తిరస్కరించడంతో ఏం చేయాలన్న దానిపై కాళోజీ హెల్త్ వర్సిటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే  కౌన్సెలింగ్ ఇంకా పూర్తికాలేదని.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మాత్రమే తాము కోరుతున్నామని, దీన్ని మానవతాదృక్పథంతో పరిశీలిస్తే బాగుండేదని అధికారులు అభిప్రాయ పడుతున్నారు.పైగా ఈ నెల 6, 7, 8 తేదీల్లోనే కౌన్సెలింగ్ ఉండటంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వ్యక్తిగతంగా కోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు సూచిస్తోంది.

మరిన్ని వార్తలు