‘అడ్రస్‌’ మెట్రోనే చెబుతుంది!

18 Sep, 2017 03:13 IST|Sakshi
‘అడ్రస్‌’ మెట్రోనే చెబుతుంది!
పిల్లర్లకు ప్రత్యేక సంఖ్యల కేటాయింపు  
- దీంతో చిరునామా గుర్తింపు సులభతరం  
-  గూగుల్‌ మ్యాప్, జీపీఎస్‌లతో అనుసంధానం  
 
సాక్షి, హైదరాబాద్‌: మెట్రో రైలు రాకతో ప్రయాణం సులభమవడమే కాదు... నగరంలోని చిరునామాలు కూడా సులువుగా గుర్తించేలా అడుగులు పడుతున్నాయి. మెట్రో రైలు పిల్లర్లకు ఆల్ఫాన్యూమరిక్‌తో పాటు ప్రత్యేక సంఖ్యలు కేటాయించి.. గూగుల్‌ మ్యాప్, గ్లోబల్‌ పొజిషన్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌)లతో అనుసం«ధానించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో నగరవాసులతో పాటు కొత్తగా వచ్చిన వారు ఎవరైనా మెట్రో పిల్లర్‌పైనున్న నంబర్‌ ఆధారంగా అడ్రస్సు సులువుగా కనుగొనే అవకాశం కలుగుతుంది.

ఇప్పటికే శంషాబాద్‌ విమానాశ్రయానికి మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్‌ వరకు నిర్మించిన 11.6 కిలోమీటర్ల పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో పిల్లర్లకు నంబర్లు కేటాయించారు. దీంతో ఆ మార్గంలో చాలా మంది చిరునామాలు చెప్పాలంటే పిల్లర్ల సంఖ్య చెబుతుంటారు. దీనివల్ల అడ్రస్‌ పట్టుకోవడం సులువైంది. ఇదే విధానం మెట్రో రైలు మార్గంలోని పిల్లర్లకూ అన్వయించనున్నారు. ఆదివారం మెట్రో రైలు భవన్‌లో హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. వివిధ రోడ్లు, ప్రాంతా లు, సమీపంలోని కాలనీలకు వెళ్లే మార్గాలను సూచించేలా సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు.

అలాగే... కారిడార్‌–1 (మియాపూర్‌–ఎల్‌బీనగర్‌ మార్గం)ను ‘ఏ’గా... కారిడార్‌–2 (జేబీఎస్‌–ఫలక్‌నుమా)ని ‘బీ’గా... కారిడార్‌–3 (నాగోల్‌–రాయదుర్గం)ని ‘సీ’గా పేర్కొంటూ మెట్రో పిల్లర్లకు ప్రత్యేక సంఖ్యలు కేటాయించనున్నారు. ఉదాహరణకు మియాపూర్‌–ఎల్‌బీనగర్‌ మార్గంలో కారిడార్‌ ప్రారంభమయ్యే మియాపూర్‌ స్టేషన్‌ వద్ద పిల్లర్‌కు ‘ఏ1’నంబర్‌ను కేటాయిస్తారు. అదే మార్గంలో అమీర్‌పేట స్టేషన్‌ వద్ద పిల్లర్‌ను ఏ450గా పేర్కొంటారు. ఎంజీబీఎస్‌–ఫలక్‌నుమాను కలుపుకుని ఉన్న మూడు కారిడార్లలో 2,748 పిల్లర్లున్నాయి. 
 
స్టేషన్ల వద్ద గేట్‌ నంబరింగ్‌...  
ప్రతి మెట్రో స్టేషన్‌లో నాలుగు ఎంట్రీలు, ఎగ్జిట్‌లు ఉంటాయి. ఉదాహరణకు అమీర్‌పేట స్టేషన్‌లో అమీర్‌పేట గేట్‌ 1, అమీర్‌పేట గేట్‌ 2 అని ఉంటుంది. జపాన్‌లోని టోక్యో లాంటి నగరాల్లో అంకెలతో ఉన్న గేట్లు వివిధ వేదికలు, ప్రాంతాలు, కార్యాలయాలకు మార్గాలు చూపెడతాయి. ఈ నంబరింగ్‌ వల్ల ప్రతి ఒక్కరూ సరైన ప్రాంతానికి చేరుకోగలుగుతారు. మెట్రో స్టేషన్లకు వచ్చే మార్గాలు, సమీప ప్రాంతాలకు వెళ్లే మార్గాల వివరాలు తెలిసేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఎల్‌ఈడీ స్క్రీన్లపై ప్రదర్శిస్తారు.  
 
సూచనలుంటే పంపించండి..
‘విజిటర్‌ ఫ్రెండ్లీ సిటీ’గా హైదరాబాద్‌ను మార్చేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలను స్వాగతిస్తున్నామని హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి తెలిపారు. ప్రజల సూచనలను హెచ్‌ఎంఆర్‌ఎల్‌ వెబ్‌సైట్‌లో పోస్టు చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ ఉన్నతాధికారులు శివానంద్‌ నింబర్గి, అలని కుమార్‌ సైనీ, రాజీవ్‌ అయ్యర్, డీవీఎస్‌ రాజు, వినోద్‌ కుమార్, విష్ణువర్ధన్‌ రెడ్డి, బీఎన్‌ రాజేశ్వర్‌ పాల్గొన్నారు. 
మరిన్ని వార్తలు