పాతబస్తీ... మెట్రో నాస్తి?

6 Apr, 2017 01:43 IST|Sakshi
పాతబస్తీ... మెట్రో నాస్తి?

18 నెలల ఆలస్యంతో ఆర్థిక భారం...
పెరిగిన మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని నిర్మాణ సంస్థ పేచీ!
జూన్‌లో మియాపూర్‌– ఎస్‌.ఆర్‌.నగర్‌ రూట్లోనే
మెట్రో పరుగులు.. పాతబస్తీ రూట్‌పై ఇంకా లేని స్పష్టత


సిటీబ్యూరో:  గ్రేటర్‌ వాసుల కలల మెట్రో ప్రాజెక్టు పాతనగరవాసులకు ‘కల’గానే మిగలనుంది. ప్రస్తుతం మెట్రో పనుల పురోగతి చూస్తే ఇదే విషయం సుస్పష్టమవుతోంది. సిటీలో నాగోల్‌–రాయదుర్గం (28 కి.మీ), ఎల్బీనగర్‌–మియాపూర్‌ (29 కి.మీ), జేబీఎస్‌–ఎంజీబీఎస్‌ (10 కి.మీ) మార్గాల్లోనే మెట్రో పనులు ఊపందుకున్నాయి. కానీ ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమా రూట్లో సుమారు 5.3 కి.మీ మార్గంలో మెట్రో మార్గాన్ని ప్రభుత్వం ఖరారు చేయకపోవడంతో పనులు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారడం గమనార్హం. మరోవైపు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన మెట్రో రెండోదశ ప్రాజెక్టు సైతం కాగితాలకే పరిమితమైంది. ఇక ఈ ఏడాది జూన్‌లో మియాపూర్‌–ఎస్‌.ఆర్‌నగర్‌ రూట్లోనే మెట్రోరైళ్లు పరుగులు తీసే అవకాశాలున్నట్లు తెలిసింది. నాగోల్‌–బేగంపేట్‌ మార్గంలో మెట్రో పరుగులకు పలు అడ్డంకులున్నాయి. ప్రధానంగా బేగంపేట్, సికింద్రాబాద్‌ ఒలిఫెంటా రైలు ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణం అసంపూర్తిగా మిగలడంతో ఈ రూట్లో మెట్రో రైళ్లు కూతపెట్టే అవకాశాలు కనిపించడంలేదు.  

నగరంలో మెట్రో పనులు ప్రారంభమై సుమారు ఐదేళ్లు కావస్తోంది. కానీ పాతనగరంలో ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమా మార్గంలో ఇప్పటివరకు పనులు ఊపందుకోలేదు. ప్రధానంగా ఈ రూట్లో 30కి పైగా ఉన్న ప్రార్థనాస్థలాల మనుగడకు ముప్పు వాటిల్లకుండా మెట్రో మార్గాన్ని మూసీనది మధ్యనుంచి మళ్లించాలని అప్పట్లో కొన్ని రాజకీయపార్టీలు డిమాండ్‌చేశాయి. దీంతో  రెండేళ్లక్రితం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్రో మార్గాన్ని మార్చుతామని ప్రకటించింది. ఈ అంశంపై నగరంలోని అన్ని రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తరవాతనే అలైన్‌మెంట్‌ ఖరారు చేస్తామని తెలిపింది. కానీ ఇప్పటివరకు సమావేశం నిర్వహించలేదు. అలైన్‌మెంట్‌ ఖరారు చేయలేదు. ఇక మెట్రో మార్గాన్ని మూసీ నదీగర్భం నుంచి మళ్లిస్తే నిర్మాణ పరంగా పలు సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని, వాణిజ్యపరంగా తమకు గిట్టుబాటుకాదని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ వర్గాలు ప్రభుత్వానికి స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో మెట్రో మార్గం కలగానే మిగలనుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

ఆలస్యంతో నాలుగువేల కోట్ల భారం..
గ్రేటర్‌లో మెట్రో పనులు 2012 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. నిర్మాణ ఒప్పందం ప్రకారం ఈ పనులను 2017 జూన్‌ నాటికి పూర్తిచేయాల్సి ఉంది. కానీ ఆస్తులసేకరణ ప్రక్రియ జఠిలంగా మారడం, కోర్టుకేసులు, రద్దీరూట్లలో పనులు చేపట్టేందుకు రైట్‌ఆఫ్‌వే సమస్యలు తలెత్తడం.. వెరసి ప్రాజెక్టును పూర్తిచేసే గడువు 2018 డిసెంబరుకు పొడిగించారు. దీంతో తొలుత అనుకున్న నిర్మాణ వ్యయం రూ.12,132 కోట్ల నుంచి ఇప్పుడు రూ.16,375 కోట్లకు చేరింది.

ద్రవ్యోల్బణం, సిమెంటు, స్టీలు ధరల్లో హెచ్చుతగ్గులు, సిబ్బంది జీతభత్యాలు, యంత్రపరికరాల దిగుమతులు, వాటి అద్దెలు, నిర్మాణం కోసం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకున్న రుణాలపై వడ్డీరేటు పెరగడం వంటి కారణాలతో వ్యయం రూ.4243 కోట్ల మేర పెరిగినట్లు తెలిసింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తమకు పరిహారంగా చెల్లించాలని నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టతనీయకపోవడం గమనార్హం.

జూన్‌లో మియాపూర్‌– ఎస్‌.ఆర్‌.నగర్‌ రూట్లోనే పరుగులు?
ఈ ఏడాది జూన్‌ నెలలో మియాపూర్‌–ఎస్‌.ఆర్‌.నగర్‌(14 కి.మీ) రూట్లోనే మెట్రోరైళ్లు పరుగులు తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నాగోల్‌–బేగంపేట్‌ మార్గంలో మెట్రో రైళ్లు పరుగులు తీయాలంటే బేగంపేట్, సికింద్రాబాద్‌ ఒలిఫెంటా రైలు ఓవర్‌బ్రిడ్జిల నిర్మాణాలను పూర్తిచేయాల్సి ఉంది. ఈ పనులను మే నెలాఖరునాటికి పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ పనులు ఆలస్యమైతే జూన్‌లో ప్రారంభించే అవకాశాలు లేనట్టే. కాగా ఈ ఏడాది డిసెంబరు నాటికి నాగోల్‌–రాయదుర్గం(28 కి.మీ), ఎల్బీనగర్‌–మియాపూర్‌ (29కి.మీ)మార్గాల్లో మెట్రో మార్గాన్ని పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ వర్గాలు ప్రకటించాయి.

కాగితాలపైనే రెండోదశ...
మెట్రో తొలిదశ పనులు ఊపందుకున్న తరుణంలో ప్రభుత్వం మెట్రో రెండోదశ ప్రాజెక్టును చేపడతామని రెండేళ్లక్రితం ఆర్భాటంగా ప్రకటించింది. పలు రూట్లలో సుమారు 56 కి.మీ మార్గంలో రెండోదశ మెట్రోను ప్రతిపాదించారు. దీనికి సంబంధించి ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్,హైదరాబాద్‌ మెట్రోరైలు,ఎల్‌అండ్‌టీ సంస్థల ప్రతినిధులు ఏడాదిక్రితం  ప్రతిపాదిత మార్గాల్లో పరిశీలన జరిపి సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఏడాది కావస్తున్నా ఈవిషయంలో ఒక్క అడుగూ ముందుకుపడకపోవడం గమనార్హం.

ప్రస్తుతం పనుల పురోగతి ఇదీ..
మూడు మార్గాల్లో మొత్తం 67 కి.మీ మార్గానికి గాను 52 కి.మీ మార్గంలో మెట్రో పిల్లర్ల నిర్మాణం, వీటిపై మెట్రోరైళ్లు పరుగులు తీసేందుకు వీలుగా వయాడక్ట్‌మార్గం సిద్ధమైంది.
మొత్తం 65 స్టేషన్లకుగాను 40 స్టేషన్లు సిద్ధమయ్యాయి. మరో 25 స్టేషన్ల నిర్మాణం పనులు ఊపందుకున్నాయి.
మొత్తం ప్రాజెక్టును 2018 డిసెంబరునాటికి పూర్తిచేస్తామని నిర్మాణ సంస్థ చెబుతోంది.
మూడు రూట్లలో పరుగులుతీసేందుకు 57 మెట్రోరైళ్లు మియాపూర్, ఉప్పల్‌ మెట్రో డిపోల్లో సిద్ధంగా ఉన్నాయి.

అసంపూర్తిగా మిగిలిన పనులివీ..
మొత్తం 65 స్టేషన్లలో 17 స్టేషన్లకు మాత్రమే పార్కింగ్‌ వసతులున్నాయి. మిగతా వాటికి పార్కింగ్‌ స్థలాల లభ్యత కష్టసాధ్యంగా మారింది.
ఎల్భీనగర్‌–మియాపూర్‌ మార్గంలో: అసెంబ్లీ స్టేషన్‌ నిర్మాణం మొదలుకాలేదు. 19 పిల్లర్లు, 8 పునాదులు అసంపూర్తిగా ఉన్నాయి. లక్డీకాపూల్, మలక్‌పేట్‌ ఆర్‌ఓబీల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి.
జేబీఎస్‌–ఫలక్‌నుమా మార్గంలో: బోయిగూడ స్టీలు బ్రిడ్జి నిర్మాణం పూర్తికాలేదు. నారాయణగూడ ఫ్లైఓవర్, పుత్లీబౌలి మెట్రో మార్గం పైనుంచి మెట్రో వయాడక్ట్‌ నిర్మాణం ప్రారంభంకాలేదు.
నాగోల్‌–రాయదుర్గం మార్గంలో:ఒలిఫెంటా,బేగంపేట్‌ రైలు ఓవర్‌బ్రిడ్జీల నిర్మాణం పూర్తికాలేదు. అమీర్‌పేట్‌ మైత్రీవనం,యూసుఫ్‌గూడా ప్రాంతాల్లో వయాడక్ట్‌ మార్గం పూర్తికాలేదు.
సుమారు వంద ఆస్తుల సేకరణకు సంబంధించి బాధితులకు పరిహారం అందించకపోవడం,న్యాయవివాదాలు పనుల వేగాన్ని దెబ్బతీస్తున్నాయి.

మరిన్ని వార్తలు