మెట్రోరూట్లలో రహదారులకు మరమ్మతులు షురూ

13 Oct, 2016 21:36 IST|Sakshi
ఖైరతాబాద్‌ వద్ద రహదారి మరమ్మతు పనులను పరిశీలిస్తున్న ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి

సాక్షి, సిటీబ్యూరో:

మెట్రో కారిడార్లలో దారుణంగా దెబ్బతిన్న రహదారులకు రూ.20 కోట్ల అంచనా వ్యయంతో హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ మరమ్మతులు చేపట్టింది. ప్రధానంగా ఎల్భీనగర్‌–దిల్‌సుఖనగర్‌–ఛాదర్‌ఘాట్, రంగ్‌మహల్‌ జంక్షన్‌ –నాంపల్లి–ఖైరతాబాద్, పంజాగుట్ట–ఎస్‌.ఆర్‌.నగర్‌– కూకట్‌పల్లి మార్గాల్లో రహదారులు దెబ్బతినడంతో వాహనదారులు, ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్న నేపథ్యంలో అధికారులు రంగంలోకి దిగారు. గురువారం ఖైరతాబాద్‌ ప్రధాన రహదారిపై ఉన్న రాజీవ్‌ గాంధీ విగ్రహం వద్ద మరమ్మతు పనులను హెచ్‌ఎంఆర్‌ ఎండీ పరిశీలించారు. ఈ ప్రాంతంలో భారీగా వరదనీరు నిలుస్తుండడంతో ప్రధాన రహదారిపై భారీగా గోతులు ఏర్పడ్డాయి. వీటిని సిమెంట్‌ ఇటుకలు(పేవర్‌బ్లాక్స్‌)ఏర్పాటుతో పూడ్చివేశారు. సికింద్రాబాద్‌–బేగంపేట్, జూబ్లీహిల్స్‌ రోడ్‌నెం.5,36, సికింద్రాబాద్‌–ముషీరాబాద్‌–ఆర్టీసీ క్రాస్‌రోడ్‌–బడీచౌడి,పుత్లీబౌలీ ప్రాంతాల్లోనే రహదారులకు తక్షణం మరమ్మతులు చేపట్టేందుకు టెండర్లు పిలిచి పనులు అప్పగించినట్లు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

ఖైరతాబాద్‌ జంక్షన్‌, పెద్దమ్మగుడి, మాదాపూర్‌ స్టేషన్‌ ప్రాంతాల్లో సిమెంటు ఇటుకలతో(పేవర్‌బ్లాక్స్‌)ఏర్పాటుతో రహదారులపై భారీ గోతులు ఏర్పడకుండా శాశ్వత పరిష్కారం దిశగా మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. పలు యురోపియన్‌ దేశాలు, ముంబయి మహానగరంలోనూ లోతట్టు ప్రాంతాలు (వాటర్‌లాగింగ్‌ ఏరియా)లలో పేవర్‌బ్లాక్స్‌ ఏర్పాటుతో రహదారులు దెబ్బతినకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు. నెలరోజుల్లోగా మెట్రో కారిడార్లలో దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు పూర్తిచేస్తామని ఎండీ తెలిపారు. మియాపూర్‌–కూకట్‌పల్లి, ఒలిఫెంటా బ్రిడ్జి, గ్రీన్‌ల్యాండ్స్, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడా ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులకు ఎల్‌అండ్‌టీ సంస్థ మరమ్మతులు చేపడుతుందని ఎండీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు